Begin typing your search above and press return to search.

నెట్ ఫ్లిక్ కోసం వెంకీ - రానా ల ''రానా నాయుడు''

By:  Tupaki Desk   |   22 Sep 2021 5:40 AM GMT
నెట్ ఫ్లిక్ కోసం వెంకీ - రానా ల రానా నాయుడు
X
టాలీవుడ్ లో దగ్గుబాటి హీరోల మల్టీస్టారర్ గురించి ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి కానీ.. ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. అయితే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ కోసం విక్టరీ వెంకటేష్ - రానా దగ్గుబాటి కలిసి ఓ వెబ్ సిరీస్ చేస్తారని ఆ మధ్య డి. సురేష్ బాబు కంఫర్మ్ చేశారు. ఈ నేపథ్యంలో వెంకీ - రానా కాంబోలో ''రానా నాయుడు'' అనే వెబ్ సిరీస్ ని నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.

అమెరికన్ క్రైమ్ డ్రామా ‘రే డోనోవన్’ కు రీమేక్ గా ''రానా నాయుడు'' వెబ్ సిరీస్ రూపొందనుంది. ‘మీర్జాపూర్’ ఫేమ్ కరణ్ అన్షుమన్ మరియు సుప్రన్ ఎస్ వర్మ ఈ సిరీస్ కు దర్శకత్వం వహిస్తారు. మొట్టమొదటిసారిగా 'బాహుబలి' భల్లాలదేవుడు రానా దగ్గుబాటి మరియు సూపర్ స్టార్ వెంకటేష్ దగ్గుబాటి కలిసి చేయబోయే ఈ క్రైమ్-డ్రామా సిరీస్ మునుపెన్నడూ చూడని విధంగా ఉంటుందని నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది.

పవర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ స్టోరీతో రూపొందే ''రానా నాయుడు'' సిరీస్ కోసం వెంకటేష్ - రానా లతో చేసిన లుక్ టెస్ట్ ఇమేజ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో దగ్గుబాటి హీరోలిద్దరూ స్టైలిష్ గా కనిపిస్తున్నారు. కాకపోతే వెంకీ మిడిల్ ఏజ్డ్ పర్సన్ గెటప్ లో ఉన్నాడు. ఈ ఇద్దరికీ ఇది డెబ్యూ వెబ్ సిరీస్ కావడం గమనార్హం. త్వరలోనే ఈ సిరీస్ షూటింగ్ ప్రారంభం కానుంది. దగ్గుబాటి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

''రానా నాయుడు'' అనౌన్స్ మెంట్ సందర్భంగా రానా దగ్గుబాటి మాట్లాడుతూ, "ఇది నాకు చాలా ప్రత్యేకమైనది. మా బాబాయ్ వెంకటేష్ తో కలిసి పని చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇప్పటికి నా కల నిజమైంది. 'రాణా నాయుడు' త్వరలో నెట్ ఫ్లిక్స్ లో రాబోతోంది. అందరికీ బాగా తెలిసిన ఫ్లాట్ ఫార్మ్ అండ్ టీమ్ తో కలిసి వర్క్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది సవాలుతో కూడుకున్నది. ఖచ్చితంగా సరదాగా ఉంటుంది. త్వరలో చిత్రీకరణ కోసం ఎదురుచూస్తున్నాను'' అని అన్నారు.

''రానా తో కలిసి పనిచేయడానికి నేను వేచి ఉండలేకపోతున్నాను. రానా నా ముందు ఒక చిన్న పిల్లవాడి నుండి చక్కటి నటుడిగా ఎదగడం నేను చూశాను. కానీ 'రాణా నాయుడు' లో అతను ఇంకా బాగా కనిపిస్తాడు. మేమిద్దరం కలిసి సెట్లో బ్లాస్ట్ చేయబోతున్నాము. మాకు ఇది సరైన ప్రాజెక్ట్ అని భావిస్తున్నాను. నేను 'రే డోనోవన్' సిరీస్ కు పెద్ద అభిమానిని. మేము దానికి న్యాయం చేస్తామని నమ్ముతున్నాం'' అని విక్టరీ వెంకటేష్ తెలిపారు.