Begin typing your search above and press return to search.

త్రివిక్ర‌మ్ `అ` సెంటిమెంట్

By:  Tupaki Desk   |   16 April 2019 12:11 PM IST
త్రివిక్ర‌మ్ `అ` సెంటిమెంట్
X
మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కు `అ` సెంటిమెంట్ ఎక్కువే. మహేష్ తో రూపొందించిన `అత‌డు`తో త్రివిక్ర‌మ్ `అ` సెంటిమెంట్ మొద‌లైంది. అక్క‌డి నుంచి అత్తారింటికి దారేది, అఆ, అజ్ఞాత‌వాసి, అర‌వింత స‌మేత వీర రాఘ‌వ వ‌ర‌కు ఆగ‌లేదు. త‌న `అ` సెంటిమెంట్‌ను త్రివిక్ర‌మ్ తాజా చిత్రానికి కూడా ఆపాదిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ తో త్రివిక్ర‌మ్ ఓ చిత్రాన్ని ప్లాన్ చేసిన విష‌యం తెలిసిందే. గీతాఆర్ట్స్‌తో క‌లిసి హారిని అండ్ హాసిక క్రియేష‌న్స్ సంస్థ నిర్మిస్తోంది. అల్లు అర‌వింద్‌, ఎస్‌. రాధాకృష్ణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

`అర‌వింద‌ స‌మేత‌` త‌రువాత పూజా హెగ్డే ని మ‌ళ్లీ క‌థానాయిక‌గా ఈ సినిమా కోసం తీసుకున్నారు. ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించిన సంగ‌తి విదిత‌మే. రెగ్యుల‌ర్ షూటింగ్ త్వ‌ర‌లోనే మొద‌లుకాబోతోంది. ఇదిలా వుండ‌గా ఈ సినిమా టైటిల్ ఇదీ అంటూ పుకార్లు షికారు చేయ‌డం మొద‌లైంది. అల్లు అర్జున్‌, త్రివిక్ర‌మ్‌ల క‌ల‌యిక‌లో వ‌స్తున్న మూడ‌వ సినిమా, పైగా తొలిసారి హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ సంస్థ గీతా ఆర్ట్స్‌తో క‌లిసి నిర్మిస్తున్న సినిమా కావ‌డంతో ఈ చిత్రంపై భారీ గానే అంచ‌నాలు నెల‌కొన్నాయి. వాటికి త‌గ్గ‌ట్టుగానే ఈ సినిమాకు సెంటిమెంటు అంతే బ‌లంగా ప‌ని చేస్తోంద‌ట‌. అందుకే రిస్క్ చేయ‌కుండా `అ` సెంటిమెంటుతో `అల‌క‌నంద‌` అనే టైటిల్‌ ని చిత్ర బృందం ఖ‌రారు చేసిన‌ట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా క్లారిటీ ఇవ్వ‌లేదు.

`బ‌ద్రీనాథ్‌` సినిమాలో హీరోయిన్ పాత్ర పేరు అల‌క‌నంద‌. ఆ సినిమా అల్లు అర్జున్‌కు ఆశించిన విజ‌యాన్ని అందించ‌లేదు. ఆ సెంటిమెంట్ ప్ర‌కారం `అల‌క‌నంద‌` టైటిల్ అల్లు అర్జున్‌కు క‌లిసొస్తుందా? అంటూ చ‌ర్చ సాగుతోంది. మ‌రి ఆ సెంటిమెంట్‌ను త్రివిక్ర‌మ్ బ్రేక్ చేస్తాడో లేదో వేచి చూడాలి. వేణు శ్రీ‌రామ్ తో బ‌న్ని సినిమాకి `ఐక‌న్` లాంటి చ‌క్క‌ని టైటిల్ కుదిరింది. అందువ‌ల్ల త్రివిక్ర‌మ్.. సుకుమార్ టైటిల్ విష‌యంలో ఇంకాస్త జాగ్ర‌త్త ప‌డాల్సిందే!