Begin typing your search above and press return to search.

వెంకీ-క్రిష్.. ఒక సోషియో ఫాంటసీ

By:  Tupaki Desk   |   8 Dec 2016 5:31 AM GMT
వెంకీ-క్రిష్.. ఒక సోషియో ఫాంటసీ
X
‘బాబు బంగారం’ మొదలుపెట్టడానికి ముందు ఏడాదికి పైగా విరామం తీసుకున్నాడు విక్టరీ వెంకటేష్. ఐతే ఈ సినిమా మొదలుపెట్టగానే ఆయన సూపర్ స్పీడ్ అందుకున్నారు. ఆరు నెలల్లోనే ‘బాబు బంగారం’ను ముగించేసి.. సుధ కొంగర దర్శకత్వంలో ‘గురు’ మీదికి వెళ్లిపోయాడు. ఇది రీమేక్ కూడా కావడంతో మరింత వేగంగా సినిమా పూర్తయిపోయింది. కేవలం మూడు నెలల వ్యవధిలో సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు. ఈ సినిమా అలా ముగిసిందో లేదో.. ఇలా తన తర్వాతి సినిమాకు శ్రీకారం చుట్టేశాడు వెంకీ. ‘నేను శైలజ’ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘ఆడాళ్లూ మీకు జోహార్’ సినిమా కూడా సెట్స్ మీదికి వెళ్లిపోతోంది.

ఈ సినిమా పట్టాలెక్కే సమయంలోనే తన తర్వాతి సినిమాకు టాక్స్ మొదలుపెట్టేశాడు వెంకీ. ఆయన తన తర్వాతి సినిమాను క్రిష్ దర్శకత్వంలో చేస్తారని వార్తలొస్తుండటం విశేషం. ‘గమ్యం’ నుంచి ప్రతిసారీ వైవిధ్యమైన ప్రయాణమే చేస్తున్న క్రిష్.. నందమూరి బాలకృష్ణ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వందో సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ని పూర్తి చేస్తూనే.. తన తర్వాతి సినిమా కోసం ఇప్పటికే పని మొదలుపెట్టేశాడు. ముందు తన నెక్స్ట్ ప్రాజెక్టును బాలీవుడ్లో చేయాలనుకున్న క్రిష్.. ఆ ఆలోచనను విరమించుకుని వెంకీకి ఓ కథ వినిపించినట్లు సమాచారం. అది ఒక సోషియో ఫాంటసీ కథ అని సమాచారం. వెంకీకి కూడా ఆ కథ బాగా నచ్చిందట. వీళ్లిద్దరి కాంబినేషన్లో సినిమా ఖాయం అంటున్నారు. వెంకీ ఇంతకుముందు రానాతో క్రిష్ తీసిన ‘కృష్ణం వందే జగద్గురుం’లో ఓ పాటలో తళుక్కుమన్న సంగతి తెలిసిందే.