Begin typing your search above and press return to search.

కార్తికేయుడితో వైల్డ్ కింగ్ పోటీ త‌ప్ప‌దా?

By:  Tupaki Desk   |   16 July 2022 12:30 AM GMT
కార్తికేయుడితో వైల్డ్ కింగ్ పోటీ త‌ప్ప‌దా?
X
క్రేజీ సినిమాలు అప్పుడ‌ప్పుడు పోటీప‌డుతుంటాయి. రిలీజ్ డేట్ ల కార‌ణంగా ఈ పోటీ అనివార్యంగా మారుతూ వుంటోంది. కొన్ని సినిమాలు పోటీ ఎందుక‌ని రిలీజ్ డేట్ ల‌ని మారుస్తూ వుంటారు. కానీ కొంత మంది మాత్రం సినిమాపై వున్న న‌మ్మ‌కంతో, పోటీ నుంచి త‌ప్పుకోడం ఇష్టం లేక‌నో.. లేక ఇప్ప‌టికే చాలా సార్లు రిలీజ్ వాయిదా వేశాం.. మ‌ళ్లీ ఎవ‌రి కోస‌మో వాయిదా వేయడం అవ‌స‌రం లేద‌ని భావించి ఎవ‌రు ఎన్ని ర‌కాల ఒత్తిడి చేసినా ముందు నుంచి అనుకున్న డేట్ కే త‌మ సినిమాని థియేట‌ర్ల‌లోకి తీసుకొస్తుంటారు.

దీంతో ఇత‌ర క్రేజీ చిత్రాల‌తో పోటీ అనివార్యంగా మారుతూ వుంటుంది. ఇప్ప‌డు అలాంటి పోటీనే నంద‌మూరి క‌ల్యాణ్ రామ్, నిఖిల్ సినిమాల మ‌ధ్య జ‌ర‌గ‌బోతోంది. వివ‌రాల్లోకి వెళితే...నందమూరి క‌ల్యాణ్ రామ్ న‌టించిన లేటెస్ట్ ఫాంట‌సీ పీరియాడిక్ మూవీ 'బింబిసార‌'. 'మ‌గ‌ధీర‌' త‌ర‌హాలో బింబిసారుడికి నేటి జ‌న‌రేష‌న్ కు సంబంధించిన ఓ యువ‌కుడికి వున్న క‌థ‌తో ఫాంట‌సీ అంశాల‌ని జోడించి అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని నిర్మించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై కె. హ‌రికృష్ణ నిర్మించిన ఈ మూవీ ఆగ‌స్టు 5న భారీ స్థాయిలో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

ఇదే రోజున నిఖిల్ హీరోగా న‌టించిన 'కార్తికేయ 2' రాబోతోంది. 2014లో విడుద‌లైన మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ 'కార్తికేయ‌'కు సీక్వెల్ గా ఈ మూవీని తెర‌కెక్కించారు. చందూ మొండేటి కూపొందించిన ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాషల్లో ఏక కాలంలో రిలీజ్ కాబోతోంది. ముందు ఈ సినిమాని జూలై 22న విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేశారు. రిలీజ్ డేట్ ని కూడా ప్ర‌క‌టించారు.

అయితే ఇదే స‌మ‌యంలో దిల్ రాజు నిర్మించిన 'థాంక్యూ' మూవీ రిలీజ్ కాబోతోంది. ముందు ఈ సినిమాని జూలై 8న రిలీజ్ చేయాల‌నుకున్నారు. కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల జూలై 22కు పోస్ట్ పోన్ చేశారు. త‌న సినిమా రిలీజ్ అవుతున్న నేప‌థ్యంలో 'కార్తికేయ 2' మూవీ రిలీజ్ ని ఆగ‌స్టుకు మార్చుకోమ‌ని దిల్ రాజు అడిగార‌ట‌.

దీంతో ఆయ‌న మాట కాద‌న‌లేక 'కార్తికేయ 2' టీమ్ రిలీజ్ ని ఆగ‌స్టు 5కు పోస్ట్ పోన్ చేసింది. దీంతో 'కార్తికేయ 2', బింబిసార‌' ఒకే రోజు బాక్సాఫీస్ వ‌ద్ద పోటీప‌డ‌బోతున్నాయి. ఈ పోటీలో ఎవ‌రిది పై చేయి కానుంద‌న్న‌ది ఇప్ప‌డు ఆస‌క్తిక‌రంగా మారింది.

'కార్తికేయ 2'పై మంచి బ‌జ్ క్రియేట్ అయింది. ద్వార‌క నేప‌థ్యంలో సినిమా అన‌గానే ప్రేక్ష‌కులు మ‌రింత‌గా ఆస‌క్తిని చూపించ‌డం మొద‌లు పెట్టారు. భారీ ఓపెనింగ్స్ కూడా గ్యారెంటీ అని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో దిల్ రాజు కార‌ణంగా క‌ల్యాణ్ రామ్ సినిమా 'బింబిసార‌'తో 'కార్తికేయ 2' పోటీకి దిగ‌డం ఇప్పుడు అనివార్యంగా మారింది.