Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: ఎలా నచ్చింది సునీల్?

By:  Tupaki Desk   |   7 Jun 2017 5:21 PM GMT
ట్రైలర్ టాక్: ఎలా నచ్చింది సునీల్?
X
ఉంగరాల రాంబాబు. చాలా రోజుల నుండి ఈ టైటిల్ తో సునీల్ ఒక సినిమా చేస్తున్నాడని తెలుసు. అయితే ఈ సినిమా తొలి సింగిల్ సాంగును మొన్ననే రిలీజ్ చేశారు. ఇప్పుడు ట్రైలర్ ను కూడా దించేశారు. టాలెంటెడ్ డైరక్టర్ గా పేరొందిన క్రాంతి మాధవ్ తీస్తున్న ఈ సినిమా చాలా రోజులు డిలే అయినా కూడా.. ట్రైలర్ తో ఎట్రాక్ట్ చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఇంతకీ సదరు ట్రైలర్ ఎలా ఉంది మరి?

నిజానికి ఈ ట్రైలర్లో అసలు మ్యాటరే లేదని చెప్పాలి. ఒక తింగరి హీరోను చూపించాలి అనుకుని.. ఇప్పటివరకు సునీల్ చేసిన చాలా కామెడీ సన్నివేశాలను కలిపేసి ఒకేసారి చూపించేశారు. అయితే ఇదేదో స్పైఫు సినిమా అన్నట్లు.. రేసుగుర్రం తండ్రి క్యారెక్టర్లో కనిపించే ప్రకాష్‌ రాజ్.. వీడు నీకు ఎలా నచ్చాడమ్మా అని అక్కడ బన్నీ సినిమాలో శృతి హాసన్ ను అడిగినట్లు.. ఇక్కడ హీరోయిన్ మియా జార్జ్ ను అడుగుతాడు. అంతకుమించి మిగిలినదంతా రొటీన్ కామెడీ.. రొటీన్ సీన్లు.. రొటీన్ సునీలే. ప్రకాష్‌ రాజ్ డైలాగ్ విన్నాక్.. అసలు ఈ సినిమా నీకు ఎలా నచ్చింది సునీల్ అని అడగాలని ఎంతమందికి అనిపించింది?

ఇకపోతే రొటీన్ గా ఉన్నా కూడా కామెడీ పాళ్లు ఎమోషన్ పాళ్ళు సరిగ్గా ఉంటే మాత్రం.. సినిమాలు ఆడేస్తాయి. చూద్దాం ఉంగరాలు రాంబాబు జనాలకు కితకితలు పెడతాడో లేకపోతే తనే గింగిరాలు తిరుగుతాడో!!