Begin typing your search above and press return to search.

బాలయ్య 'అన్ స్టాపబుల్' ఫినాలే.. బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ లోడింగ్..!

By:  Tupaki Desk   |   22 Dec 2021 1:30 PM GMT
బాలయ్య అన్ స్టాపబుల్ ఫినాలే.. బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ లోడింగ్..!
X
నందమూరి నటసింహం బాలకృష్ణ తొలిసారిగా హోస్ట్ చేస్తున్న ''అన్ స్టాపబుల్ విత్ NBK'' టాక్ షో.. సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. తెలుగు ఓటీటీ వేదిక 'ఆహా' లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ కార్యక్రమం విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంటోంది. అయితే ఈ టాక్ షో మరికొన్ని రోజుల్లో ముగియనుంది.

దీపావళి సందర్భంగా ప్రారంభమైన 'అన్ స్టాపబుల్' షో కు సంబంధించి.. ఇప్పటి వరకు 5 ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ అయ్యాయి. బాలయ్యలోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ సాగిన ఈ టాక్ షో.. దెబ్బకు అందరి థింకింగ్ మార్చేసింది. మంచు మోహన్ బాబు - నాని - బ్రహ్మానందం - అనిల్ రావిపూడి - 'అఖండ' టీమ్ ఈ ప్రోగ్రామ్ కు గెస్టులుగా వచ్చారు. ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న ఎపిసోడ్ లో ఎస్ఎస్ రాజమౌళి - ఎంఎం కీరవాణి సందడి చేశారు.

ఇక క్రిస్మస్ సందర్భంగా వచ్చే 6వ ఎపిసోడ్ లో అల్లు అర్జున్ తో.. న్యూ ఇయర్ కు వెల్కమ్ చెప్తూ ప్రసారమయ్యే 7వ ఎపిసోడ్ లో రవితేజతో బాలకృష్ణ ముచ్చటించనున్నారు. ఇప్పటికే మాస్ మహారాజ ఎపిసోడ్ ప్రోమో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. అయితే మరో ఎపిసోడ్ తో 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' మొదటి సీజన్ ముగియనుందని నిర్వాహకులు ప్రకటించారు.

'అన్ స్టాపబుల్' ఆఖరి ఎపిసోడ్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు గెస్టుగా హాజరయ్యారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ఇది సీజన్ ఫినాలే ఎపిసోడ్ గా స్ట్రీమింగ్ కానున్నట్లు 'ఆహా' టీమ్ బుధవారం ఓ పోస్టర్ ద్వారా తెలిపింది.

''బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ త్వరలో రాబోతోంది. మహేష్ బాబుతో 'అన్ స్టాపబుల్' సీజన్ ముగియనుంది. రాసి పెట్టుకోండి.. నందమూరి బాలకృష్ణ మరియు మహేష్ బాబు లను కలిపి చూడటం కనువిందుగా ఉంటుంది'' అని నిర్వాహకులు పేర్కొన్నారు.

'ఆహా' ఓటీటీ వేదికగా బాలయ్య - మహేష్ బాబుల మధ్య జరిగిన ఆసక్తికరమైన సంభాషణ చూడటానికి సినీ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 'అన్ స్టాపబుల్' ఆఖరి ఎపిసోడ్ ఎప్పుడనేది ప్రకటించలేదు. కాకపోతే సంక్రాంతి పండుగ సందర్భంగా స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇకపోతే ఎన్టీఆర్ హోస్ట్ చేసిన 'ఎవరు మీలో కోటీశ్వరులు' క్విజ్ షో చివరి ఎపిసోడ్ కు సెలబ్రిటీ గెస్టుగా వెళ్లిన మహేష్ బాబు.. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించే 'అన్ స్టాపబుల్' టాక్ షో ఆఖరి ఎపిసోడ్ కు అతిథిగా హాజరవడం విశేషం.

కాగా, బాలకృష్ణ హోస్టింగ్ లో 'అన్ స్టాపబుల్' ఫస్ట్ సీజన్ గ్రాండ్ సక్సెస్ అవడంతో.. 'ఆహా' టీమ్ రెండో సీజన్ ను కూడా ప్లాన్ చేస్తోందని టాక్ వినిపిస్తోంది. వచ్చే సీజన్ లో మరింతమంది సెలబ్రిటీలతో బాలయ్య సందడి చేసే అవకాశం ఉంది.