Begin typing your search above and press return to search.

జనవరి 1న వరుణ్ సందేశ్ 'ఇందువదన'..!

By:  Tupaki Desk   |   10 Dec 2021 12:30 PM GMT
జనవరి 1న వరుణ్ సందేశ్ ఇందువదన..!
X
'హ్యాపీ డేస్' 'కొత్తబంగారు లోకం' చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో వరుణ్ సందేష్.. ఆ తర్వాత ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయారు. 'బిగ్ బాస్' తెలుగు రియాలిటీ షో ద్వారా భారీ క్రేజ్ సంపాదించుకున్న వరుణ్.. ఇప్పుడు ''ఇందువదన'' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

'ఇందువదన' చిత్రంలో వరుణ్ సందేశ్ సరసన ఫర్నాజ్ శెట్టి హీరోయిన్ గా నటించింది. వాస్తవ సంఘటనల ఆధారంగా రూరల్ బ్యాక్ డ్రాప్ పీరియాడికల్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. వరుణ్ ఇందులో గత చిత్రాలకు భిన్నంగా డిఫరెంట్ మేకోవర్ తో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ - సాంగ్స్ మంచి స్పందన తెచ్చుకున్నాయి

ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న 'ఇందువదన' చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేశారు. 2022 కొత్త ఏడాది ప్రారంభ రోజైన జనవరి 1న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీకి సెన్సార్ బోర్డు 'యు/ఎ' (U/A) సర్టిఫికెట్ జారీ చేసినట్లు తెలిపారు.

''ఇందువదన'' చిత్రానికి MSR దర్శకత్వం వహించారు. బాలాజీ పిక్చర్స్ బ్యానర్ పై మాధవి ఆదుర్తి నిర్మించారు. సతీష్ ఆకేటీ కథ - మాటలు అందించిన ఈ సినిమాకు శివ కాకాని సంగీతం సమకూర్చారు. .మురళీకృష్ణ సినిమాటోగ్రఫీ.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.

ఇందులో వరుణ్ సందేశ్-ఫర్నాజ్ శెట్టి లతో పాటుగా రఘు బాబు - అలీ - నాగినీడు - సురేఖ వాణి - ధనరాజ్ - తాగుబోతు రమేష్ - మహేష్ విట్ట - పార్వతీషం - వంశీ కృష్ణ ఆకేటి - దువ్వాసి మోహన్ - జ్యోతి - కృతిక - అంబఋషి - 'జెర్సీ' మోహన్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

ఫీల్‌ గుడ్‌ లవ్ స్టోరీగా వస్తున్న 'ఇందువధన' తో వరుణ్‌ సందేశ్ రీఎంట్రీ ఇస్తున్నారని.. ఆయన పాత్ర చిత్రణ కొత్త పంథాలో ఉంటుందని దర్శకుడు చెబుతున్నారు. కొత్త ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తున్న హ్యాపీ డేస్ హీరోకి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.