Begin typing your search above and press return to search.

ఉపేంద్ర హీరోగా వర్మ సినిమా?

By:  Tupaki Desk   |   19 Sept 2021 2:06 PM IST
ఉపేంద్ర హీరోగా వర్మ సినిమా?
X
సాధారణంగా ఒక సినిమా ఎనౌన్స్ చేయడానికి ముందు చాలా కసరత్తు జరుగుతుంది. చర్చల పేరుతో తర్జనభర్జనలు జరుగుతాయి. అన్ని వైపులా నుంచి అంతా సవ్యంగా ఉందనే నమ్మకం కుదిరినప్పుడే అధికారిక ప్రకటన వస్తుంటుంది. కానీ అలాంటివేం లేకుండా .. పెద్దగా టెన్షన్స్ పెట్టుకోకుండా తన తదుపరి ప్రాజెక్టులను గురించి చాలా సింపుల్ గా ప్రకటించే దర్శకుడిగా ఒక్క రామ్ గోపాల్ వర్మనే కనిపిస్తారు. ఎలాంటి హడావిడి లేకుండా ఏ సమయంలో నైనా .. ఏ సందర్భంలోనైనా తన నెక్స్ట్ మూవీ గురించి ఎనౌన్స్ చేసేయడం ఆయన ప్రత్యేకత.

అలాంటి వర్మ తాజాగా కన్నడ సీనియర్ స్టార్ హీరో ఉపేంద్రతో ఒక సినిమా చేయనున్నట్టుగా చెప్పారు. నిన్న ఉపేంద్ర పుట్టినరోజు. ఈ సందర్భంలోనే ఆయనతో తాను ఒక యాక్షన్ సినిమా చేయనున్నట్టు వర్మ ట్విట్టర్ వేదికగా చెప్పారు. అయితే అందుకు ఉపేంద్ర వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ముందుగానే తమ మధ్య మాటలు నడిచినట్టుగా ఆయన స్పందించనూ లేదు. దాంతో వర్మ సరదాగా ఒక మాట వేశాడేమో .. అందులో నిజం లేదోమో అనే సందేహాలు సహజంగానే తలెత్తుతున్నాయి.

ఎందుకంటే వర్మ ఏదో ఒక సినిమాను గురించి ప్రకటించడం .. ఆ తరువాత ఆ ప్రాజక్టు గురించిన ఊసెత్తక పోవడం ఆయనకి అలవాటే. ఆయన నుంచి పోస్టర్ల వరకూ వచ్చి పత్తా లేకుండా పోయిన ప్రాజెక్టులు చాలానే ఉన్నాయి. అందువలన ఉపేంద్రతో సినిమా నిజంగానే ఉంటుందా? అనే డౌట్ ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇటీవల 'డియర్ మేఘ' సినిమా ఫంక్షన్ లో ఆ సినిమా హీరో ఆదిత్ అరుణ్ తో తాను ఓ సినిమా చేయనున్నట్టు అక్కడికక్కడే వర్మ మైకులో చెప్పేశారు. అప్పటి వరకూ తనకి కూడా ఆ విషయం తెలియదని ఆదిత్ అరుణ్ చెప్పడం కొస మెరుపు.