Begin typing your search above and press return to search.

విమాన సర్వీసుల్ని షురూ చేసిన చెర్రీ ట్రూజెట్

By:  Tupaki Desk   |   23 Feb 2022 5:33 AM GMT
విమాన సర్వీసుల్ని షురూ చేసిన చెర్రీ ట్రూజెట్
X
మెగా పవర్ స్టార్ రాంచరణ్ కు చెందిన ట్రూ జెట్ విమాన సంస్థ ఈ మధ్యన తన సర్వీసుల్ని నిలిపివేసినట్లుగా వార్తలు రావటం తెలిసిందే. ఇదే సందర్భంగా కొన్ని మీడియా సంస్థలు ఒక అడుగు ముందుకు వేసి.. తీవ్రమైన ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయిన ట్రూ జెట్ మూసివేత ఖాయమని తేల్చేశారు. ఇదిలా ఉండగా ఈ వ్యాపారంలో రాంచరణ్ ఎంత నష్టపోయారన్న చర్చ మొదలైంది.

సినిమాలు కాకుండా చెర్రీ చేపట్టిన మొదటి బిజినెస్ ఇలా ఫ్లాప్ షో కావటంపై పలువురు సానుభూతి వ్యక్తం చేశారు. అయితే.. అందరూ అనుకుంటున్నట్లుగా తమ ట్రూ జెట్ సర్వీసుల నిలిపివేత తాత్కాలికమేనని.. సంస్థను మూసివేసినట్లుగా వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని పేర్కొన్నారు.

ట్రూ జెట్ ను తిరిగి రన్ వే మీదకు తీసుకురావటానికి టాటా సంస్థతో చెర్రీ చర్చలు చేపట్టినట్లుగా వార్తలు వచ్చాయి. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో ఉన్న సంస్థను గట్టెక్కించటానికి ప్రయత్నాలు మొదలైనట్లుగా వార్తలు వచ్చాయి. అయితే.. ఈ వార్తలు వచ్చిన తక్కువ వ్యవధిలోనే తాజాగా ట్రూ జెట్ నుంచి సరికొత్త ప్రకటన విడుదలైంది. ట్రూ జెట్ మీద సాగుతున్న ఊహగానాలకు చెక్ పెట్టేలా ఉండటం గమనార్హం.

మంగళవారం సోషల్ మీడియాలో పోస్టు చేసిన ప్రకటనను చూస్తే.. ఈ రోజు (ఫిబ్రవరి 23) నుంచి ట్రూజెట్ తన విమానయాన సర్వీసుల్ని పునరుద్ధరిస్తున్నట్లుగా పేర్కొంది. అంతేకాదు.. సదరు సర్వీసు వివరాల్ని కూడా వెల్లడించింది. దీనికి సంబంధించిన పోస్టును సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ట్రూ జెట్ తన సర్వీసుల్ని మొదలు పెట్టినట్లుగా పేర్కొంటూ రూట్ల వివరాల్ని వెల్లడించారు.

- హైదరాబాద్ - విజయవాడ - హైదరాబాద్

- విజయవాడ - బెంగళూరు - విజయవాడ

- బెంగళూరు - బీదర్ - బెంగళూరు

- హైదరాబాద్ - రాజమండ్రి - రాజమండ్రి

- హైదరాబాద్ - నాందేడ్ - హైదరాబాద్

- ముంబయి - నాందేడ్ - ముంబయి

- ముంబయి - కొల్హాపూర్ - ముంబయి

- ముంబయి - జలగాం - ముంబయి

తాము తెలిపిన రూట్లలో ఎప్పటిలానే ట్రూ జెట్ తమ సర్వీసుల్ని నడపనున్నట్లుగా పేర్కొంది. అయితే.. ఈ మధ్యన తన సేవల అంతరాయానికి కారణమైన ఆర్థిక ఇబ్బందుల వివరాల్ని వెల్లడించలేదు. కొద్ది నెలలుగా ట్రూ జెట్ ఉద్యోగులకు జీతాలు అందట్లేదన్న మాట వినిపిస్తున్న వేళ.. వారి ఇష్యూను ఎలా సెటిల్ చేశారన్న వివరాలు బయటకు రాలేదు. ఏమైనా.. చెర్రీ చెప్పినట్లుగా ట్రూ జెట్ మూత పడలేదు.. దాని సర్వీసులు మళ్లీ షురూ కావటం చూస్తే..తాను జరిగేదే చెబుతానన్నట్లుగా రాంచరణ్ మాట మారిందని చెప్పక తప్పదు.