Begin typing your search above and press return to search.

నాన్నా వెంకీ ... ఏమైపోయావ్??

By:  Tupaki Desk   |   8 Sept 2015 7:12 PM IST
నాన్నా వెంకీ ... ఏమైపోయావ్??
X
ఆనాటి బిగ్ ఫోర్ లో చేసినవి తక్కువ సినిమాలే అయినా అధిక శాతం హిట్ పెర్సెంటేజ్ తో విక్టరీ వెంకటేష్ తనకంటూ ఒక ఇమేజ్ సృష్టించుకున్నాడు. ఫన్నీ సీన్ లతో నవ్వించమన్నా, సెంటిమెంట్ సన్నివేశాలతో ఏడిపించమన్నా వెంకీ తరువాతే ఎవరైనా అనే స్థాయికి చేరుకున్నాడు. అయితే కొత్త తరం నటుల ప్రవాహంలో వెంకీ ఆ మధ్య కాస్త వెనుకబడ్డ మాట వాస్తవమే.

వరుస ఫ్లాపులతో వెంకీ టైం అయిపోయిందన్న విమర్శకులకు ఘాటుగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి మల్టీ స్టారర్ ద్వారా మరిచిపోలేని కమ్ బ్యాక్ తో వచ్చాడు వెంకీ. అక్కడనుండి దృశ్యం, గోపాల గోపాల వంటి చిత్రాలతో హ్యాట్ ట్రిక్ విజయాలు సాధించి కధల జడ్జిమెంట్ లో మరోసారి విజయం సాధించాడు. వరుసపెట్టి విజయాలు వస్తున్న తరుణంలో ఇప్పుడు ఒక్కసారిగా వెంకీ స్లో అయిపోవడం ఆయన అభిమానులకు రుచించడంలేదు.

మళ్ళి మళ్ళి ఇది రానిరోజు దర్శకుడు క్రాంతి మాధవ్ తో ఒక సినిమా వుంటుందని వార్తలు వినిపించినా అది పట్టాలెక్కలేదు. తేజ చెప్పిన కధ నచ్చినా అర్ధాంతరంగా ఆగిపోయింది. మారుతి తో ఒక సినిమా తీస్తున్నాడని ప్రకటించినా అది కార్యరూపం దాల్చలేదు. దీంతో వెంకీ తదుపరి సినిమాపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. వెంకీ సార్.. ఏదోకటి త్వరగా స్పందించండి.