Begin typing your search above and press return to search.

చిన్నోడిని ఛాలెంజ్ చేసిన పెద్దోడు...!

By:  Tupaki Desk   |   23 April 2020 2:20 PM IST
చిన్నోడిని ఛాలెంజ్ చేసిన పెద్దోడు...!
X
ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటి పనుల్లో ఆడవారికి సాయపడాలనే ఉద్దేశ్యంతో మొదలైన ‘బి ద రియల్ మ్యాన్‘ ఛాలెంజ్ టాలీవుడ్ ప్రముఖులు ఒకరి తరువాత మరొకరికి చేరుతూ ముందుకు సాగుతోంది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా స్టార్ట్ చేసిన ఈ ఛాలెంజ్ ఇప్పుడు టాలీవుడ్ సూపర్ సీనియర్ హీరోల దాకా వచ్చి చేరింది. సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కూడా ఈ ఛాలెంజ్ లో పాల్గొని ఇంటి పనులు చేయడంలో మేము కూడా ఎప్పుడు ముందే ఉంటామని నిరూపించారు. మెగాస్టార్ చిరంజీవి దోశె వేస్తే.. వెంక‌టేష్ మిక్స్‌డ్ వెజిటేబుల్ కర్రీ చేసేశారు. ఇటీవల జక్కన్న విసిరిన ఛాలెంజ్ స్వీకరించిన ఎన్టీఆర్ ఇంటి పనులు చేస్తున్న వీడియోను పోస్ట్ చేసి అగ్ర కథానాయకులు చిరంజీవి - నాగార్జున - వెంకటేష్ - బాలయ్యలను ఇంటి పనులు చేయాల్సిందిగా ఛాలెంజ్ విసిరాడు. ఎన్టీఆర్ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన చిరు ఇప్పటికే ఇంటి పనులను చేస్తున్న వీడియోను షేర్ చేశాడు. 'రోజూ చేసే పనే అయినా ఇవ్వాళ మీకోసం ఈ వీడియో సాక్ష్యం' అంటూ పోస్ట్ చేసాడు.

ఇప్పుడు తాజాగా 'బీ ది రియల్ మ్యాన్' ఛాలెంజ్‌ లో భాగంగా ఎన్టీఆర్ సవాలుని స్వీకరించిన విక్టరీ వెంకటేష్‌ ఈ మేరకు ఇంటి పనులు చేస్తూ వీడియో పోస్టు చేశాడు. గార్డెన్ లో మొక్కలు కట్ చేస్తూ.. మొక్కలకి నీళ్లు పెడుతూ బిజీగా గడిపాడు. అంతటితో ఆగకుండా కిచెన్‌ లోకి వెళ్లి కర్రీ కూడా చేసేసాడు. క్యారట్ ముక్కలు కట్ చేసి.. అందులో పన్నీర్ వేసి నోరూరించే విజిటెబుల్ కర్రీని రెడీ చేసాడు. వెంకటేష్ టాస్క్ పూర్తయ్యాక తాపీగా కూర్చొని బుక్ చదువుకున్నాడు. 'ఇదిగో నా వీడియో తారక్ అంటూ.. అందరూ ఇంట్లో వారికి డొమెస్టిక్ వర్క్ లో హెల్ప్ చేయండి' అని పిలుపునిచ్చాడు. అంతేకాకుండా ఈ ఛాలెంజ్ ను కొనసాగించాల్సిందిగా వెంకీ సిల్వర్ స్క్రీన్ బ్రదర్ మహేష్ బాబుని.. వెండితెర కోబ్రా (కో బ్రదర్) వరుణ్ తేజ్.. డైరెక్టర్ అనిల్ రావిపూడిలకు సవాలు విసిరాడు. సూపర్ స్టార్ ని ఎవరు ఛాలెంజ్ చేస్తారని ఎదురు చూసిన అభిమానులకు ఫైనల్ గా వెంకీమామ ఛాలెంజ్ చేసాడు. పిల్లతో ఆడుకుంటూ.. ఫ్యామిలీ తో ఎంజాయ్ చేసే సూపర్ స్టార్ ని చూసిన అభిమానులు ఇంటిపని - వంటపని చేసే మహేష్ ని చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి మహేష్ బాబు ఈ టాస్క్ ను ఎంత ఇన్నోవేటివ్ గా పూర్తి చేస్తాడో చూడాలి.