Begin typing your search above and press return to search.

సైరా.. ఈ టైటిల్ ఓకేనా?

By:  Tupaki Desk   |   23 Aug 2017 4:30 AM GMT
సైరా.. ఈ టైటిల్ ఓకేనా?
X
మెగాస్టార్ చిరంజీవితో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను సినిమాగా తెరకెక్కించేందుకు కొన్నేళ్లుగా చర్చలు నడుస్తున్నాయి. ఎట్టకేలకు గత ఏడాది ఆ ప్రయత్నం ఓ కొలిక్కి వచ్చింది. కొన్ని నెలల కిందటే ఈ సినిమా ఖరారైంది. ఈ విషయంలో అధికారిక ప్రకటన రావడానికంటే ముందే ఈ చిత్రానికి ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ అనే టైటిల్ ఫిక్స్ చేసేశారు జనాలు. ఆ పేరుతో ఫ్యాన్ మేడ్ లోగోలు కూడా రెడీ చేశారు. అందరూ అదే ఈ సినిమా టైటిల్ అని ఫిక్సయిపోయి ఉన్నారు.

కానీ ఉన్నట్లుండి కథ మారిపోయింది. కొత్త టైటిల్ తెరమీదికి వచ్చింది. ఈ రోజు ‘సైరా’ అనే టైటిల్ ఖరారు చేస్తూ అధికారిక ప్రకటన ఇచ్చేశారు. ఐతే ఈ టైటిల్ విషయంలో జనాల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఒక చారిత్రక నేపథ్యం ఉన్న కథకు ఇది సరైన టైటిలేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ టైటిల్లో సినిమాకు తగ్గ గ్రాండియర్.. రిచ్ నెస్.. తీవ్రత కనిపించడం లేదన్నది చాలామంది మాట.

రాజమౌళి తీసిన భారీ కథలకు ‘మగధీర’ అని.. ‘బాహుబలి’ అని అందరికీ సులువుగా కనెక్టయ్యే.. భారీతనం ఉట్టిపడే.. క్యాచీగా ఉండే టైటిళ్లు పెట్టాడు. వాటిలాగా హీరో వీరత్వాన్ని చాటేలా.. గొప్పగా అనిపించేలా.. ఆ టైటిళ్లు ఉండటం ఆ సినిమాలకు ప్లస్ అయింది. కానీ ‘సైరా’ అలా అనిపించట్లేదు.

ఈ కాలంలో రెగ్యులర్ మాస్ సినిమాలకు పెట్టినట్లు ‘సై రా’ టైటిల్ ఉందని.. ఒక మాగ్నమ్ ఓపస్ టైటిల్ లాగా అయితే ఇది ధ్వనించట్లేదని అంటున్నారు. దీనికంటే ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ అనే టైటిలే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వేరే భాషలకు కూడా కనెక్టవడం కోసం ‘సై రా’ అని పెట్టారా అనుకుంటే అదీ కాదు. ఇతర భాషలకు టైటిల్ మార్చాల్సిందే. పోనీ ‘ఉయ్యాలవాడ..’ అని పెట్టుకోవడానికి ఆయన కుటుంబ సభ్యుల అభ్యంతరమేమైనా ఉందా అంటే అదీ లేదు. వాళ్లు ఉయ్యాలవాడ టైటిల్ పెట్టనందుకు అభ్యంతరాలు చెబతున్నారు. అలాంటపుడు ఏరికోరి ‘సైరా’ అనే టైటిల్ ఎందుకు పెట్టారన్నదే అర్థం కావడం లేదు.

ఈ టైటిల్ తో ఉన్న మరో ఇబ్బందేంటంటే.. దాన్ని జనాలు ‘సై..రా’ అని పలకరు. ‘సైరా’ అంటారు. ఆ సౌండింగ్ మరోలా ధ్వనిస్తుంది. ఐతే ఈ సినిమా మోషన్ పోస్టర్ చివర్లో ‘సైరా నరసింహారెడ్డి’.. అంటూ వచ్చే వాయిస్ ప్రకారం చూస్తే.. దీనికి సినిమాలో జస్టిఫికేషన్ ఇస్తారేమో అన్న అభిప్రాయం కూడా కలుగుతోంది. కొన్ని టైటిళ్లు ముందు అదోలా అనిపించి.. తర్వాత తర్వాత అలవాటైపోవడం కూడా జరుగుతుంది. ‘సైరా’ కూడా అలా అలవాటవుతుందేమో చూద్దాం.