Begin typing your search above and press return to search.

వర్మ తోపు అని మళ్లీ నిరూపించుకున్నాడు

By:  Tupaki Desk   |   24 Oct 2019 9:46 AM GMT
వర్మ తోపు అని మళ్లీ నిరూపించుకున్నాడు
X
రామ్‌ గోపాల్‌ వర్మ ఈమద్య కాలంలో చేసిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి. కాని ఆయన గతంలో తెరకెక్కించిన సినిమాల కారణంగా ఆయన్ను ఇంకా జనాలు అభిమానిస్తూనే ఉన్నారు. మళ్లీ ఆయన నుండి మంచి సినిమాలు రాకపోతాయా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మద్య కాలంలో ఈయన కాన్సెప్ట్‌ చిత్రాల కంటే ఎక్కువగా వివాదాస్పద సినిమాలను చేసేందుకు ఎక్కువ ఇష్టపడుతున్నాడు.

ఇటీవలే లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రాన్ని తెరకెక్కించిన వర్మ అంతకు ముందు కూడా పలు వివాదాస్పద చిత్రాలను తెరకెక్కించాడు. తాను ఏ సినిమా చేసినా ఆ సినిమాలోని పాత్రలకు నటీనటులను ఎంపిక చేసుకునే విషయంలో వర్మ చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. కిల్లింగ్‌ వీరప్పన్‌ సినిమాలో వీరప్పన్‌ పాత్రలో నటించిన వ్యక్తి నిజంగా వీరప్పన్‌ అన్నట్లుగా అనిపించాడు. వర్మ తీసే ప్రతి సినిమాలో కూడా పాత్రలను చూస్తుంటే నిజ జీవిత పాత్రలను చూసినట్లుగానే అనిపిస్తుంది. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రంలో ఎన్టీఆర్‌.. చంద్రబాబు నాయుడు.. లక్ష్మీ పార్వతి ఇలా ముఖ్య పాత్రలకు ఆయన తీసుకున్న నటీనటులు అద్బుతంగా సెట్‌ అయ్యారు.

ఇక ప్రస్తుతం వర్మ కమ్మరాజ్యంలో కడప రెడ్డు అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఆంధ్ర ప్రదేశ్‌ ప్రస్తుత రాజకీయాలను చూపిస్తూ ఈ చిత్రంను వర్మ తీసినట్లుగా సమాచారం అందుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ ను దీపావళి కానుకగా ఈనెల 27న విడుదల చేయబోతున్నారు. ట్రైలర్‌ విడుదల కాబోతుంది అంటూ వర్మ ఒక పోస్టర్‌ ను విడుదల చేశాడు.

ఈ పోస్టర్‌ ను చూస్తుంటే చంద్రబాబు నాయుడు పాత్ర.. జగన్‌ పాత్ర.. పవన్‌ కళ్యాణ్‌ పాత్రలు కీలకంగా ఉండబోతున్నట్లుగా అనిపిస్తున్నాయి. ఆ ముగ్గురి పాత్రల కోసం వర్మ ఎంచుకున్న నటులు ఎప్పటిలాగే వారి పాత్రల్లో ఇమిడి పోయారు. ముఖ్యంగా పవన్‌ లా ఆ నటుడు ఉన్నాడు. ఇక జగన్‌ పాత్ర కోసం మనకు తెలిసిన నటుడు అజ్మల్‌ ను ఎంపిక చేశాడు. ఇతడు జగన్‌ లాగే కనిపిస్తున్నాడు. మొత్తానికి ఆ మూడు పాత్రల కోసం వర్మ ఎంచుకున్న ముగ్గురు నటీనటులు సూట్‌ అయినట్లుగా ఉన్నారు.

ఈ విషయంలో వర్మ నూటికి నూరు శాతం మార్కులు పొందినట్లే అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ వస్తున్నాయి. పాత్రల కోసం నటీనటుల ఎంపిక చేసుకునే విషయంలో వర్మను మించిన తోపులు మరెవ్వరు ఉండరు అంటూ ఆయన అభిమానులు అంటున్నారు. ఆయన ఎంపిక చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది.