Begin typing your search above and press return to search.

ఏప్రిల్ 22.. హీరోల‌ మ‌ధ్య పంచాయితీ ఏంటో చూడాలి

By:  Tupaki Desk   |   14 April 2022 4:28 AM GMT
ఏప్రిల్ 22.. హీరోల‌ మ‌ధ్య పంచాయితీ ఏంటో చూడాలి
X
ప్ర‌తి శుక్ర‌వారం థియేట‌ర్ల‌లోకి సినిమాలు వ‌స్తున్నాయి. కానీ వీటిలో విజ‌యం సాధించేవి ఎన్ని.. ప‌రాజ‌యంతో వెనుదిరిగేవి ఎన్ని అన్న‌ది అటుంచితే క‌రోనా క్రైసిస్ త‌ర్వాత ప‌రిస్థితులు అదుపులోకి రావ‌డం సినీప‌రిశ్ర‌మ‌కు పెద్ద ఊర‌ట‌. పుష్ప సంచ‌ల‌న విజ‌యం త‌ర్వాత కేజీఎఫ్ 2 సంచ‌ల‌న ఓపెనింగుల‌తో పాజిటివ్ ఫీడ్ బ్యాక్ తో మొద‌లైంది. బీస్ట్ చిత్రానికి మిశ్ర‌మ స్పంద‌న‌లు వ్య‌క్త‌మైనా ఓపెనింగుల్లో మురిపిస్తోందని ట్రేడ్ చెబుతోంది. ఇవ‌న్నీ భారీ సినిమాలు.. అయితే చిన్న సినిమాల సంగ‌తేమిటీ అన్న‌ది వేచి చూడాలి.

ఇక‌పోతే ఏప్రిల్ 22న ఏ సినిమాలు వ‌స్తున్నాయి? అన్న‌ది చూస్తే.. ఈసారి పోటా పోటీ గా మూడు ప‌రిమిత బ‌డ్జెట్ సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో విడుద‌ల‌వుతున్నాయి. ముఖ్యంగా నాగ‌శౌర్య వ‌ర్సెస్ విశ్వ‌క్ సేన్ షో కొన‌సాగ‌నుంది. వీళ్ల‌తో పాటు యాంక‌ర్ సుమ న‌టించిన జ‌య‌మ్మ పంచాయితీ విడుద‌ల‌వుతోంది.

క్లాసీ టైటిల్స్ తో వ‌స్తున్నారు!

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ క్ష‌ణం తీరిక లేనంత బిజీగా ఉన్న న‌టుల్లో నాగ‌శౌర్య పేరు ఉంది. జ‌యాప‌జ‌యాల‌తో ప‌ని లేకుండా అత‌డు వ‌రుస‌గా చిత్రాల్లో న‌టిస్తున్నాడు. సొంత బ్యాన‌ర్ లో న‌టిస్తూనే బ‌య‌టి బ్యాన‌ర్ల‌కు ప‌ని చేస్తున్నాడు. తాజాగా అత‌డు న‌టిస్తున్న 'కృష్ణ వ్రిందా విహారి' ప్లెజెంట్ లుక్ తో విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇది రొమాంటిక్ ఎంటర్ టైనర్.. నాగ శౌర్య స‌ర‌స‌న‌ బాలీవుడ్ నటి షిర్లీ సెటియా న‌టిస్తోంది. అనీష్ ఆర్.కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఐరా క్రియేషన్స్ నిర్మించింది. ఇటీవ‌ల ఉగాది శుభాకాంక్షలు పోస్ట‌ర్ వైర‌ల్ గా దూసుకెళ్లింది. ఆహ్లాద‌క‌ర‌మైన క‌థాంశంతో ఈ మూవీ ఆక‌ట్టుకోనుంద‌ని పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయి. శౌర్య కొన్ని వ‌రుస ప్ర‌యోగాల‌తో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ఈసారి కూడా నేటిత‌రం మెచ్చే కంటెంట్ తో వ‌స్తున్నాడు. అంద‌మైన టైటిల్ ఆహ్లాద‌క‌మైన కంటెంట్ తో అతడి రాక ఆస‌క్తిని క‌లిగిస్తోంది. రాధికా శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుండ‌గా.. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్- సత్య- బ్రహ్మాజీ- రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్వర సాగర్ మహతి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

ఇక ఫ‌ల‌క్ నుమా దాస్- పాగ‌ల్- హిట్2 అంటూ రెబ‌ల్ సినిమాలు చేసిన విశ్వ‌క్ సేన్ ఈసారి ప్లెజెంట్ స్టోరీతో ఫ్యామిలీ ఆడియెన్ ని అల‌రించేందుకు వ‌స్తున్నాడు. తాజాగా 'అశోక వనంలో అర్జున కళ్యాణం' కంటెంట్ ప‌రంగా శౌర్య సినిమాకి ధీటైన‌దేన‌ని విజువ‌ల్స్ వెల్ల‌డించాయి. రుష్కర్ దిల్లాన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర డిజిటల్ బ్యానర్ పై బాపినీడు- సుధీర్ నిర్మిస్తుండగా విద్యా సాగర్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్ సాంగ్ ప్ర‌తిదీ ఆక‌ట్టుకున్నాయి. టీజర్లో ఏజ్ పెరిగిపోయిన అబ్బాయికి పెళ్లి కుదిరితే.. అది కూడా కులాంత‌ర వివాహం కుదిరాక ఏం జ‌రిగింద‌నేది తెర‌పై చూపిస్తున్నారు. క్యూరియస్ ఎలిమెంట్స్ చ‌క్క‌ని కథాంశంతో కామెడీ ఎమోషనల్ గా తెరకెక్కించార‌ని టాక్ ఉంది. కామెడీ ఎమోష‌న్ తో ఈ మూవీ ఏ మేర‌కు రాణిస్తుందో చూడాలి.

జ‌య‌మ్మ పంచాయితీ సంగ‌తేంటో?

సీనియ‌ర్ యాంక‌ర్ గా సుమ క‌న‌కాల ఎంత బిజీగా ఉంటారో తెలిసిందే. త‌నదైన అనుభ‌వంతో ఎలాంటి సినిమా వేడుక‌ను అయినా ర‌క్తి క‌ట్టించ‌డం త‌న ప్ర‌త్యేక‌త‌. ప్ర‌స్తుతం బుల్లితెర రియాలిటీ షోల‌ నిర్మాత‌గానూ స‌త్తా చాటుతున్నారు. టీవీ షోల‌కు హోస్టింగ్ చేస్తూ తన భ‌ర్త రాజీవ్ తో క‌లిసి ప‌లు క్రేజీ షోల‌ను నిర్మిస్తున్నారు. ఇక సుమ అడ‌పాద‌డ‌పా తెలుగు సినిమాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగానూ న‌టించారు. తాజాగా సుమ న‌టించిన నాయికా ప్ర‌ధాన చిత్రం జ‌య‌మ్మ పంచాయితీ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

ఇది ప‌ల్లెటూరి నేప‌థ్యం ఉన్న సినిమా. ఆంధ్రా ప‌ల్లెల్లో సీన్ అంతా ఇంత‌కుముందు విడుద‌లైన టీజ‌ర్ విజువ‌ల్స్ లో క‌నిపిస్తోంది. బుర్ర‌క‌థ‌ను కూడా చూపించారు కాబ‌ట్టి క‌థాంశం కాస్త పాత కాలం నాటిదేన‌ని భావించ‌వ‌చ్చు. ఊరు ఊరి పెద్ద‌లు గొడ‌వ‌లు..న‌డుమ‌ ఇంత‌కీ జ‌య‌మ్మ పంచాయితీ క‌థాకమామీషు ఏంటో కానీ తెర‌పైనే చూడాలి. రెండ్రోజుల్లో తేల్చ‌క‌పోతే పంచాయితీ ఉండదు పెద్ద‌లు ఉండ‌రు! అంటూ జ‌య‌మ్మ గ‌ట్టిగానే వార్నింగ్ ఇచ్చింది కాబ‌ట్టి సుమ న‌ట‌న ఎలా ఉంటుందో చూడాల‌న్న ఉత్సాహం పెరిగింది.

మొత్తానికి జ‌య‌మ్మ వ‌సూళ్ల పంచాయితీ క‌థేమిటో కానీ ఆస‌క్తిని క‌లిగిస్తోంది. చాలా సింపుల్ గా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఇలాంటి క‌థ‌ను ఎంచుకుని పాత్ర‌ను హైలైట్ చేస్తూ ఏదో కొత్త‌గానే ట్రై చేస్తున్న‌ట్టు కనిపిస్తోంది. జ‌య‌మ్మ పంచాయితీతో సుమ కొత్త జ‌ర్నీ ఆస‌క్తిని క‌లిగిస్తోంది. విజయ్ కుమార్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. రానున్న మూడు సినిమాల బాక్సాఫీస్ రిజ‌ల్ట్ ఎలా ఉండ‌నుందో వేచి చూడాలి.