Begin typing your search above and press return to search.

సైలెంట్ గా పని కానిచ్చేస్తున్న ప్రభాస్..!

By:  Tupaki Desk   |   27 Oct 2022 6:34 AM GMT
సైలెంట్ గా పని కానిచ్చేస్తున్న ప్రభాస్..!
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఆదిపురుష్' - 'సలార్' - 'ప్రాజెక్ట్ K' వంటి భారీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నారు. 'స్పిరిట్' వంటి మరో పాన్ ఇండియా మూవీ కూడా అతని లైనప్ లో ఉంది. అయితే వీటితో పాటుగా మారుతి దర్శకత్వంలో డార్లింగ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

'రాజా డీలక్స్' అనే టైటిల్ తో ప్రచారం చేయబడుతున్న ఈ సినిమా గురించి ఇప్పటి వరకూ మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఏ అప్డేట్ ఇవ్వకుండా చడీచప్పుడు లేకుండా సినిమాని లాంచ్ చేశారు. అదే విధంగా సైలెంట్ గా రెగ్యులర్ షూటింగ్ కూడా జరుపుతున్నారని టాక్ వినిపిస్తోంది.

ప్రభాస్ - మారుతీల సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌ లో సైలెంట్‌ గా సాగుతోందని సమాచారం. బుధవారం ప్రభాస్ కూడా చిత్రీకరణలో జాయిన్ అయ్యాడని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో రెగ్యులర్‌ సీన్స్ షూటింగ్ జరుగుతోందని నివేదికలు పేర్కొంటున్నాయి.

ఇకపోతే ప్రభాస్ తో మారుతి ఒక హారర్ కామెడీ థ్రిల్లర్ ని తెరకెక్కిస్తున్నట్లుగా చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తారని.. ముగ్గురు హీరోయిన్లు ఉంటారని టాక్. మాళవిక మోహనన్ - నిధి అగర్వాల్ లతో పాటుగా మరో హీరోయిన్ ని ఎంపిక చేశారని తెలుస్తోంది.

సంజయ్ దత్ - బొమన్ ఇరానీ వంటి ప్రముఖ బాలీవుడ్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారని కూడా చెప్పుకుంటున్నారు. ఈ చిత్రాన్ని అఫిషియల్ గా అనౌన్స్ చేసిన తర్వాత నటీనటులు - సాంకేతిక నిపుణుల బృందం వివరాలపై క్లారిటీ వస్తుంది.

ప్రభాస్ - మారుతి ప్రాజెక్ట్ ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో రూపొందిస్తున్నారు. డార్లింగ్ అభిమానులు మొదట్లో ఈ చిత్రాన్ని వ్యతిరేకించినప్పటికీ.. మారుతి అయితే ఇప్పుడు ప్రభాస్ ను సరికొత్తగా చూపిస్తారని నమ్ముతున్నాను. స్టార్ హీరో భారీ ప్రాజెక్ట్స్ మధ్య ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే.. ఏదో ప్రత్యేకత ఉండి ఉంటుందని భావిస్తున్నారు.

మరోవైపు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన 'ఆది పురుష్' సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతోంది. ప్రశాంత్ నీల్ తో చేస్తున్న 'సలార్' మూవీ వచ్చే ఏడాది సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న 'ప్రాజెక్ట్ K' రావడానికి కాస్త టైం పడుతుంది. ప్రభాస్ ఈ గ్యాప్ లో మారుతి చిత్రాన్ని పూర్తి చేసే అవకాశం ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.