Begin typing your search above and press return to search.

నాకు ఆక్సిజన్ ఇచ్చిందే యూవీ క్రియేషన్స్: తమన్

By:  Tupaki Desk   |   7 Feb 2022 4:36 AM GMT
నాకు ఆక్సిజన్ ఇచ్చిందే యూవీ క్రియేషన్స్: తమన్
X
టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా తమన్ గురించే మాట్లాడుకుంటున్నారు. 'అఖండ' సినిమాకి ఆయన అందించిన పాటలు .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆ సినిమా విజయంలో కీలకమైన పాత్రను పోషించాయి. త్వరలో థియేటర్లలో దిగనున్న చాలా పెద్ద సినిమాలు తమన్ చేసినవే. ఇక మరికొన్ని భారీ ప్రాజెక్టులు ఆయన చేతిలో ఉన్నాయి. సాధారణంగా చాలామంది సంగీత దర్శకులు ఒక సినిమా పూర్తి కాగానే మరో సినిమాకి వెళ్లిపోతుంటారు. కానీ తమన్ అలా కాదు. తాను ఏ సినిమా అయితే చేశాడో, ఆ సినిమా ప్రమోషన్స్ లో తాను కూడా ఒక భాగమవుతాడు.

తమన్ లోని ఇదే ప్రత్యేకత ఇప్పుడు హీరోలను .. దర్శక నిర్మాతలను ఆకట్టుకుంటోంది. ఒక సినిమా తన దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి ఆయన సోషల్ మీడియాలో సందడి చేయడం మొదలుపెడతాడు. ఆ సినిమాపై ఎప్పటికప్పుడు అంచనాలు పెంచుతూ వెళతాడు. ఆ సినిమా టీమ్ తో పాటు ప్రమోషన్స్ లో పాల్గొంటాడు. అలాంటి తమన్ తాజాగా 'రాధేశ్యామ్' గురించి ప్రస్తావించాడు. 'రాధేశ్యామ్' తెలుగు వెర్షన్ కి ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ .. "ఈ సినిమాను నిర్మించిన యూవీ క్రియేషన్స్ వారితో నాకు ఎంతో అనుబంధం ఉంది. నా చేతిలో ప్రాజెక్టులు లేకుండా నేను ఇబ్బంది పడుతున్న రోజుల్లో వాళ్లు దగ్గరికి వచ్చారు.

'మహానుభావుడు' .. 'భాగమతి' సినిమాలను నాపై గల నమ్మకంతో నా చేతిలో పెట్టారు. ఆ సినిమాలు నాకు మంచి పేరును తెచ్చిపెట్టాయి .. మరెన్నో ప్రాజెక్టులు రావడానికి కారణమయ్యాయి. అలా అక్కడి నుంచి ఎలాంటి గ్యాప్ లేకుండా ఇక్కడి వరకూ వచ్చాను. ఒక రకంగా కెరియర్ పరంగా నాకు వాళ్లు ఆక్సిజన్ ఇచ్చారు. నా ప్రయాణం మరింత ఊపుతో అక్కడి నుంచి ముందుకు వెళ్లడానికి కారకులయ్యారు. ఇప్పుడు కూడా 'రాధేశ్యామ్' సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చే అవకాశం నాకు ఇచ్చారు. క్రేజ్ పరంగా .. బడ్జెట్ పరంగా చూసుకుంటే నిజానికి నా స్థాయికి మించిన సినిమా ఇది.

అయినా నాపై గల అభిమానంతో .. నమ్మకంతో నాకు ఈ సినిమాకి పనిచేసే ఛాన్స్ ఇచ్చారు. అయితే గతంలో వాళ్లు నాకు చేసిన సాయానికి కృతజ్ఞతగా నేను ఈ సినిమాకి ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా పనిచేశాను. ఈ సినిమా చేస్తున్నప్పుడు నాకు ఒక అద్భుతమైన అనుభూతి కలిగింది. ఈ కథ .. విజువల్స్ నన్ను మరో ప్రపంచంలోకి తీసుకుని వెళ్లాయి. దర్శకుడు రాధాకృష్ణకుమార్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకుని వెళ్లాడు. మార్చి 11వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ప్రేమ అనేది ఎంత నిజమో .. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం కూడా అంతే నిజం" అని చెప్పుకొచ్చాడు.