Begin typing your search above and press return to search.

ఉపాసన కొత్త సలహా విన్నారా?

By:  Tupaki Desk   |   16 Dec 2017 4:23 AM GMT
ఉపాసన కొత్త సలహా విన్నారా?
X
మెగా హీరో రామ్ చరణ్ వైఫ్ ఉపాసన డాక్టర్స్ కుటుంబంలోనే పుట్టి పెరిగింది. అపోలో హాస్పిటల్స్ గ్రూప్ లో భాగమైన అపోలో ఫౌండేషన్ కు ఆమె వైస్ ఛైర్ పర్సన్ కూడా. రామ్ చరణ్ ను పెళ్లి చేసుకున్నాక చాలాకాలంగా భర్తకు తోడునీడగా ఉంటూ అతడి పర్సనల్ వ్యవహారాలకే పరిమితమవుతూ వచ్చింది. రీసెంట్ గా ఉన్నట్టుండి కాస్త స్టయిల్ మార్చింది. వంటకు సంబంధించిన సలహాలు సూచనలతో వీడియోలు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.

ఇప్పటికే పలు రకాల డిషెస్ ఎలా చేయాలో చెప్పిన ఉపాసన ఇప్పుడు వంట చేయడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. అసలు వంట ఎలా ఏ విధంగా చేయాలనే సూచనలతో తాజాగా ఓ వీడియో షేర్ చేసింది. ‘‘వంట చేసేముందు చేతులు శుభ్రంగా ఉంచుకోవడంతోపాటు గోళ్లు పెద్దగా లేకుండా చూసుకోవాలి. వీలైనంత వరకు గోళ్లకు రంగు లేకుండా చూసుకోవాలి. కూరగాయలు కత్తిరించే సమయంలో హైజీన్ పాటించడంలో భాగంగా డిస్పోజబుల్ కవర్ తో చేసిన గ్లోవ్స్ వాడటం మంచిది. వంట చేసే సమయంలో హెయిర్ ను కవర్ చేస్తూ క్యాప్ పెట్టుకోవడం తప్పనిసరి. భోజనంలో మీ ప్రేమను వడ్డించాలి తప్ప మీ వెంట్రుకలు కాదన్న విషయం గుర్తించాలి. కిచెన్ మొత్తం గాలి వెలుతురు బాగా ఉండేలా చూసుకోవాలి. బోలెడన్ని కిటికీలు ఉండాలి. ఫ్యాన్ తిరుగుతుండాలి. మీరు ఉక్కలో మగ్గిపోకూడదు కదా. అన్నింటికన్నా ముఖ్యమేంటంటే వంట మీరు చేసినా మీ స్టాఫ్ మెంబర్ చేసినా వాళ్లు ఆనందంగా ఉండటం ముఖ్యం. ఎందుకంటే ఆనందంగా చేసే వంటలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అది తినే వారికి మరింత బలాన్నిస్తుంది’’ అని చెప్పుకొచ్చింది.

కొన్ని కొత్త అంశాలు కొన్ని పాత అంశాలు కలగలపి ఉపాసన చెప్పిన టిప్స్ అన్నీ ఆచరించతగినవే అనడంలో ఎంత మాత్రమూ సందేహం లేదు. ఇంతవరకు బాగానే ఉన్నా అందరి ఇళ్లలో విశాలమైన వంట గదులు.. వాటికి పెద్ద పెద్ద కిటికీలు ఉండవు కదా. మధ్య తరగతి మనుషులు బతికే గూళ్లలో వంట గది ఎంత చిన్నగా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఈ పాయింట్ మిస్సయిపోయావ్ ఉపాసనా అంటూ ఆమె వీడియో చూసిన కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇది కూడా ఆలోచించాల్సిన పాయింటే కదా.