Begin typing your search above and press return to search.

అంటే.. సుందరం బోల్తా కొట్టింది అందుకే

By:  Tupaki Desk   |   15 Jun 2022 5:25 AM GMT
అంటే.. సుందరం బోల్తా కొట్టింది అందుకే
X
కాస్త భిన్నమైన కథ ఎంచుకుని.. దాన్ని కొత్తగా నరేట్ చేస్తూ, చక్కగా వినోదం పండిస్తూ ప్రేక్షకులను బాగానే ఎంగేజ్ చేయడానికి ప్రయత్నించింది 'అంటే సుందరానికీ' టీం. నాని, నజ్రియా నజ్రీన్ లాంటి అభిరుచి ఉన్న నటీనటుల్ని ప్రధాన పాత్రలకు ఎంచుకుని యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ.. మనసు పెట్టి చేసిన సినిమా ఇది. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసింది.

సాంకేతిక హంగులు కూడా బాగా కుదిరిన చిత్రంలో మైనస్‌ల కంటే ప్లస్సులే ఎక్కువ. ప్రథమార్ధం కాస్త నెమ్మదిగా నడుస్తుంది, లెంగ్త్ ఎక్కువ అన్న కంప్లైంట్లు పక్కన పెడితే ఇది డీసెంట్ మూవీనే.

అయినా ఈ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర తిరస్కారం తప్పలేదు. వీకెండ్లోనే ఆశించిన వసూళ్లు రాబట్టలేకపోయిన ఈ చిత్రం.. ఆ తర్వాత మరింత డీలా పడిపోయింది. దీంతో నాని అండ్ టీం తీవ్ర నిరాశకు గురై ఉంటుందనడంలో సందేహం లేదు. అసలు మంచి సినిమా చేసినా.. ఇలాంటి ఫలితం వచ్చిందేంటా అన్నది ఇప్పుడు ఈ చిత్ర బృందాన్నే కాదు.. మొత్తం ఇండస్ట్రీనే ఆలోచనలో పడేస్తోంది.

అసలు 'అంటే సుందరానికీ' చిత్రానికి ఇలాంటి ఫలితం రావడానికి కారణాలేంటన్నది చూడాలి. కొవిడ్ తర్వాత ప్రేక్షకులు ఓటీటీలకు అలవాటు పడిపోయి థియేటర్లకు రావడం తగ్గిపోయింది. భారీతనం, ప్రత్యేకమైన విజువల్ ఎక్స్‌పీరియన్స్, స్టార్ పవర్ ఉన్న సినిమాలు వస్తేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. అలా అని స్టార్లు ఉన్నా కూడా సినిమా చూస్తారన్న గ్యారెంటీ కూడా కనిపించడం లేదు. అందుకు ఉదాహరణ 'ఆచార్య' మూవీనే. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 లాంటి భారీతనం, యాక్షన్ ఉన్న సినిమాలకు మాత్రమే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

అవి కాక ఆడినవి తక్కువే. 'అశోకవనంలో అర్జున కళ్యాణం' సినిమాకు వచ్చిన టాక్, రిలీజ్ ముంగిట క్రియేట్ అయిన బజ్ ప్రకారం చూస్తే పెద్ద హిట్టవ్వాల్సింది. కానీ అది ఓ మోస్తరుగానే ఆడింది. సినిమా చాలా బాగుంది, క్రేజీగా ఉందనే టాక్ వచ్చి ఉంటే 'అంటే సుందరానికీ' ఫలితం వేరుగా ఉండేది. రివ్యూలు, మౌత్ టాక్‌లో సినిమా నాట్ బ్యాడ్ అన్నారే తప్ప సూపర్ అనే టాక్ రాలేదు. ముందు వారం వచ్చిన మేజర్, విక్రమ్ సినిమాలకు ఆల్రెడీ ప్రేక్షకులు కనెక్ట్ అయి ఉండగా.. ఎబోవ్ యావరేజ్ టాక్ రావడం నెగెటివ్ అయింది.

దీనికి తోడు ఆ రెండు చిత్రాలకు టికెట్ల ధరలు తక్కువ. నాని చిత్రానికి ఎక్కువ పెట్టారు. టాక్ చాలా బాగున్న సినిమాలకు రేట్లు తక్కువ ఉండి.. వాటితో పోలిస్తే యావరేజ్ అన్న సినిమాకు ధరలు ఎక్కువ ఉంటే జనం ఎలా థియేటర్లకు వెళ్తారు? నానీకి ఫ్యామిలీస్‌లో, యూత్‌లో ఉన్న ఫాలోయింగ్‌ మీద నమ్మకం పెట్టుకున్నారు కానీ.. కొవిడ్ టైంలో ప్రేక్షకుల ఆలోచనలు మారిపోయాయి. నాని బ్రాండ్ వాల్యూ కూడా దెబ్బ తింది. ఇలా చాలా ఫ్యాక్టర్స్ తోడై 'అంటే సుందరానికీ' బాక్సాఫీస్ ఫ్లాప్‌ దిశగా అడుగులేస్తోంది.