Begin typing your search above and press return to search.

ఆహా 'అన్ స్టాపబుల్' ప్రోమో: బాలయ్య సై అంటే సై.. నై అంటే నై..!

By:  Tupaki Desk   |   27 Oct 2021 12:42 PM GMT
ఆహా అన్ స్టాపబుల్ ప్రోమో: బాలయ్య సై అంటే సై.. నై అంటే నై..!
X
బాక్సాఫీస్ బొనాంజా నటసింహం నందమూరి బాలకృష్ణ డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఓవైపు సినిమాలు చేస్తూ మరోవైపు బుల్లితెరపై కూడా సందడి చేయడానికి రెడీ అయిన బాలయ్య.. తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ‘ఆహా’ కోసం ''అన్ స్టాపబుల్ విత్ NBK'' అనే టాక్ షో చేస్తున్నారు. 'జోంబీ రెడ్డి' దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ షో ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే స్పెషల్ పోస్టర్స్ తో ఈ ప్రోగ్రామ్ పై ఆసక్తిని కలిగించారు. బాలకృష్ణ గెటప్ - స్నీక్ పీక్ చూసి అందరూ సర్‌ప్రైజ్ అయ్యారు.

దీపావళి సందర్భంగా నవంబర్ 4వ తేదీన ''అన్ స్టాపబుల్'' టాక్ షో మొదటి ఎపిసోడ్ ప్రీమియర్ ప్రసారం అవుతుందని నిర్వాహకులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోని బాలయ్య సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ''నీకు చిత్తశుద్ధి ఉన్నప్పుడు.. నీకు లక్ష్యసిద్ధి ఉన్నప్పుడు.. నీకు సంకల్పశుద్ధి ఉన్నప్పుడు.. నిన్ను పంచభూతాలు కూడా ఆపలేవు'' అని బాలయ్య తనదైన శైలిలో చెప్పడంతో ఈ వీడియో ప్రారంభమైంది.

పంచభూతాలను దాటుకుంటూ బాలకృష్ణ స్పోర్ట్స్ బైక్ మీద.. కార్ లో.. గుర్రం మీద స్టైల్ గా వస్తున్నట్లు ఈ ప్రోమోలో చూపించారు. ''మాటల్లో ఫిల్టర్ ఉండదు.. సరదాలో స్టాప్ ఉండదు.. సై అంటే సై.. నై అంటే నై.. వన్స్ ఐ స్టెప్ ఇన్.. దెబ్బకు థింకింగ్ మారిపోవాలా'' అంటూ బాలయ్య చెప్పే డైలాగ్ అలరిస్తోంది. హెయిర్ స్టైల్ - కాస్ట్యూమ్స్ దగ్గరి నుండి ప్రతి విషయంలోనూ ఎంతో కేర్ తీసుకొని, బాలయ్యతో బాప్ ఆఫ్ ఆల్ టాక్ షో అనేలా 'అన్ స్టాపబుల్' ను రూపొందిస్తున్నారని అర్థం అవుతోంది. మాన్షన్ హౌస్ బ్రాండ్ ఈ టాక్ షో ని సమర్పిస్తోంది.

''అన్ స్టాపబుల్ విత్ NBK'' టాక్ షో కోసం నందమూరి అభిమానులే కాదు.. యావత్ తెలుగు ప్రేక్షకులు సైతం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా పలువురు సినీ తారలు హాజరు కానున్నారు. ఫస్ట్ ఎపిసోడ్ కి కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు గెస్ట్ గా హాజరయ్యారని తెలుస్తోంది. బాలయ్య లాంటి దిగ్గజ నటుడు బుల్లితెరపై మొదటిసారి కనిపిస్తుండటంతో.. 'ఆహా' లో ప్రసారం కానున్న ఈ టాక్ షో ప్రత్యేకంగా నిలుస్తుందని అందరూ భావిస్తున్నారు.