Begin typing your search above and press return to search.

అర్రే.. అనవసరంగా సినిమా వాయిదా వేశారే

By:  Tupaki Desk   |   29 Aug 2021 3:55 AM GMT
అర్రే.. అనవసరంగా సినిమా వాయిదా వేశారే
X
టాలీవుడ్లో కొత్త సినిమాల రిలీజ్ డేట్ల కథ రోజుకో మలుపు తిరుగుతోంది. ఏ సినిమా ఎప్పుడొస్తుందో తెలియని అయోమయం రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఒకసారి రిలీజ్ డేట్ ఇచ్చాక కొన్ని రోజులకే మనసు మార్చుకుంటున్నారు నిర్మాతలు. అందుకు కారణాలు అనేకం. రెండు వారాల కిందట సందీప్ కిషన్ సినిమా 'గల్లీ రౌడీ'ని సెప్టెంబరు 3న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించడం తెలిసిందే. ఆ దిశగా ప్రమోషన్లు కూడా మొదలుపెట్టిన టైంలో గోపీచంద్ సినిమా 'సీటీమార్'ను తెచ్చి సెప్టెంబరు 3కే ఫిక్స్ చేశారు. అది కాస్త పెద్ద స్థాయి సినిమానే. సెప్టెంబరు 3న అవసరాల శ్రీనివాస్ మూవీ 'నూటొక్క జిల్లాల అందగాడు' కూడా రానుండటంతో ఇంత పోటీలో తమ సినిమా ఎందుకుని 'గల్లీ రౌడీ'ని వాయిదా వేసేశారు. సెప్టెంబరులోనే తర్వాత వీలు చూసుకుని సినిమాను రిలీజ్ చేయడానికి ఫిక్సయ్యారు.

'సీటీమార్'ను తమ సినిమాకు పోటీగా నిలపడం పట్ల సమర్పకుడు కోన వెంకట్ కొంచెం హర్టయినట్లు కూడా కనిపించాడు. ఆయన ట్వీట్ అలాంటి సంకేతాలే ఇచ్చింది. కానీ ఇప్పుడేమో కథ మారిపోయింది. సెప్టెంబరు 10న రావాల్సిన 'లవ్ స్టోరి' వాయిదా పడటంతో వినాయక చవితి వీకెండ్‌ను వాడుకోవడానికి 'సీటీమార్' రెడీ అయిపోయింది. 3న కాకుండా 10వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. దీంతో ఇప్పుడు 'గల్లీ రౌడీ' టీం అనవసరంగా తమ చిత్రాన్ని వాయిదా వేశామే అని ఫీలయ్యే పరిస్థితి తలెత్తింది. ఈ వారం వచ్చిన శ్రీదేవి సోడా సెంటర్, ఇచ్చట వాహనములు నిలుపరాదు, హౌస్ అరెస్ట్ చిత్రాలకు ఏమంత మంచి టాక్ రాలేదు. వచ్చే వారాంతం వరకు ఇవి నిలిచే పరిస్థితి లేదు. కాబట్టి వచ్చే వారం వచ్చే సినిమాలకు ఇది మంచి అవకాశమే. ఆ టైంలో 'గల్లీ రౌడీ' లాంటి కామెడీ మూవీ వచ్చి ఉంటే దానికి ప్లస్ అయ్యేదే. ఐతే ఇంకా ఐదారు రోజులు టైం ఉన్న నేపథ్యంలో 'గల్లీ రౌడీ' టీం ఆలోచన మార్చుకుని తిరిగి సెప్టెంబరు 3కే ఫిక్సవుతుందేమో చూడాలి.