Begin typing your search above and press return to search.

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్.. ప్రధాన నిందితులు కనబడుటలేదు..!

By:  Tupaki Desk   |   24 Sep 2021 12:30 PM GMT
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్.. ప్రధాన నిందితులు కనబడుటలేదు..!
X
2017 లో టాలీవుడ్ లో వెలుగుచూసిన డ్రగ్స్ కేసులో.. ఈ నాలుగేళ్లలో ఎన్నో ట్విస్టులు చోటు చేసుకున్నాయి. ఎక్సైజ్ శాఖ సిట్ దర్యాప్తుతో మొదలుపెట్టి అనేక మలుపుల తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ వరకు వచ్చింది. మనీ లాండరింగ్ కోణంలో ఈడీ 12 మంది ప్రముఖులను ప్రశ్నించింది. ఈ కేసులో సినీ ప్రముఖుల ప్రమేయం ఉందా?, రాబోయే రోజుల్లో అరెస్ట్ చేసి అవకాశం ఉందా? అనే విషయాలు పక్కన పెడితే.. ఎక్సైజ్‌ శాఖకు ప్రధాన నిందితులు చుక్కలు చూపిస్తున్నారని తెలుస్తోంది.

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో తెలంగాణ ఎక్సైజ్ శాఖ అధికారులు ఎంతో మందిని ప్రశ్నించి.. 12 ఛార్జ్‌ షీట్‌ లను దాఖలు చేశారు. వీటిని కోర్టులు విచారణకు స్వీకరించినా.. నిందితులు మాత్రం డుమ్మా కొడుతూ వస్తున్నారు. 2019 నుంచి నిందితుడు సంతోష్ దీపక్ అదృశ్యం కాగా.. ఇప్పటికీ ఎక్కడున్నాడో కనిపెట్టలేకపోయారు. మరో నిందితుడు అబూబకర్ అలియాస్ సోహెల్ 2018 నుంచి కోర్టులో హాజరవలేదని తెలుస్తోంది.

అలానే మైక్ కమింగ అనే నిందితుడు విదేశాలకే పారిపోయాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడు, డ్రగ్ సప్లయిర్ కెల్విన్ కు ఇప్పటివరకు మూడుసార్లు నోటీసులిచ్చినా కోర్టుకు హాజరు కాలేదని తెలుస్తోంది. ఇలా అన్ని విధాలుగా డ్రగ్స్ కేసులో అడ్డంకులు ఎదురవుతుండటంతో ముందుకు సాగడం లేదు. డ్రగ్స్ కేసు నిందితులపై నాన్‌ బెయిలబుల్ వారెంట్లు ఉన్నా అధికారులు వారిని పట్టుకోవడంలో నిర్లక్ష్యం జరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి.

అయితే 2017 నుంచి సుదీర్ఘ విచారణ జరిపిన ఎక్సైజ్ శాఖ.. నిందితులపై ఛార్జిషీట్లు దాఖలు చేసి.. సినీ ప్రముఖులకు క్లీన్ చీట్ ఇచ్చింది. సినీ ప్రముఖులకు కెల్విన్ డ్రగ్స్ సరఫరా చేశాడనడానికి ఆధారాలు లేవని.. సెలబ్రిటీలను నిందితులుగా చేర్చేందుకు కెల్విన్ వాంగ్మూలం సరిపోదని కోర్టుకు తెలిపారు. ఈ మేరకు నాంపల్లి మరియు రంగారెడ్డి కోర్టుల్లో 12 అభియోగపత్రాలను కూడా సమర్పించారు. అయితే నిందితులు సహకరించకపోవడం వల్ల ఈ కేసు విచారణ ప్రక్రియ ఆలస్యమవుతోందని తెలుస్తోంది.