Begin typing your search above and press return to search.

స్టార్ హీరో మరో రీమేక్ పై కన్నేసాడా..?

By:  Tupaki Desk   |   3 Dec 2021 6:58 AM GMT
స్టార్ హీరో మరో రీమేక్ పై కన్నేసాడా..?
X
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరైన విక్టరీ వెంకటేష్.. కెరీర్ ప్రారంభం నుంచీ ఎన్నో రీమేక్ చిత్రాల్లో నటించారు. తెలుగులో ఎక్కువ రీమేక్ సినిమాల్లో నటించిన హీరో వెంకీ అనే చెప్పాలి.

మంచి కథలను తెలుగు ప్రేక్షకులకు చెప్పడానికి రీమేక్స్ చేయడానికి ఎప్పుడూ వెనుకాడనని ఆయన చెబుతుంటారు. ఒక భాషలో సక్సెస్ అయిన సినిమాతో మెప్పించడం ఛాలెంజింగ్ గా ఉంటుందని అంటుంటారు. వెంకటేష్ మాత్రం ఎలాంటి పాత్ర అయినా పరకాయ ప్రవేశం చేసి హిట్స్ కొడుతుంటారు.

2021 లో వెంకటేష్ రెండు రీమేక్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించారు. తమిళ సూపర్ హిట్ 'అసురన్' చిత్రాన్ని ''నారప్ప'' పేరుతో తీసి విజయవంతం అయ్యారు.

ఇదే క్రమంలో మలయాళంలో ఘన విజయం సాధించిన ''దృశ్యం 2'' చిత్రాన్ని అదే పేరుతో రీమేక్ చేసి మెప్పించారు. ఈ రెండు సినిమాలు కూడా థియేట్రికల్ స్కిప్ చేసి డైరెక్ట్ ఓటీటీ వేదికగా విడుదల అవడం గమనార్హం. అయితే ఇప్పుడు వెంకీమామ మరో రీమేక్ మీద కన్నేసారని టాక్ నడుస్తోంది.

వెంకీ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 3' సినిమా చేస్తున్నారు. ఇందులో మెగా హీరో వరుణ్ తేజ్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. బ్లాక్ బస్టర్ 'ఎఫ్ 2' చిత్రానికి ఇది సీక్వెల్. ఈ క్రేజీ మల్టీస్టారర్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కానుంది. వెంకటేష్ తదుపరి సినిమా గురించి ఇంతవరకు స్పష్టత రాలేదు. అయితే ఇప్పుడు మలయాళ సూపర్ హిట్ మూవీ 'డ్రైవింగ్ లైసెన్స్' మీద వెంకీ మనసు పారేసుకున్నారని టాక్ వచ్చింది.

ఇటీవల కాలంలో టాలీవుడ్ లో ఎక్కువగా వార్తల్లో నిలిచిన మలయాళ చిత్రం 'డ్రైవింగ్ లైసెన్స్'. పృథ్వీరాజ్ - సూరజ్ ప్రధాన పాత్రలతో తెరకెక్కిన ఈ సినిమా.. రెండేళ్ల క్రితం వచ్చి మంచి విజయం సాధించింది.

ఓ సినిమా హీరో మరియు అతన్ని అభిమానించే ఓ బ్రేక్ ఇన్ స్పెక్ట‌ర్ మధ్య అనుకోని పరిస్థితుల వల్ల ఏర్పడిన గొడవ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ వద్ద ఈ రీమేక్ రైట్స్ ఉన్నాయని అనుకున్నారు.

అయితే ఇప్పుడు వెంకటేష్ తన అన్న కొడుకు రానా దగ్గుబాటి తో కలసి 'డ్రైవింగ్ లైసెన్స్' సినిమా చేయాలనే ఆలోచనతో ఉన్నారని టాక్ నడుస్తోంది.

ప్రస్తుతం దగ్గుబాటి హీరోలిద్దరూ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ కోసం ''రానా నాయుడు'' అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. ఇది అమెరికన్ క్రైమ్ డ్రామా ‘రే డోనోవన్’ కు రీమేక్ గా రూపొందుతోంది. ‘మీర్జాపూర్’ ఫేమ్ కరణ్ అన్షుమన్ మరియు సుప్రన్ ఎస్ వర్మ ఈ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు.

'రానా నాయుడు' వెంకీ - రానా లకు డెబ్యూ వెబ్ సిరీస్. ఓటీటీ వరల్డ్ లో సత్తా చాటాలనే ప్లాన్ లో ఉన్న దగ్గుబాటి హీరో.. ఈ సిరీస్ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత 'డ్రైవింగ్ లైసెన్స్' సినిమా చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి త్వరలోనే వెంకటేష్ నెక్స్ట్ మూవీపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.