Begin typing your search above and press return to search.

సావిత్రి స్థాయి ఏమిటో చెప్పిన సీనియ‌ర్ న‌టి!

By:  Tupaki Desk   |   12 July 2019 4:45 AM GMT
సావిత్రి స్థాయి ఏమిటో చెప్పిన సీనియ‌ర్ న‌టి!
X
తెలుగువారికి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేని సినీ తార‌ల్లో వాణిశ్రీ ఒక‌రుగా చెప్పాలి. ఇప్ప‌టిత‌రం గుర్తు తెచ్చుకోవ‌టానికి కాస్త ఇబ్బంది ప‌డొచ్చు కానీ.. తెలుగు సినిమా మీద అవ‌గాహ‌న ఉన్న వారంతా వాణిశ్రీని ఇట్టే గుర్తు ప‌ట్టేస్తారు. అగ్ర‌న‌టిగా చెలామ‌ణీ అవుతూ..సీనియ‌ర్ న‌టిగా త‌న‌కు న‌చ్చిన పాత్ర‌ల్ని మాత్ర‌మే చేస్తున్న వాణిశ్రీ దాదాపు 13 ఏళ్లుగా వెండితెర‌కు దూరంగా ఉన్నారు. తాజాగా ఒక టీవీ సీరియ‌ల్ లో న‌టించ‌టానికి ఆమె ఓకే చెప్పారు.

తాజాగా ఎయిర్ కానున్న టీవీ సీరియ‌ల్ లో కీల‌క‌పాత్ర‌ను పోషిస్తున్న ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఒక ప్ర‌శ్న‌కు ఆమె చెప్పిన స‌మాధానం ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌హాన‌టి సావిత్రి త‌ర్వాత ఆమె స్థానాన్ని భ‌ర్తీ చేసిన క్రెడిట్ సావిత్రిద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తూ ఉంటుంది. ఇదే విష‌యాన్ని ఆమెను అడిగితే ఆమె స‌మాధానం ఊహించ‌ని రీతిలో ఉంది.

ఆమె మాట‌ల్ని య‌థాత‌ధంగా చెబితే.. "చాలా తప్పండీ ఆ మాట. ఆమె చందమామండీ. మేమేమో తారలం. మేం మెరుస్తుంటాం తప్ప, ఆమె ఆకాశంలో కనిపించే చందమామ. సినిమా కోసమే ఆమెని దేవుడు సృష్టించాడు. హావభావ ప్రదర్శనల్లో కానీ, సంభాషణలు చెప్పడంలో కానీ ఆమెకి ఆమే సాటి.

భానుమతి - కన్నాంబ - సావిత్రి... వీళ్లని మరొకరితో పోల్చలేం. ఎవరైనా వాళ్ల నుంచి స్ఫూర్తి తీసుకోవచ్చు కానీ, వాళ్లలా అయిపోతామని భావిస్తే అది తప్పు" అని చెప్పుకొచ్చారు. ఒక‌ప్పుడు వెండితెర‌ను శాసించినా.. కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నా.. సుదీర్ఘ‌కాలం ఇండస్ట్రీలో కొన‌సాగుతున్నా.. సావిత్రి న‌ట వార‌సురాలిగా పోలికకు సైతం తాను అర్హురాలిని కాద‌నే మాట వింటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క‌మాన‌దు. ఇంత ఒద్దిక‌గా మాట్లాడే న‌టిని ఇప్ప‌టికాలంలో అస్స‌లు చూడ‌లేమ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.