Begin typing your search above and press return to search.

కమెడియన్‌ కోసం ఇండియాస్ నెం.1... !

By:  Tupaki Desk   |   19 April 2022 3:41 AM GMT
కమెడియన్‌ కోసం ఇండియాస్ నెం.1... !
X
వడివేలు గురించి ఈ తరం ప్రేక్షకులకు పెద్దగా తెలియదు కాని 1980 మరియు 1990 కిడ్స్ కు ఆయన ఒక స్టార్‌. హీరోల స్థాయిలో ఆయన స్టార్ డమ్ దక్కించుకున్నాడు. హీరోగా చేసినవి ఒకటి రెండు సినిమాలు అయినా కూడా స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ గా ఆయన నిలిచాడు. ఆయన మరెవ్వరో కాదు తమిళ స్టార్‌ కమెడియన్‌. కింగ్‌ ఆఫ్ తమిళ్ కామెడీ వడివేలు.

కమెడియన్ గా ఆయన కేవలం తమిళ సినీ ప్రేక్షకులకు మాత్రమే పరిమితం అవ్వలేదు. ఆయన కామెడీని మొత్తం సౌత్ సినీ అభిమానులు అభిమానించారు.. ఆరాధించారు. అయితే కమెడియన్ గా ఆయన చేసిన సినిమాల కంటే ఆయన వివాదాలు ఒకానొక సమయంలో తారా స్థాయికి చేరాయి. పైగా ఆయన వైపు కొన్ని తప్పులు కూడా ఉన్నట్లుగా నిర్థారణ అవ్వడంతో సినిమాలకు దూరం అయ్యాడు.

దాదాపుగా దశాబ్ద కాలం పాటు ఇండస్ట్రీకి దూరం అయిన వడివేలు రీ ఎంట్రీకి సిద్దం అయ్యాడు. ఆయన హీరోగా గతంలో వచ్చిన నాయి శేఖర్ సినిమాకు ప్రస్తుతం సీక్వెల్ రూపొందుతుంది. గతంలో సుందర్ సి దర్శకత్వంలో నాయి శేఖర్ సినిమా రూపొందిన విషయం తెల్సిందే. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన సీక్వెల్‌ రూపొందుతుంది.

నాయి శేఖర్‌ రిటర్న్ అనే టైటిల్ తో సూరజ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమా చిత్రీకరణ శర వేగంగా జరుగుతోంది. చిత్రీకరణ లో భాగంగా సినిమాలోని ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. హీరోగా వడివేలు గతంలో చాలా సినిమాలు చేశాడు.. అందులో డాన్స్ లు చేశాడు. కాని ఇప్పుడు ఆయన వయసు ఆరు దశాబ్దాలు పూర్తి అయ్యింది. ఈ వయసు లో డాన్స్ లు చేయడం కష్టం.

హీరోగా నటిస్తున్నాడు కనుక డాన్స్ లు కూడా చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం పాట చిత్రీకరణ జరుగుతోంది. ఈ పాట కోసం ఇండియాస్ నెం.1 కొరియోగ్రాఫర్‌ ప్రభుదేవా రంగంలోకి దిగాడు. వడివేలు తో ప్రభుదేవా స్టెప్పులు వేయిస్తున్నాడు. వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా అవ్వడంతో తమిళ ఆడియన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

వడివేలు బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. అనుకోని కారణాల వల్ల సినిమాలకు దూరం అయిన వడివేలు మళ్లీ రంగంలోకి దిగుతున్న నేపథ్యంలో ఆయన అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. మరి అంచనాలకు తగ్గట్లుగా ఆయన సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.