Begin typing your search above and press return to search.

వెంకీతో ‘ఛలో’అంటున్న నితిన్

By:  Tupaki Desk   |   19 Feb 2018 8:10 AM GMT
వెంకీతో ‘ఛలో’అంటున్న నితిన్
X
మన టాలెంట్ చూపించే కరెక్ట్ టైం రావాలే గాని ఒక్క సినిమాతో జాతకాలు మారిపోవడం సినిమా పరిశ్రమలోనే చూడొచ్చు. దీనికి మరో ఉదాహరణగా నాగ శౌర్య ‘ఛలో’ దర్శకుడు వెంకీ కుడుముల నిలుస్తాడు. తక్కువ బడ్జెట్ లో కామెడీ కలగలిసిన యూత్ ఫుల్ లవ్ స్టొరీ తీసిన వెంకీకు ప్రేక్షకుల నుంచే కాక ఇండస్ట్రీ నుంచి కూడా మంచి ప్రశంశలు దక్కాయి. పెద్ద సినిమాల పోటీ ఎంత ఉన్నా చాలా చోట్ల ఛలో ఇంకా స్టడీగానే ఉండటం దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. దీంతో ఇప్పుడు వెంకీ కుడుములకు డిమాండ్ పెరిగింది. కాని ఏ ఆఫర్ వచ్చినా తన కెరీర్ ఓనమాలు దిద్దుకున్న హారికా హాసిని సంస్థలోనే తన రెండో సినిమా చేసే విధంగా ప్లానింగ్ జరుగుతోందని టాక్. నితిన్ ను పర్సనల్ గా కలవడమే కాక ఛలో సినిమాను చూపించి నితిన్ మెచ్చుకోవడం గురించి ట్విట్టర్ లో షేర్ చేసుకున్న వెంకీ కుడుముల నాగ చైతన్య కు కూడా చూపించి భలే అనిపించుకున్నాడు.

నితిన్ గతంలో అఆ కోసం హారికా హాసిని సంస్థతో అసోసియేట్ అయ్యాడు. ఇప్పుడు చేస్తున్న చల్ మోహనరంగా తర్వాత హారికా హాసిని బ్యానర్ సిస్టర్ కన్సర్న్ గా ఉన్న సితార ఎంటర్ టైన్మెంట్స్ కోసం నితిన్ డేట్స్ ఇచ్చినట్టు తెలిసింది. ఆ స్లాట్ లో వెంకీ కుడుములతో నితిన్ హీరోగా సినిమా చేయించే దిశగా చర్చలు జరుగుతున్నాయి అని టాక్. వెంకీ కూడా కథను సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాడట. తన బలమైన కామెడీ టైమింగ్ ని మిస్ కాకుండా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సిద్ధం చేస్తున్నట్టు టాక్.

ఇది జరిగితే వెంకీ కుడుముల దశ తిరిగినట్టే. హారికా బ్యానర్ లో నిర్మాణ విలువలు త్రివిక్రమ్ శిష్యుడిగా వెంకీకి తెలియనిది కాదు. సో అది దృష్టిలో పెట్టుకునే స్క్రిప్ట్ వండే పనిలో ఉన్నాడట. నితిన్ మాత్రం ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉందని తెలిసింది. లై దెబ్బ తర్వాత స్క్రిప్ట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్న నితిన్ చల్ మోహనరంగా విడుదలయ్యే లోపు దీని గురించి ఒక నిర్ణయం తీసుకోవచ్చు.