Begin typing your search above and press return to search.

మెగా కుర్రాడా.. కొట్టేశావ్ పో!

By:  Tupaki Desk   |   22 Oct 2015 4:42 PM GMT
మెగా కుర్రాడా.. కొట్టేశావ్ పో!
X
పెద్ద బ్యాగ్రౌండ్ ఉంది.. ఫేస్ వాల్యూ ఉంది, ఫిజిక్కూ ఉంది. ఇలాంటోడు మాంచి మాస్ సినిమాతో హీరోగా అరంగేట్రం చేయాలనుకుంటాడు. కానీ మెగా ఫ్యామిలీ కుర్రాడు వరుణ్ తేజ్ మాత్రం ‘ముకుంద’ లాంటి సాఫ్ట్ మూవీతో అరంగేట్రం చేశాడు. అందులో హీరోయిజం లేడు. పెద్దగా ఫైట్లు లేవు, డ్యాన్సుల్లేవు. కమర్షియల్ హంగుల్లేవు. అలాంటి సినిమాతో అరంగేట్రం చేయడమే ఆశ్చర్యమంటే రెండో సినిమాకు రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో ఓ ప్రయోగాత్మక ప్రేమకథ చేయడానికి రెడీ అయిపోవడం ఇంకా పెద్ద సాహసం. ఐతే ఈ సాహసం చేయడం వల్ల అతడికి లాభమా.. నష్టమా? కచ్చితంగా లాభమే.

మాస్ హీరో కావడంలో గొప్పేముంది. ఇలాంటి హీరోలు తెలుగులో కావాల్సినంత మంది ఉన్నారు. ముందు ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించడం ముఖ్యం. అలా సంపాదిస్తే మాస్ ఇమేజ్ అన్నది ఒక్క సినిమాతో వచ్చేస్తుంది. బహుశా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో ఆ ఇమేజ్ వచ్చినా వచ్చేయొచ్చు. ఒడ్డూ పొడుగూ ఉన్నవాడు, అందగాడు. మెగా అభిమానుల బ్యాకప్ ఉంది కాబట్టి.. వరుణ్ మాస్ హీరో కావడం పెద్ద విశేషం కాదు.

ఐతే ‘కంచె’ లాంటి సినిమాలో నటించే అవకాశం జీవితంలో ఒక్కసారే వచ్చేది. అలాంటిది కెరీర్లో రెండో సినిమాకే రావడం వరుణ్ చేసుకున్న అదృష్టం. క్రిష్ కమర్షియల్ లెక్కలేసుకోకుండా నిజాయితీగా సినిమా తీస్తే.. కెరీర్ కోణంలో కమర్షియల్ లెక్కలేసుకోకుండా నిజాయితీగా ఈ సినిమాలో నటించాడు వరుణ్. రెండో సినిమాకే అతను సాధించిన పరిణతి సినిమాలో స్పష్టంగా కనిపించింది. నటన దగ్గర్నుంచి ప్రతి విషయంలోనూ మెరుగుపడ్డాడు. చాలా మంచి పెర్ఫామెన్స్ ఇచ్చాడు. అదే ఓ కమర్షియల్ సినిమా చేసి ఉంటే.. అతడిలో ఇంత మార్పు చూసేవాళ్లం కాదు.

తాను చేసిన తొలి రెండు సినిమాలతో ముందు అభిమానుల కంటే సామాన్య ప్రేక్షకుల్ని మెప్పించాడు వరుణ్. ముఖ్యంగా ‘కంచె’ సినిమా న్యూట్రల్ ఆడియన్స్‌ పై బలమైన ముద్ర వేస్తుందనడంలో సందేహం లేదు. సామాన్య జనాల్లో యాక్సెప్టెన్స్ తెస్తుంది. ఇంతమంది హీరోల మధ్య, వారసుల మధ్య తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్. ఈ గుర్తింపు అతడి కెరీర్‌ కు కచ్చితంగా ఉపయోగపడుతుంది. కెరీర్ ఆరంభంలోనే ఓ ముద్రంటూ వేసుకోకపోవడం వల్ల.. భవిష్యత్తులో ‘కంచె’ లాంటి విభిన్నమైన ప్రయత్నాలు చేయాల్సి వచ్చినపుడు వరుణ్ కచ్చితంగా మంచి ఛాయిస్ అవుతాడు. కమర్షియల్ సినిమాలు ఎలాగూ వాటంతట అవే వస్తాయి. ఇలాంటి సినిమాలకు ఛాయిస్ కావడమే ప్రత్యేకమైన విషయం. కాబట్టి వరుణ్ చేసిన సాహసాలు వృథాగా ఏమీ పోవు.