Begin typing your search above and press return to search.

వాల్తేరు వీరయ్య Vs వీర సింహా రెడ్డి..!

By:  Tupaki Desk   |   22 Oct 2022 3:45 AM GMT
వాల్తేరు వీరయ్య Vs వీర సింహా రెడ్డి..!
X
2023 సంక్రాంతి సందర్భంగా విడుదలయ్యే సినిమాల జాబితా పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నట్లుగానే ఈసారి పండక్కి బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ వార్ ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నడూ లేని విధంగా నాలుగు పెద్ద చిత్రాలు పోటీ పడబోతున్నాయి. ఇవన్నీ కూడా స్టార్ హీరోలు నటించిన చిత్రాలే కావడం విశేషం.

ఇప్పటికే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్'.. కోలీవుడ్ హీరో విజయ్ తెలుగు డెబ్యూ మూవీ 'వారసుడు' పొంగల్ సీజన్ లో థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అలానే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న #MEGA154 చిత్రాన్ని కూడా సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లు చాలా రోజుల క్రితమే పేర్కొన్నారు. కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'వాల్తేరు వీరయ్య' అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

అయితే ఇప్పుడు సంక్రాంతి రేసులోకి కొత్తగా నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా వచ్చి చేరాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న #NBK107 చిత్రానికి 'వీర సింహారెడ్డి' అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేసిన మేకర్స్.. వచ్చే పెద్ద పండుగకు థియేటర్లలో కలుద్దాం అంటూ పోస్టర్ ని వదిలారు. దీంతో ఈసారి బాక్సాఫీస్ బరిలో ప్రభాస్ - విజయ్ లతో పాటుగా చిరంజీవి - బాలయ్య కూడా దిగుతున్నట్లు అయింది.

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. 'వాల్తేరు వీరయ్య' - 'వీర సింహా రెడ్డి' సినిమాల మధ్య కొన్ని పోలికలు ఉన్నాయి. ఈ రెండు కూడా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ లో రూపొందుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్స్. రెండింటిలోనూ సీనియర్ హీరోల సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలానే రెండు టైటిల్స్ లోనూ 'వీర'త్వం కనిపిస్తోంది. అంతేకాదు హీరోలకు వీరాభిమానులైన దర్శకులు తెరకెక్కిస్తున్న సినిమాలు కావడం విశేషం.

మెగాస్టార్ 154వ సినిమాలో చిరు తో పాటుగా మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. నటసింహం 107వ సినిమాలో బాలయ్య ద్విపాత్రిభినయం చేయనున్నారు. ఒకటి ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో రూపొందుతుంటే.. మరొకటి రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ రెండు సినిమాలపై మంచి హైప్ ఉంది. అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే రెండూ ఒకేసారి వస్తుండటంతో అందరిలో ఆసక్తి రెట్టింపు అయ్యింది.

చిరంజీవి - బాలకృష్ణల మధ్య దశాబ్దాలుగా బాక్సాఫీస్ వార్ నడుస్తోంది. గతంలో అనేక సందర్భాల్లో ఇద్దరు స్టార్ హీరోలు పోటీ పడ్డారు. సంక్రాంతి సీజన్ లోనూ ఫైట్ చేసారు. చాలా కాలం తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒకేసారి రావడానికి నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య వార్స్ జరుగుతున్నాయి. ఈసారి గెలుపెవరిదో తేల్చుకుందాం అంటూ సవాళ్లు విసురుకుంటున్నారు. గత రికార్డులను గుర్తు చేసుకుంటూ.. నువ్వా నేనా అంటూ మాటల యుద్ధానికి దిగుతున్నారు. ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికి ట్విట్టర్ ను వేదికగా చేసుకున్నారు.

సంక్రాంతి బాక్సాఫీస్ వార్ ని 'వాల్తేరు వీరయ్య' Vs 'వీర సింహా రెడ్డి' గా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. చిరంజీవి వెర్సెస్ బాలకృష్ణ.. బాబీ vs గోపీచంద్ మలినేని.. దేవిశ్రీ ప్రసాద్ వెర్సెస్ ఎస్ థమన్.. ఇలా ప్రతీ అంశాన్ని పోటీగా పేర్కొంటున్నారు. ప్రస్తుతానికైతే రెండు సినిమాలు పండగ సీజన్ లో రాబోతున్నాయి. ఏది విజేతగా నిలుస్తుందనేది పక్కనపెడితే.. ఒకే బ్యానర్ నుంచి వస్తున్న చిత్రాలు కాబట్టి థియేటర్లను ఎలా పంచుతారనేది ఆసక్తికరంగా మారింది. మరి రెండింటినీ సంక్రాంతికి రిలీజ్ చేస్తారా లేదా రాబోయే రోజుల్లో మంతనాలు జరిపి మైత్రీ కుదురుస్తారా అనేది వేచి చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.