Begin typing your search above and press return to search.

ఏజెంట్ ను ఇంకెప్పుడు రిలీజ్ చేస్తారు..?

By:  Tupaki Desk   |   12 Nov 2022 3:30 PM GMT
ఏజెంట్ ను ఇంకెప్పుడు రిలీజ్ చేస్తారు..?
X
'అఖిల్' సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన యూత్ కింగ్ అఖిల్ అక్కినేని.. సక్సెస్ అందుకోడానికి చాలా తీవ్రంగా కష్టపడ్డాడు. ఎట్టకేలకు తన నాల్గవ చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' తో హిట్టు రుచి చూశాడు. ఈ జోష్ లో ఈసారి "ఏజెంట్" మూవీతో పాన్ ఇండియాని టార్గెట్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

అఖిల్ హీరోగా స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ''ఏజెంట్''. అక్కినేని నాగార్జునను అభిమానించే అనిల్ సుంకర దీనికి నిర్మాత. రామబ్రహ్మం సుంకర సమర్పణలో ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సురేందర్ రెడ్డి తన సురేందర్2సినిమా బ్యానర్ ని కూడా నిర్మాణంలో భాగస్వామిని చేశారు.

అక్కినేని వారసుడి మార్కెట్ ను మించి భారీ బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ ను తలపెట్టారు దర్శక నిర్మాతలు. లాంచింగ్ రోజే రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసి, అంతా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో చేయాలని అనుకున్నారు. అయితే పరిస్థితులు అనుకూలించలేదు. పాండిమిక్ కారణంగా షూటింగ్ ఆలస్యమైంది. ఆ తర్వాత కూడా వివిధ కారణాలతో అనుకున్న విధంగా ముందుకు సాగలేదు.

ఈ నేపథ్యంలో 2021 డిసెంబర్ 21న విడుదల చేయాలనుకున్న సినిమా కాస్తా.. 2022 డిసెంబరు నాటికి కూడా రెడీ కావడం లేదు. దీంతో బడ్జెట్ కూడా కంట్రోల్ దాటిపోయిందని తెలుస్తోంది. ఇనిషియల్ గా 40 కోట్లు అనుకుంటే.. ఇప్పుడు దానికి రెండింతలు అవుతుందనే ప్రచారం జరుగుతోంది. అయితే అఖిల్ మీద అంత బడ్జెట్ వర్కౌట్ అవుతుందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

ఇలాంటి పరిస్థితుల్లో "ఏజెంట్" చిత్రాన్ని 2023 సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అప్పటికి ఆది పురుష్ - వాల్తేరు వీరయ్య - వీర సింహా రెడ్డి - వారసుడు వంటి సినిమాలు పండక్కి రేసులో ఉన్నాయి. పెద్ద హీరోల మధ్య అఖిల్ నలిగిపోతాడేమో అనే కామెంట్స్ వచ్చాయి.

భారీ బడ్జెట్ తో తీస్తున్న సినిమా కాబట్టి ఫెస్టివల్ సీజన్ లో అయితే వర్కౌట్ అవుతుందని నిర్మాత భావించి ఉండొచ్చని అనుకున్నారు. మరికొందరు మాత్రం సురేందర్ రెడ్డితో వీలైనంత త్వరగా "ఏజెంట్" ను పూర్తి చేయించాలని సంక్రాంతి రిలీజ్ అని ప్రకటించారేమో అనే సందేహాలు వ్యక్తం చేశారు.

ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. సంక్రాంతికి "ఏజెంట్" విడుదలయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. మహా శివరాత్రి స్పెషల్ గా ఫిబ్రవరిలో వచ్చే ఛాన్స్ ఉందనే టాక్ నడుస్తోంది. అయితే అక్కినేని ఫ్యాన్స్ మాత్రం 2023 ఏప్రిల్ 7వ తేదీని పరిశీలించమని నిర్మాతకు సూచిస్తున్నారు.

గుడ్ ఫ్రైడేతో పాటుగా అఖిల్ బర్త్ డే మరియు సమ్మర్ హాలిడేస్ కలిసొస్తాయని అంటున్నారు. కాకపోతే అక్కడి దాకా తీసుకెళ్తే బడ్జెట్ ఇంకొంత పెరుగుతుంది. ఏదేమైనా అఖిల్ మార్కెట్ కి రెండింతల బడ్జెట్ ఖర్చు చేస్తున్నారు కాబట్టి.. "ఏజెంట్" ను మంచి రిలీజ్ డేట్ కి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మరి అనిల్ సుంకర మరియు సూరి కలిసి ఏ విధంగా ప్లాన్ చేస్తారో చూడాలి.

"ఏజెంట్" చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ అందించారు. హిప్ హాప్ తమిజా మ్యూజిక్ కంపోజ్ చేస్తుండగా.. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ను రిలీజ్ చేయనున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.