Begin typing your search above and press return to search.

పుష్ప కోసం 'వరుడు' విలన్‌

By:  Tupaki Desk   |   12 Nov 2020 9:00 AM IST
పుష్ప కోసం వరుడు విలన్‌
X
అల్లు అర్జున్‌.. సుకుమార్‌ ల కాంబినేషన్‌ లో రూపొందుతున్న పుష్ప సినిమాలో కీలక పాత్ర కోసం మొదట్లో తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఎంపిక అయ్యాడు. సినిమా ఆలస్యం అవ్వడంతో డేట్లు సర్దుబాటు కావడం లేదు అంటూ చెప్పి విజయ్‌ సేతుపతి తప్పుకున్నాడు. నాకు కథ ఎంతో నచ్చింది.. పాత్ర కూడా బాగుంది కాని నేను చేయలేక పోతున్నందుకు బాదాగా ఉంది అంటూ ఒక ఇంటర్వ్యూలో విజయ్‌ సేతుపతి చెప్పిన విషయం తెల్సిందే. ఇప్పుడు ఆ పాత్ర లో ఎవరు నటిస్తారు అనే చర్చ ప్రముఖంగా వినిపిస్తుంది.

గత కొన్ని నెలలుగా ఆ విషయమై ప్రముఖంగా ప్రచారం అయితే జరుగుతుంది కాని ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. తెలుగు.. తమిళ.. హిందీ నటులు ఆ పాత్ర కోసం పరిశీలించబడుతున్నారు అంటూ రకరకాలుగా వార్తలు వచ్చాయి. మొన్నటికి మొన్న నారా రోహిత్‌ ను ఆ పాత్ర కోసం సంప్రదించారనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ పాత్రకు 'వరుడు' విలన్‌ తమిళ హీరో ఆర్యను ఎంపిక చేసే విషయమై చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు.

బన్నీ తో వరుడు సినిమాలో నటించిన ఆర్య మళ్లీ ఇన్నాళ్ల తర్వాత బన్నీ సినిమాలో నటించబోతున్నాడు అనే ప్రచారం మీడియా వర్గాల్లో వినిపిస్తుంది. ఇది ఎంత వరకు నిజం అనేది తెలియాల్సి ఉంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయ్యింది. కనుక త్వరలోనే ఆ పాత్రలో నటించబోతున్నది ఎవరు అనే విషయమై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.