Begin typing your search above and press return to search.

ఒకటే నేపథ్యంలో రెండు సినిమాలు.. ఒకటి హిట్టు.. మరొకటి ఫట్టు..!

By:  Tupaki Desk   |   26 April 2022 1:30 PM GMT
ఒకటే నేపథ్యంలో రెండు సినిమాలు.. ఒకటి హిట్టు.. మరొకటి ఫట్టు..!
X
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమాలకు ఎప్పుడూ ప్రేక్షకాదరణ ఉంటుంది. అందుకే ఫిలిం మేకర్స్ అలాంటి చిత్రాలను తెరకెక్కించడానికి ఆసక్తి కనబరుస్తుంటారు. క్రీడల నేపథ్యంలో.. క్రీడాకారుల జీవితాల ఆధారంగా అనేక సినిమాలు వచ్చాయి. అందులో క్రికెట్ మీద రూపొందిన చిత్రాలు కూడా ఉన్నాయి.

క్రికెట్ కు ఎమోషన్స్ - కమర్షియల్ ఎలిమెంట్స్ కలబోసి తీసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయ్యాయి. మరికొన్ని ఆ విషయంలో ఆడియన్స్ ను మెప్పించలేక పరాజయం చవిచూశాయి. అయితే ఇప్పుడు క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన రెండు సినిమాలు ఈ సమ్మర్ సీజన్ లో రిలీజ్ అయ్యాయి. అందులో ఒకటి పాజిటివ్ రెస్పాన్స్ రాబట్టగా.. మరొకటి మిశ్రమ స్పందన తెచ్చుకుంది.

బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ''జెర్సీ'' సినిమా ఎట్టకేలకు గత శుక్రవారం (ఏప్రిల్ 22) థియేటర్లోకి వచ్చింది. తెలుగులో విజయం సాధించి.. జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న 'జెర్సీ' చిత్రానికి అధికారిక హిందీ రీమేక్ ఇది. దీని టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ నిర్మించారు.

'కేజీఎఫ్ 2' 'RRR' వంటి సినిమాలు నార్త్ సర్క్యూట్స్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సమయంలో విడుదలైన 'జెర్సీ' సినిమాకు నెగెటివ్ రివ్యూలు వచ్చాయి. ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా ఎక్కువమందికి కనెక్ట్ కాలేదని ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ చూస్తే అర్థం అవుతోంది. షాహిద్ పెర్ఫార్మన్స్ కు ప్రశంసలు దక్కుతున్నప్పటకీ.. సినిమా నిరాశ పరిచిందనే కామెంట్స్ వస్తున్నాయి.

'జెర్సీ' కథ ఉత్తరాది ప్రేక్షకులను ఆకర్షించడంలో విఫలమైనప్పటికీ.. దాదాపు అలాంటి నేపథ్యంలో రూపొందించిన ''కౌన్ ప్రవీణ్ తాంబే?'' సినిమా మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. జెర్సీ స్టోరీ ఫిక్షనల్ అయితే.. ఇది క్రికెటర్ ప్రవీణ్ తాంబే జీవితం ఆధారంగా తీసిన బయోపిక్. ఏప్రిల్ 1న డిస్నీ + హాట్ స్టార్ ఓటీటీలో నేరుగా విడుదలైంది.

అంతర్జాతీయ లేదా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడకుండా 41 ఏళ్ల వయసులో IPL లో ఎంట్రీ ఇచ్చి, అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసిన మహారాష్ట్ర క్రికెటర్ ప్రవీణ్ తాంబే. క్రికెట్ ఆడటానికి వయసుతో సంబంధం లేదని నిరూపించిన ప్రవీణ్ తాంబే.. క్రికెట్ ప్రస్తానంలో ఎదుర్కొన్న సమస్యలు, ఇబ్బందులను ఈ సినిమాలో చూపించారు.

'కౌన్ ప్రవీణ్ తాంబే' సినిమాలో బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పాడే ప్రధాన పాత్రలో నటించారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ బయోపిక్.. మంచి వ్యూయర్ షిప్ సాధిస్తోంది. స్ట్రీమింగ్ కు పెట్టిన వారంలోనే ఈ సినిమాకు ఓటీటీలో దాదాపు 3.4 మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు నివేదికలు తెలిపాయి.

ఇప్పటివరకు 'కౌన్ ప్రవీణ్ తాంబే' సినిమాకు 15-20 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయని తెలుస్తోంది. దీనిని బట్టి ఈ మూవీ సూపర్ హిట్ అనే చెప్పాలి. ఇది బయోపిక్ కావడంతో చాలా మంది దానిపై ఆసక్తి చూపారు. ఓ రకంగా 'జెర్సీ' మూవీ స్టోరీని పోలిన కథే ఇది. కాకపోతే అక్కడ విషాందాంతం అయితే.. ఇక్కడ ప్రవీణ్ తాంబే జీవితం 40+ వయసులో మొదలై సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది.

ప్రస్తుతం నడుస్తోన్న IPL సీజన్ 'కౌన్ ప్రవీణ్ తాంబే' సినిమాపై మరింత మంది దృష్టి పడేలా చేసింది.. కానీ అదే సమయంలో క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన 'జెర్సీ' మూవీ మాత్రం జనాలను థియేటర్లకు రప్పించలేకపోతోంది. ఒకవేళ ప్రవీణ్ తాంబే సినిమా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కాకుండా.. బిగ్ స్క్రీన్ మీదకు వచ్చి ఉంటే ఎలాంటి రిజల్ట్ వచ్చేదో మరి.

ఇకపోతే ఐపీఎల్-2013 సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున బరిలో దిగిన ప్రవీణ్ తాంబే.. అదే ఏడాది ఛాంపియన్స్ లీగ్ లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ గా గోల్డెన్ వికెట్ అవార్డు అందుకున్నారు. 2017లో సన్‌ రైజర్స్ హైదరాబాద్ జట్టు కొనుగోలు చేసింది కానీ.. ఆ సీజన్‌ లో తాంబేకి ఒక్క అవకాశం కూడా దక్కలేదు.

2020 ఐపీఎల్‌ లో ప్రవీణ్ తాంబే ని కోల్‌కత్తా నైట్‌ రైడర్స్ కొనుగోలు చేసింది. అయితే టీ10 లీగ్‌ లో పాల్గొనడంతో ఐపీఎల్‌ లో ఆడే అవకాశాన్ని కోల్పోయాడు. ప్రవీణ్ తాంబే 50 ఏళ్ల వయసులోనూ క్రికెట్ కి ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదు. 2020 కరేబియర్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో ట్రిన్ బాగో నైట్ రైడర్స్ తరుపున ఆడాడు. ఈ క్రమంలో కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఆడిన మొదటి భారత క్రికెటర్ గా నిలిచాడు.

ఇదిలా ఉంటే ఇటీవల కోల్ కతా నైట్ రైడర్స్ తమ జట్టు సభ్యుల కోసం 'కౌన్ ప్రవీణ్ తాంబే' చిత్రాన్ని ప్రదర్శించింది. ఈ సందర్భంగా మిగతా ఆటగాళ్లు అభినందిస్తుంటే.. ప్రవీణ్ ఎమోషనల్ అయ్యారు. అన్నట్టు ఈ సినిమా తెలుగు వెర్సన్ 'ప్రవీణ్ తాంబే ఎవరు?' అనే పేరుతో డిస్నీ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది.