Begin typing your search above and press return to search.

విజయ్ భారీ యాక్షన్ మూవీకి వీర కామెడీ టచ్!

By:  Tupaki Desk   |   1 Feb 2022 8:30 AM GMT
విజయ్ భారీ యాక్షన్ మూవీకి వీర కామెడీ టచ్!
X
తమిళనాట విజయ్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మాస్ లో ఆయనకి ఉన్నది మామూలు ఫాలోయింగ్ కాదు. ఎప్పటికప్పుడు ఆయన తన రికార్డులను తుడిచేస్తూ కొత్త రికారులను సెట్ చేస్తుంటాడు. ఆయన సినిమా సెట్ పైకి వెళ్లిన దగ్గర నుంచి థియేటర్ నుంచి వెళ్లిపోయేవరకూ అభిమానులు ఎప్పటికప్పుడు అప్ డేట్ తెలుసుకోవడంలో ఆసక్తిని కనబరుస్తూనే ఉంటారు. ఆయన సినిమా విడుదలైతే పెద్ద పండుగలన్నీ ఒక్కసారిగా వచ్చినట్టుగా .. జాతరలన్నీ ఒక్కచోట జరుగుతున్నట్టుగా ఉంటుంది.

అలాంటి విజయ్ తాజా చిత్రంగా 'బీస్ట్' రూపొందుతోంది. సన్ పిక్చర్స్ వారు అత్యధిక బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా, కొన్ని రోజుల క్రితమే షూటింగు పార్టును పూర్తిచేసుకుంది. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. విభిన్నమైన కథాకథనాలను తెరపై అద్భుతంగా ఆవిష్కరించే దర్శకుడిగా ఆయనకి మంచి పేరు ఉంది. అలాంటి ఆయన ఈ సారి భారీ యాక్షన్ దృశ్యాలతో కూడిన కథను అల్లుకున్నాడు. ఈ యాక్షన్ అంతా కూడా ఎమోషన్ తో ముడిపడి నడుస్తుంది. యాక్షన్ కి .. ఎమోషన్ కి మధ్య చిక్కిన ప్రేక్షకులకు రిలీఫ్ ఇవ్వడానికి ఆయన కామెడీకి కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

ఈ సినిమాలో యోగిబాబు ఉన్నాడు .. ఆయన పాత్ర నుంచి ఎక్కువ కామెడీని ఆశించడం సహజం. కానీ యోగిబాబు కంటే ఎక్కువ కామెడీ సెల్వరాఘవన్ పాత్ర ద్వారా పడుతుందని చెబుతున్నారు. ఈ సినిమాలో సెల్వరాఘవన్ కంప్యూటర్ హ్యాకర్ గా కనిపించనున్నాడు. ఈ పాత్ర తెరపై కనిపించినప్పుడల్లా నాన్ స్టాప్ కామెడీ నడుస్తూనే ఉంటుందని అంటున్నారు. దర్శకుడు ఈ పాత్రను చాలా డిఫరెంట్ డిజైన్ చేశాడనీ, ప్రేక్షకులు హాయిగా నవ్వుకుంటారని చెబుతున్నారు. ఈ సినిమాకి కామెడీ ఎపిసోడ్స్ కూడా హైలైట్ నిలుస్తాయని అంటున్నారు.

అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో కథానాయికగా పూజ హెగ్డే అందాల సందడి చేయనుంది. విజయ్ తో ఆమె చేసిన తొలి సినిమా ఇది. ఇటు టాలీవుడ్ లోను .. అటు బాలీవుడ్ లోను పూజ హెగ్డేకి మంచి క్రేజ్ ఉంది. అందువలన ఆమెను తీసుకున్నారు. ఈ సినిమా కోసం పూజ భారీ పారితోషికం అందుకోవడం విశేషం. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను ఏప్రిల్ 14వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా తరువాత తెలుగులో వంశీ పైడిపల్లి ప్రాజెక్టును .. తమిళంలో లోకేశ్ కనగరాజ్ ప్రాజెక్టును విజయ్ లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే.