Begin typing your search above and press return to search.

తమిళ 'ఉప్పెన' విషయంలో కొత్త ట్విస్ట్‌

By:  Tupaki Desk   |   21 April 2020 12:40 PM IST
తమిళ ఉప్పెన విషయంలో కొత్త ట్విస్ట్‌
X
మెగా ఫ్యామిలీ నుండి వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా పరిచయం కాబోతున్న ‘ఉప్పెన’ చిత్రం లాక్‌ డౌన్‌ కారణంగా విడుదల ఆగిపోయిన విషయం తెల్సిందే. లేదంటే ఇప్పటికే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫలితంపై క్లారిటీ వచ్చేసేది. ఈ సినిమాను సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కించాడు. సుకుమార్‌ తో కలిసి మైత్రి మూవీస్‌ వారు ఈ సినిమాను నిర్మించారు. విభిన్నమైన కాన్సెప్ట్‌ తో గురువుకు తగ్గట్లుగా దర్శకుడు బుచ్చి బాబు ఉప్పెన’ సినిమాను తెరకెక్కించినట్లుగా పాటలు.. టీజర్‌ చూస్తుంటే అనిపిస్తుంది.

ఈ చిత్రంలో వైష్ణవ్‌ తేజ్‌ తో పాటు మరో స్టార్‌ విజయ్‌ సేతుపతి నటించాడు. తమిళంలో భారీ క్రేజ్‌ ఉన్న విజయ్‌ సేతుపతి ఈ చిత్రంలో నటించడంతో అక్కడ పెద్ద ఎత్తున విడుదల చేయాలని మేకర్స్‌ భావించారు. విజయ్‌ సేతుపతికి భారీ పారితోషికం ఇచ్చింది కూడా అందుకే అనే ప్రచారం జరిగింది. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఉప్పెనను భారీగా విడుదల చేయాలని మొన్నటి వరకు అనుకున్న చిత్ర యూనిట్‌ సభ్యులు తాజాగా కొత్త ట్విస్ట్‌ ఇచ్చారు.

విజయ్‌ సేతుపతి ఈ సినిమాపై చాలా ఇష్టం పెంచుకున్నాడట. అది ఎంతగా అంటే తమిళంలో ఈ సినిమాను తానే స్వయంగా రీమేక్‌ చేయాలనుకుంటున్నాడట. ఉప్పెన సినిమాను తమిళంలో రీమేక్‌ చేసేందుకు రీమేక్‌ రైట్స్‌ ను విజయ్‌ సేతుపతి దక్కించుకోవడంతో పాటు అప్పుడే తమిళ స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా మొదలు పెట్టించినట్లుగా తెలుస్తోంది. విజయ్‌ సేతుపతితో కలిసి మైత్రి మూవీస్‌ వారు ఈ రీమేక్‌ ను నిర్మించే అవకాశాలు ఉన్నాయట.

ఇక తెలుగు వర్షన్‌ కు డైరెక్షన్‌ చేసిన బుచ్చి బాబు తమిళంలో కూడా దర్శకత్వం చేసే అవకాశాలున్నాయంటున్నారు. మరి వైష్ణవ్‌ తేజ్‌ పాత్రను ఏ హీరోతో చేయిస్తారనేది ఆసక్తికరంగా మారింది. తెలుగులో విజయ్‌ సేతుపతి పోషించిన పాత్రను ఆయనే పోషించే అవకాశాలున్నాయట. ఈ లాక్‌ డౌన్‌ పూర్తి అయ్యి అంతా సర్దుకున్న తర్వాత ఉప్పెన రీమేక్‌ కు సంబంధించిన ప్రకటన చేస్తారని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.