Begin typing your search above and press return to search.

‘కంచె’ రిలీజయ్యాకే నమ్మకమొచ్చిందట

By:  Tupaki Desk   |   12 Feb 2018 6:14 PM GMT
‘కంచె’ రిలీజయ్యాకే నమ్మకమొచ్చిందట
X
మామూలుగా వరుణ్ తేజ్ ను చూస్తే ప్రభాస్ లాగా మాస్ పాత్రలకు సరిపోతాడేమో అనిపిస్తుంది. కానీ అతను మాత్రం తొలి సినిమాగా ‘ముకుంద’ లాంటి క్లాస్ లవ్ స్టోరీని ఎంచుకున్నాడు. ఆ తర్వాత కూడా ఎక్కువగా క్లాస్ టచ్ ఉన్న లవ్ స్టోరీలే చేశాడు. అతను చేసిన మాస్ సినిమాలకు దారుణమైన ఫలితాలొచ్చాయి. ఐతే ‘తొలి ప్రేమ’ దర్శకుడు వెంకీ అట్లూరి ఈ చిత్ర కథ రాసుకున్నాక వరుణ్ తేజే హీరోగా సరిపోతాడనిపించిందట. కానీ అతను ఈ పాత్ర చేయడేమో అని సందేహించాడట. కానీ ‘కంచె’ సినిమా చూశాక అతనీ సినిమా చేస్తాడని నమ్మకం వచ్చిందట.

‘‘నేను ‘తొలి ప్రేమ’ కథ రాసుకున్నాక వరుణ్ తొలి సినిమా ‘ముకుంద’ టీజర్ రిలీజైంది. అది చూశాక అతను నా హీరోగా సరిపోతాడనిపించింది. ఐతే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చాడు కదా.. మాస్ సినిమాలు చేయాలనుకుంటాడేమో అని అతడిని వెంటనే అడగలేదు. కానీ ‘కంచె’ సినిమా చూశాక అతను వెరైటీ సినిమాలే కోరుకుంటున్నాడని అర్థమైంది. ‘లోఫర్’ కంటే ముందే ఈ కథ అతడికి చెప్పా. వెంటనే ఓకే చెప్పాడు. కానీ సినిమా సెట్స్ మీదికి వెళ్లడానికి ఆలస్యమైంది. ముందు దిల్ రాజు గారే ఈ సినిమా చేస్తానన్నారు. కానీ ఆయనకు చాలా కమిట్మెంట్లు ఉండటంతో నా స్నేహితుడైన బాపినీడు (భోగవల్లి ప్రసాద్ కొడుకు)కు కథ చెప్పా. అతను సినిమా నిర్మించడానికి ముందుకొచ్చాడు. ఐతే వరుణ్ మోకాలి గాయంతో ఐదు నెలలు ఇంటికే పరిమితం కావడంతో సినిమా మరింత ఆలస్యమైంది. ఒక సినిమా కోసం నాలుగైదేళ్లు ఎదురు చూడటం కష్టమే. చాలా కష్టాలు పడ్డాను. కానీ ఇప్పుడు అందుకున్న విజయంతో ఆ కష్టాలేవీ కనిపించట్లేదు’’ అని వెంకీ అన్నాడు.