Begin typing your search above and press return to search.

SSMB28 కోసం ఆ న‌లుగురూ వ‌చ్చేస్తున్నారు!

By:  Tupaki Desk   |   20 Dec 2022 6:08 AM GMT
SSMB28 కోసం ఆ న‌లుగురూ వ‌చ్చేస్తున్నారు!
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, త్రివిక్ర‌మ్ ల క‌ల‌యికలో ఓ భారీ పాన్ ఇండియా మూవీ తెర‌పైకి రాబోతున్న విష‌యం తెలిసిందే. SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై స్టార్ ప్రొడ్యూస‌ర్ ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. 'ఖ‌లేజా' త‌రువాత దాదాపు 12 ఏళ్ల విరామం అనంత‌రం ఈ ఇద్ద‌రు క‌లిసి ఈ ప్రాజెక్ట్ చేస్తున్న విష‌యం తెలిసిందే. అత‌డు, ఖ‌లేజా వంటి సినిమాల త‌రువాత ముచ్చ‌ట‌గా మూడ‌వ సారి త్రివిక్ర‌మ్‌, మ‌హేష్‌ క‌లిసి చేస్తున్న మూవీ కావ‌డంతో ఈ ప్రాజెక్ట్ పై అభిమానుల్లో భారీ క్రేజ్ ఏర్ప‌డింది.

ఎప్పుడెప్పుడు ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళుతుందా? అని అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్ట‌కేల‌కు వారి ఎదురు చూపుల‌కు తెర‌దించుతూ ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ని సెప్టెంబ‌ర్ లో మొద‌లు పెట్టారు. ఫ‌స్ట్ షెడ్యూల్ ని యాక్ష‌న్ ఘ‌ట్టాల నేప‌త్యంలో మొద‌లు పెట్టి పూర్తి చేశారు. అయితే ఆ త‌రువాత మ‌హేష్ మ‌ద‌ర్ చ‌నిపోవ‌డం.. ఆ త‌రువాత ఫాద‌ర్ కృష్ణ మృతి చెంద‌డంతో మ‌హేష్ అప్ సెట్ అయ్యాడు. కొంత విరామం తీసుకున్నాడు.

ఈ నేప‌థ్యంలోనే త్రివిక్ర‌మ్ క‌థ మొత్తం మార్చేసి ఫ‌స్ట్ షెడ్యూల్ షూట్ చేసిన దాన్ని ప‌క్క‌న పెట్టేశాడు. కొత్త మార్పుల‌తో స‌రికొత్త నేప‌థ్యంలో త్రివిక్ర‌మ్ చెప్పిన ఫైన‌ల్ స్క్రిప్ట్‌న‌చ్చ‌డంతో మ‌హేష్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు. తండ్రి కృష్ణ చ‌నిపోయిన బాధ నుంచి తేరుకున్న మ‌హేష్ దుబాయ్ లో మౌంటేన్ డ్యూ క‌మ‌ర్షియ‌ల్ యాడ్ లో న‌టించి త‌ను షూటింగ్ కి రెడీ అనే సంకేతాల్ని అందించాడు. దీంతో ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ డిసెంబ‌ర్ రెండ‌వ వారం నుంచి మొద‌ల‌వుతుంద‌ని అంతా భావించారు.

కానీ అనూహ్యంగా ఆ టైమ్ కూడా మారిన‌ట్టుగా తెలుస్తోంది. ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ని జ‌న‌వ‌రి లో సంక్రాంతి ఫెస్టివెల్ త‌రువాత ప్రారంభించ‌బోతున్నార‌ని తెలిసింది.

ఇప్ప‌టికే ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ ని పూర్తి చేసిన త్రివిక్ర‌మ్ షూటింగ్ షెడ్యూల్ కోసం ప‌క్కాగా అన్ని డేట్స్ ని, ఆర్టిస్ట్ ల డేట్స్ ని కూడా ఫైన‌ల్ చేసుకుని ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ఈ మూవీని మొద‌లు పెట్ట‌బోతున్నాడ‌ట‌. అంతే కాకుండా ఈ మూవీ కోసం ఇద్ద‌రు క్రేజీ యాక్ట‌ర్స్ ని త్రివిక్ర‌మ్ ముచ్చ‌ట‌గా మూడ‌వ సారి రిపీట్ చేయ‌బోతున్న‌ట్టుగా తెలుస్తోంది.

వాళ్లే బోమ‌న్ ఇరానీ, న‌దియా. ఈ ఇద్ద‌రిలో బోమ‌న్ ఇరానీ.. త్రివిక్ర‌మ్ రూపొందించిన 'అత్తారింటికి దారేది', అజ్ఞాత‌వాసి చిత్రాల్లో న‌టించాడు. త్రివిక్ర‌మ్ తో త‌న‌కు ఇది మూడ‌వ సినిమా. ఇక న‌దియా కూడా 'అత్తారింటికి దారేది', 'అఆ' సినిమాల్లో న‌టించింది. త‌న‌కు కూడా త్రివిక్ర‌మ్ తో ఇది మూడ‌వ సినిమా కానుంది. ఇక వీరితో పాటు ట‌బు, స‌చిన్ ఖేడేక‌ర్ కూడా ఇందులో న‌టించ‌నున్నార‌ట‌. వీరిద్ద‌రు కూడా త్రివిక్ర‌మ్ రూపొందించిన 'అల వైకుంఠ‌పుర‌ములో' మూవీలో న‌టించిన విష‌యం తెలిసిందే. బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.