Begin typing your search above and press return to search.

బావ‌లు చాలా ప్రీప్లాన్డ్ గా ఉన్నారే!

By:  Tupaki Desk   |   15 April 2020 2:20 PM IST
బావ‌లు చాలా ప్రీప్లాన్డ్ గా ఉన్నారే!
X
బాలీవుడ్ త‌ర‌హాలో తెలుగు చిత్ర‌సీమ‌లో మ‌ల్టీస్టార‌ర్ల ట్రెండ్ జోరుగానే ఉంది. స్టార్ హీరోలంతా ఈగోలు ప‌క్క‌న బెట్టి ఒకే తాటిపైకొచ్చి సినిమాలు చేయ‌డం ఆరోగ్య‌క‌ర‌మైన విష‌య‌మే. మ‌ల్టీస్టార‌ర్ స్క్రిప్ట్ హీరోల‌కు న‌చ్చితే చాలు ప‌ట్టాలెక్కేస్తోంది. క్లాసిక్ డేస్ సీన్ రిపీటవ్వ‌డం శుభ‌ప‌రిణామం అన్న ప్ర‌శంస‌లు కురిసాయి. సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు నుంచి పున ప్రారంభ‌మైన ఈ ట్రెండ్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది. ప్ర‌స్తుతం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్- మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ లు క‌ల‌సి ఆర్.ఆర్.ఆర్ లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. దాదాపు 100 కోట్ల షేర్ కొల్ల‌గొట్టే హీరోలు క‌లిసి న‌టిస్తున్న తొలి చిత్రం ఇదే కావ‌డం విశేషం. దీంతో ఇటీవ‌ల మ‌ల్టీస్టార‌ర్ కామ‌న్ అన్న భావ‌న నెల‌కొంది.

తాజాగా మెగా ఫ్యామిలీ హీరోలు క‌లిసి మ‌ల్టీస్టార‌ర్ల‌కు తెర తీయ‌డం ఆస‌క్తి రేపుతోంది. మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్- మెగా మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ క‌లిసి న‌టించ‌డానికి ఇప్ప‌టికే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసారు. మంచి క‌థ‌...ద‌ర్శ‌కుడు కుదిరితే ఆల‌స్యం లేదు.. క‌లిసి ప‌నిచేయ‌డానికి ఇద్ద‌రం రెడీగా ఉన్నాం అంటూ డైరెక్ట్ గా అభిమానుల‌కే చెప్పారు. లాక్ డౌన్ నేప‌థ్యంలో హీరోలంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మైన సంగ‌తి తెలిసిందే. ఇంట్లో కాల‌క్షేపం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆస్క్ వ‌రుణ్..ఆస్క్ తేజ్ అంటూ అభిమానుల‌తో జ‌రిగిన చిట్ చాట్ సెషన్స్ లో ఈ విష‌యాల్ని అభిమానుల‌కు రివీల్ చేసారు. మీకు మ‌ల్టీస్టార‌ర్ చేయాల‌నిపిస్తే మీ ఛాయిస్ ఏ హీరో? అని సాయి తేజ్ ని అడిగితే .. వెంట‌నే వ‌రుణ్ తేజ్ పేరు చెప్పాడు. ఇద్ద‌రం చిన్న‌ప్ప‌టి నుంచి మంచి స్నేహితులం. కాబ‌ట్టి ఒక‌రి గురించి ఒకరికి బాగా తెలుసు. అండ‌ర్ స్టాండింగ్ స‌మ‌స్య‌లు త‌లెత్త‌వు. కాబ‌ట్టి నా ఛాయిస్ వ‌రుణ్ అని అన్నాడు.

వ‌రుణ్ తేజ్ కూడా ఆ సెష‌న్ లో అదే విష‌యాన్ని వెల్ల‌డించాడు. మంచి స‌బ్జెక్ట్ కోసం ఎదురుచూస్తున్నామ‌ని తెలిపాడు. అంటే బావ బామ్మ‌ర్థి క‌లిసి ప్రీ ప్లాన్డ్ గానే ఉన్నార‌న్న మాట‌. ఇక వ‌రుణ్ తేజ్ కెరీర్ తేజ్ క‌న్నా స్పీడ్ గానే ఉంది. డిఫ‌రెంట్ కాన్సెప్ట్ లు స‌హా క‌మ‌ర్శియ‌ల్ స్క్రిప్టుల్ని ఎంపిక చేసుకుంటూ హిట్లు కొడుతున్నాడు. మెగా మేన‌ల్లుడు మాత్రం త‌డ‌బాటుకు గుర‌వుతున్నాడు. స్క్రిప్ట్ లు ఎంపిక చేసుకోవ‌డంలో మొద‌టి నుంచి ఫెయిల‌వుతూనే ఉన్నాడు. ఇప్పుడిప్పుడే కాస్త రొటీన్ కు భిన్నంగా వెళ్తున్నాడు. ఈ టైమ్ లో తేజ్ - తేజ్ మ‌ల్టీస్టార‌ర్ ఆస‌క్తిక‌ర‌మే. చూద్దాం మ‌రి ఈ ఈ హీరోలిద్ద‌రికి త‌గ్గ స్క్రిప్టును ఏ ద‌ర్శ‌కుడు రెడీ చేస్తాడో?