Begin typing your search above and press return to search.

సౌత్ సైకో వస్తున్నాడు

By:  Tupaki Desk   |   4 Sep 2018 7:36 AM GMT
సౌత్ సైకో వస్తున్నాడు
X
అప్పుడెప్పుడో 1960లో అల్ టైం థ్రిల్లర్స్ ని ఎవర్ గ్రీన్ హిట్స్ గా మలిచిన దర్శక దిగ్గజం ఆల్ ఫ్రెడ్ హిచ్ కాక్ రూపొందించిన చిత్రం సైకో. ఆ సినిమా వచ్చి ఇంత కాలమైనా నవతరం దర్శకులకు సైతం స్ఫూర్తిని ఇస్తూనే ఉంటుంది. అంత గొప్ప క్లాసిక్ లో ఉన్నది ఒక ఉన్మాది వరుసగా హత్యలు చేస్తూ పోవడం. పోలీసులకు దొరక్కుండా ఛాలెంజ్ చేస్తూ మరీ చంపుకుంటూ పోయే ఈ లైన్ ఆధారంగా ప్రపంచ చరిత్రలో కొన్ని వందల సినిమాలు వచ్చాయంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు ఇన్నాళ్లకు ఆ పేరుతో సౌత్ లో మరో సినిమా రాబోతోంది. విశాల్ తో డిటెక్టివ్ ద్వారా విమర్శల ప్రశంశలు దక్కించుకున్న దర్శకుడు మిస్కిన్ అదే పేరుతో తన కొత్త సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ఇది దానికి రీమేకా లేక కొత్త కథనా అనే స్పష్టత లేదు కానీ మిస్కిన్ గత చిత్రాల తరహాలో ఊహకందని మలుపులతో ఉక్కిరి బిక్కిరి చేసేలా ఉంటుందని సమాచారం

ఈ నెలలోనే షూటింగ్ మొదలుపెట్టుకోబోతున్న సైకోలో ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటిస్తున్నాడు. సమ్మోహనంతో మనకు బాగా దగ్గరైన అదితి రావు హైదరి హీరోయిన్ గా ఎంపికయ్యింది. అంతే కాదు మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. సీనియర్ కెమెరామెన్ పిసి శ్రీరామ్ దీనికి ఛాయాగ్రహణం అందించడానికి ఒప్పుకున్నారు. దర్శకుడు రామ్ టైటిల్ రోల్ పోషించే అవకాశం ఉంది. నిజానికి దీని కన్నా ముందు మిస్కిన్ సాయి పల్లవి-నిత్యా మీనన్ లతో ఓ సినిమా ప్లాన్ చేసాడు కానీ అది మొదలు కాకుండానే ఆగిపోయింది. దాని స్థానంలో సైకో వచ్చి చేరింది. టాప్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్న సైకో సినిమా తెలుగులో ఎలాగూ డబ్ చేస్తారు కానీ కోలీవుడ్ లో మాత్రం అప్పుడే దీని గురించి చర్చ మొదలైంది. సహజత్వంతో సినిమాలు తీసే మిస్కిన్ సైకో లాంటి సబ్జెక్ట్ ని ఎలా డీల్ చేస్తాడా అనే ఆసక్తి ఎక్కువగా ఉంది. ఎక్కువ రక్తపాతం చూపకుండా ఒళ్ళు గగుర్పొడిచేలా తీయడం మిస్కిన్ ప్రత్యేకత. అలాంటిది సైకో లాంటి కథ దొరికితే ఇంకేమైనా ఉందా.