Begin typing your search above and press return to search.

రెచ్చిపోతున్న రష్మికను ఆపడం అసాధ్యమే!

By:  Tupaki Desk   |   2 May 2022 4:30 PM GMT
రెచ్చిపోతున్న రష్మికను ఆపడం అసాధ్యమే!
X
రష్మిక మందనకి యూత్ లో ఇప్పుడు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వెండితెరపై తెల్ల మందారంలా తేలిపోయే ఈ పిల్లను చూసి మనసులు పారేసుకోని కుర్రాళ్లు లేరు. అందానికి అదృష్టం తోడైతే ఎలా ఉంటుందో చూడాలనుకునేవారికి రష్మికను మించిన ఉదాహరణ లేదు. కన్నడలో స్టార్ డమ్ వచ్చిన తరువాతనే ఈ బ్యూటీ 'ఛలో ' అంటూ టాలీవుడ్ వచ్చేసింది. అప్పటి నుంచి అమ్మడు చేసిన ప్రతి సినిమా హిట్. టాలీవుడ్లో టాప్ 3 స్థానాల్లో ఉన్న ముగ్గురు హీరోయిన్స్ లో ఒకరిగా రష్మిక ఇప్పుడు చక్రం తిప్పుతోంది.

రష్మిక చేసిన బాలీవుడ్ మూవీ ఒక్కటి కూడా ఇంతవరకూ విడుదల కాలేదు. అయినా దేశవ్యాప్తంగా ఈ సుందరికీ ఒక రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది . ప్రపంచవ్యాప్తంగా ఉన్న సౌత్ ఇండియా అభిమానులు ఆమెను ఆరాధిస్తూనే ఉన్నారు. 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా హిట్ చూసిన రష్మిక, 'పుష్ప 2' సినిమాతో సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది. 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమాతో పడిన ఫ్లాప్ ను ' పుష్ప 2' చెరిపేస్తుందనే ఆమె భావిస్తోంది. ఆ తరువాత కొరటాల - ఎన్టీఆర్, గౌతమ్ తిన్ననూరి - చరణ్, నాగచైతన్య - పరశురామ్ కాంబినేషన్ సినిమాలలో ఆమె చేయానున్నట్టు తెలుస్తోంది.

ఇక ఒక వైపున కన్నడ .. తెలుగు .. హిందీ సినిమాలను చక్కబెడుతూనే, మరో వైపున తమిళంలోనూ ఆమె కుదురుకోవడానికి ప్రయత్నిస్తోంది. తమిళంలో తన తొలి సినిమాగా ఆమె కార్తి సరసన నాయికగా 'సుల్తాన్' సినిమా చేసింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు.

అందువలన ఆమె కాస్త గ్యాప్ తీసుకుని, విజయ్ జోడీగా ఒక సినిమా చేయడానికి అంగీకరించింది. వంశీ పైడిపల్లి - దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా, తెలుగుతో పాటు తమిళంలోను విడుదల కానుంది. ఈ సినిమాతో తాను తమిళంలోను సెటిల్ కావడం ఖాయమని ఆమె భావిస్తోంది.

ఇక సౌత్ లో ఒక పొజీషన్ వచ్చిన హీరోయిన్లందరి డ్రీమ్ హిందీ సినిమాలు చేయడమే. దక్షిణాది కథానాయికలుగా కూడ తమ దర్జా చూపించడమే. రష్మిక ఇప్పటికీ హిందీలో రెండు సినిమాలు చేసింది. ఈ సినిమాలు రెండూ కూడా షూటింగును పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్నాయి.

'మిషన్ మజ్ను' .. 'గుడ్ బై' సినిమాలను లైన్లో పెట్టేసిన ఆమె, తాజాగా రణ్ బీర్ కపూర్ సరసన 'యానిమల్' సినిమా చేస్తోంది. ఇలియానా .. తమన్నా .. కాజల్ ఆ రూట్లో కొంతవరకే ముందుకు వెళ్లగలిగారు. రష్మిక ఎంతవరకూ వెళుతుందనేది చూడాలి మరి.