Begin typing your search above and press return to search.

వెంకీ సినిమాకు ముహూర్తం కుదిరింది

By:  Tupaki Desk   |   26 May 2015 9:00 PM IST
వెంకీ సినిమాకు ముహూర్తం కుదిరింది
X
ఈ మధ్య టాలీవుడ్‌ స్టార్‌ హీరోలంతా తమ కొత్త సినిమాల విషయంలో ఏమాత్రం హడావుడి పడట్లేదు. ఇంతకుముందు సినిమా విడుదలవగానే.. కొత్త సినిమా షూటింగ్‌లో అడుగు పెట్టేసేవారు కానీ.. ఇప్పుడు మాత్రం కథల ఎంపికలో, స్క్రిప్టు విషయంలో ఆచితూచి అడుగేస్తున్నారు. పక్కాగా స్క్రిప్టు అయ్యే వరకు ఎదురు చూసి.. ఆ తర్వాత రంగంలోకి దిగుతున్నారు. మహేష్‌బాబు, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌.. వీళ్లందరూ అలా చేసిన వాళ్లే. సీనియర్‌ హీరో వెంకటేష్‌ కూడా వాళ్ల బాటలోనే నడుస్తున్నాడు. 'గోపాల గోపాల' సినిమా తర్వాత వెంకీ కొత్త సినిమా ఇంకా మొదలు కాలేదు.

ఐతే తండ్రి మరణంతో కొన్నాళ్లు సినిమా సంగతులకు దూరంగా ఉన్న వెంకీ.. గత రెండు నెలలుగా తన కొత్త సినిమా స్క్రిప్టు పనిలో బిజీగా ఉన్నాడు. తనకు 'లక్ష్మీ' లాంటి సూపర్‌ హిట్‌ కథ అందించిన ఆకుల శివతో వెంకీ సరికొత్త కథ తయారు చేయిస్తున్న సంగతి తెలిసిందే. అది ఇప్పుడో కొలిక్కి వచ్చేసిందట. జూన్‌ 6న రామానాయుడి జయంతి సందర్భంగా వెంకీ తన కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టబోతున్నాడట. కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్నట్లు అది వెంకీ, రానా కలిసి నటించే మల్టీస్టారరా.. లేక వెంకీ మాత్రమే చేసే సోలో సినిమానా అన్నది తెలియడం లేదు. ఈ సినిమాకు డైరెక్టర్‌ ఎవరన్నది కూడా సస్పెన్సే. అన్ని విశేషాలు ఆరో తారీఖునే వెల్లడవుతాయట. ఈ సినిమాను సురేష్‌ బాబే నిర్మించబోతున్నారన్నది మాత్రం కన్ఫమ్‌.