Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ సినిమాకి సంజూ భాయ్ ఓకే చెప్తాడా...?

By:  Tupaki Desk   |   12 May 2020 2:20 PM IST
ఎన్టీఆర్ సినిమాకి సంజూ భాయ్ ఓకే చెప్తాడా...?
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరెకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడింది. 'అరవిందసమేత వీరరాఘవ' వంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత వీరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్స్‌ పై రాధాక‌ష్ణ‌ (చినబాబు) - నంద‌మూరి క‌ల్యాణ్‌ రామ్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు స్క్రిప్ట్ ను రెడీ చేసే పనిలో ఉన్నాడట త్రివిక్రమ్. ఎన్టీఆర్ కెరీర్లో 30వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుండి ఈ సినిమాపై ఏదొక రూమర్ వస్తూనే ఉంది. ఈ సినిమాలో ఆ బాలీవుడ్ స్టార్ హీరో విలన్ గా నటించబోతున్నాడంటూ.. ఈ స్టార్ హీరోయిన్ నటించబోతోంది అంటూ రకరకాల న్యూస్ వస్తూనే ఉంది.

ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో విలన్ రోల్ కి సంబంధించి మరో వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ ని ప్రతినాయకుడిగా తీసుకోవాలని అనుకుంటున్నారట. ఈ సినిమాలో సంజూ భాయ్ ది పక్కా రాజకీయ నాయకుడి పాత్ర అని.. అంతేకాకుండా ఎన్టీఆర్ పాత్ర కూడా రాజకీయాలతో ముడిపడి ఉంటుందని తెలుస్తోంది. కాగా సంజయ్ దత్ ఇంతముందు నాగార్జున హీరోగా నటించిన 'చంద్రలేఖ' సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించాడు. ప్రస్తుతం యశ్ హీరోగా నటిస్తున్న 'కేజీఎఫ్ చాప్టర్ 2' లో 'అధీరా' పాత్రలో కనిపించనున్నాడు. ఒకవేళ ఎన్టీఆర్ సినిమాలో సంజయ్ దత్ నటించేది నిజమే అయితే ఈ సినిమాకి చాలా ప్లస్ అయ్యే అవకాశాలున్నాయి.

'కేజీఎఫ్ 2' సినిమాతో సంజూ భాయ్ సౌత్ లో కూడా ఫేమస్ అవుతాడు. దీంతో ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కి అదనంగా క్రేజ్ ఏర్పడుతుంది.. బాలీవుడ్ మార్కెట్ పరంగా చాలా యూస్ అవుతుంది. అయితే దీనికి సంబంధించి చిత్ర యూనిట్ ఆఫీసియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని సినీ వర్గాలు అంటున్నారు. ఈ చిత్రానికి 'అయినను పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. కరోనా లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత అన్నీ కుదిరితే నవంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టి వచ్చే ఏడాది 2021 దసరాకి విడుదల చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారట.