Begin typing your search above and press return to search.

'దృశ్యం 2' ట్రైలర్: సినిమా తీసే లోపు రాంబాబుకు సినిమా చూపిస్తారా..?

By:  Tupaki Desk   |   15 Nov 2021 3:16 PM GMT
దృశ్యం 2 ట్రైలర్: సినిమా తీసే లోపు రాంబాబుకు సినిమా చూపిస్తారా..?
X
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన తాజా చిత్రం ''దృశ్యం 2''. ఇది మలయాళంలో మోహన్ లాల్ నటించిన 'దృశ్యం 2' చిత్రానికి అధికారిక తెలుగు రీమేక్. సూపర్ హిట్ 'దృశ్యం' సినిమాకు సీక్వెల్. మలయాళ డైరెక్టర్ జీతూ జోసెఫ్ ఈ థ్రిల్లర్ చిత్రానికి దర్శకత్వం వహించారు.

మాతృక బాటలో థియేట్రికల్ స్కిప్ చేసి ఓటీటీలో విడుదల అవుతోంది. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 25 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. టీజర్ తో సినిమాపై ఆసక్తిని కలిగించారు. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

'దృశ్యం' సినిమా ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే 'దృశ్యం 2' సినిమా మొదలైంది. కాకపోతే కేబుల్ ఆపరేటర్ అయిన రాంబాబు ఇందులో థియేటర్ ఓనర్ గా కనిపిస్తున్నాడు. అలానే నిర్మాతగా సినిమా తీయాలనే తన చిన్ననాటి కలను నెరవేర్చికోడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.

అయితే ఆరేళ్లుగా మిస్టరీగా మిగిలిపోయిన వరుణ్ మర్డర్ కేసు విషయంలో రాంబాబు మరియు అతని ఫ్యామిలీ మీద పోలీసులు నిఘా పెట్టారని తెలుస్తోంది. అంతేకాదు వారు హత్య చేసినట్లు నిరూపించడానికి రాంబాబు చుట్టూ ఏదో పన్నాగం పన్నినట్లు సందేహాలు కలిగిస్తోంది.

మరోవైపు నరేష్ - నదియా తమ కొడుకు ఎప్పుడు ఎలా చనిపోయాడో తెలియక బాధ పడుతున్నట్లు చూపించారు. భార్యాపిల్లలతో కలిసి ఆనందంగా గడుపుతున్న రాంబాబు లైఫ్ లోకి మళ్ళీ పోలీసులు రావడం.. తమశైలిలో ఇన్వెస్టిగేషన్ చేయడం వంటి అంశాలు కనిపిస్తున్నాయి.

సినిమా తీసే లోపు రాంబాబుకు సినిమా చూపించాలని ఫిక్స్ అయిన పోలీసులు పాత మర్డర్ కేసును తిరగదోడిన నేపథ్యంలో రాంబాబు ఫ్యామిలీ మళ్లీ ఎలాంటి సమస్యలు ఎదుర్కోవలసి వచ్చింది? ఎప్పటిలాగే తన తెలివితేటలతో ఈ కేసు నుంచి బయటపడ్డారా లేదా? అనేది తెలియాలంటే ''దృశ్యం 2'' సినిమా చూడాల్సిందే.

'దృశ్యం 2' చిత్రంలో వెంకటేష్ గడ్డం పెంచుకొని మొదటి భాగం కంటే డిఫరెంట్ గా కనిపించారు. వెంకీ భార్యగా సీనియర్ హీరోయిన్ మీనా.. కుమార్తెలుగా ఎస్తర్ అనీల్ - కృతికా నటించారు. సంపత్ నంది - తనికెళ్ళ భరణి - జయకుమార్ - సత్యం రాజేష్ - తాగుబోతు రమేష్ - చలాకీ చంటి - ముక్కు అవినాష్ వంటి వారు ఇతర పాత్రలు పోషించారు. ఈ ట్రైలర్ పై అనూప్ రూబెన్స్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ ఉత్కంఠకు గురి చేస్తోంది.

సతీష్ కురూప్ సినిమాటోగ్రఫీ అందించగా.. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ వర్క్ చేశారు. డైరెక్టర్ జీతూ ఈ సినిమా కోసం మార్పులేవీ చేయకుండా ఒరిజినల్ మాదిరిగానే తీర్చిదిద్దారని తెలుస్తోంది.

సురేష్ ప్రొడక్షన్స్ - మాక్స్ మూవీస్ - రాజ్ కుమార్ థియేటర్స్ ప్రై. లిమిటెడ్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందింది. డి.సురేష్ బాబు - ఆంటోనీ పెరుంబవూర్ - రాజ్ కుమార్ సేతుపతి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. 'నారప్ప' తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోలో డైరెక్ట్ ఓటీటీ విధానంలో విడుదలవుతున్న 'దృశ్యం 2' ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి.