Begin typing your search above and press return to search.

మెలోడీ బ్రహ్మా ఫ్యాన్స్‌ కు నారప్ప ట్రీట్ మిస్‌

By:  Tupaki Desk   |   14 July 2021 5:17 AM GMT
మెలోడీ బ్రహ్మా ఫ్యాన్స్‌ కు నారప్ప ట్రీట్ మిస్‌
X
టాలీవుడ్‌ మెలోడీ కింగ్‌.. మెలోడీ బ్రహ్మ మణిశర్మ మళ్లీ ఫామ్‌ లోకి వచ్చారు. ఆమద్య కాస్త వెనుక పడ్డట్లుగా అనిపించినా కూడా ప్రస్తుతం స్టార్‌ హీరోల నుండి చిన్న హీరోల వరకు ఈయన వెంట పడుతున్నారు. మణిశర్మ మ్యూజిక్ ను మళ్లీ ప్రేక్షకులు ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారు. ఈతరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మణిశర్మ పాటలను ఇస్తూ మళ్లీ బిజీ అయ్యాడు. మణిశర్మ నుండి వస్తున్న ప్రతి సినిమా ను కూడా ఆయన అభిమానులు ఎంజాయ్ చేసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దర్శకుల్లో సంగీత అభిరుచి ఉంటే మణిశర్మ తో అద్బుతమైన సంగీతాన్ని రాబట్టుకోవచ్చు. కొరటాల శివ ఆచార్య కోసం అద్బుతమైన పాటలను రాబట్టుకున్నాడు.

ఇప్పటికే ఆచార్య నుండి మొదటి పాట లాహె లాహె సినిమాపై అంచనాలు అమాంతం పెచేలా ఉండటంతో పాటు పాత మెలోడీ బ్రహ్మను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చింది. అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు కూడా మణిశర్మ పాటలు మరియు బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అంటే పడి చస్తారు. అలాంటి సమయంలో నారప్ప సినిమాకు ఈయన సంగీతాన్ని అందిస్తున్నాడు అంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో మొదటి నుండి అంచనాలు పెరిగాయి. కాని సినిమా కథ అనుసారంగా ఎక్కువ పాటలు ఉండవని తేలిపోయింది. ఉన్న పాటలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. సరే నారప్ప బ్యాక్‌ డ్రాప్ స్కోర్‌ అయినా మణిశర్మ అభిమానులకు ఖచ్చితంగా ట్రీట్‌ ఇస్తుందని ఆశిస్తే అది కూడా నిరాశ పర్చారు.

నారప్ప మేకర్స్‌ సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేస్తున్నామనే ఉద్దేశ్యంతోనో లేదా మరే కారణమో కాని మణిశర్మతో కాకుండా అసురన్‌ సినిమా బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌ ను తీసుకుని రీ రికార్డింగ్‌ పూర్తి చేశారట. ఈ విషయమై మణిశర్మ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై మణిశర్మ కూడా స్పందిస్తూ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. తనకు కనీసం చెప్పకుండా నారప్ప సినిమా కు అసురన్‌ బీజీతో రీ రికార్డింగ్‌ చేశారంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారట. పాటలు లేకున్నా కనీసం మణిశర్మ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్ అయినా నారప్ప సినిమా కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని భావిస్తే తీవ్రంగా నిరాశ పర్చారు.

నారప్ప సినిమా కు కేవలం మణిశర్మ పాటలకు మాత్రమే సంగీతాన్ని అందించాడు. అంతకు మించి బీజీ అందించలేదు అలాగే రీ రికార్డింగ్‌ కూడా చేయలేదు. తమిళ సూపర్‌ హిట్‌ మూవీ అసురన్‌ కు నారప్ప రీమేక్‌ కనుక రిస్క్‌ లేకుండా ఒరిజినల్ వర్షన్‌ లోని బీజీని దించేశారు. థియేటర్‌ రిలీజ్‌ చేస్తే మణిశర్మతో బీజీలో మార్పులు చేర్పులు చేయించేవారేమో. కాని ఓటీటీ రిలీజ్ కు సిద్దం అయిన నేపథ్యంలో మరీ ఎక్కువ ఖర్చు వద్దని అనుకున్నారేమో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి నారప్ప సినిమా మణిశర్మ ఫ్యాన్స్ కు ట్రీట్ మిస్ అయ్యింది. తర్వాత తర్వాత సినిమా లతో అయినా మణిశర్మ తన మార్క్‌ ను చూపిస్తారేమో చూడాలి.