Begin typing your search above and press return to search.

అలంకార్ చరిత్రను గుర్తుచేస్తున్న'వంగవీటి'!

By:  Tupaki Desk   |   23 Dec 2016 7:30 AM GMT
అలంకార్ చరిత్రను గుర్తుచేస్తున్నవంగవీటి!
X
విజయవాడ నగర నడిబొడ్డున ఉండే "అలంకార్" థియేటర్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. నాటి విజయవాడ గొడవల్లో, రంగా హత్య సమయంలో చరిత్రకు ఈ థియేటర్ కూడా ఒక సాక్ష్యం! అవును... 1988 డిసెంబరు 26 విజయవాడ ప్రజానీకం ఎవరూ మరిచిపోలేని రోజు. నిరాహార దీక్షలో ఉన్న వంగవీటి రంగాను భక్తుల వేషదారణలో వచ్చిన ఆయన ప్రత్యర్థులు దారుణంగా హత్య చేసిన రోజు. అనంతరం విజయవాడ మొత్తం రణరంగంలా మారిపోయింది.. ఆ సమయంలో నాటి అల్లర్లలో భాగంగా విజయవాడలో ధ్వంసమైన ఆస్తుల్లో అలంకార్ థియేటర్ కూడా ఒకటి!

థియేటర్ పై దాడిచేసి నిప్పు పెట్టడంతో నాడు మొత్తం కాలిపోయి, మొండి గోడలతో మిగిలిన ఆ థియేటర్ ని కొన్నేళ్ల తర్వాత పునరుద్దరించిన సంగతి తెలిసిందే. ఇంతకూ ఇప్పుడు ఆ అలంకార్ థియేటర్ ప్రస్థావన ఎందుకంటే... సరిగ్గా 28 ఏళ్ల క్రితం ఏ విషయం మీద అయితే ఆ థియేటర్ ధ్వంసమయ్యిందో, ఆ సంఘటనకు సంబందించిన విషయంపై తెరకెక్కిన సినిమా "వంగవీటి" నేడు (డిసెంబరు 23) అదే అలంకార్ థియేటర్లో విడుదలయ్యింది!

ఆ సంగతి అలా ఉంటే... చరిత్రలో మాయని మచ్చగా, మరిచిపోలేని చేదు జ్ఞాపకంగా మిగిలిన నాటి సంఘటనకు సంబందించిన సినిమా విడుదల సందర్భంగా ఈ థియేటరుకు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ఇదే క్రమంలో విజయవాడ అంతటా ఒక రకమైన ఉద్రిక్త వాతావరణం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యి అలంకార్ థియేటర్ తో పాటు "వంగవీటి" ప్రదర్శితమయ్యే అన్ని థియేటర్లకూ భద్రత కల్పిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదలపై ఒక వర్గం అనుమతి లభించినా మరో వర్గం వ్యతిరేకిస్తుండటంతో ఫస్ట్ టాక్ బయటకు వచ్చిన అనంతరం పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో అనే ఆందోళన చాలామంది వ్యక్తం చేస్తున్నారట!!


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/