Begin typing your search above and press return to search.

త్రివిక్రముడికి నచ్చిన చిన్న సినిమాలు

By:  Tupaki Desk   |   10 Oct 2018 3:32 PM IST
త్రివిక్రముడికి నచ్చిన చిన్న సినిమాలు
X
స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మీడియాకు దొరకడం చాలా చాలా కష్టం. తన సినిమాకు సంబంధించిన వేడుకల్లో తప్పితే త్రివిక్రమ్ బయట కనిపించడు. తన సినిమాల ప్రమోషన్లలో కూడా ఆయన పాల్గొనడం అరుదు. మీడియాకు ఇంటర్వ్యూలివ్వడమూ చాలా తక్కువ. ఐతే ‘అరవింద సమేత’ విషయంలో మాత్రం త్రివిక్రమ్ కొంచెం పట్టు సడలించాడు. మీడియాను కలిశాడు. ఇంటర్వ్యూలిచ్చాడు. అనేక విషయాలపై తన అభిప్రాయాలు చెప్పాడు. తన సినిమా సంగతలూ పంచుకున్నాడు. వేరే సినిమాల గురించీ మాట్లాడాడు. ఈ మధ్య కాలంలో తనకు నచ్చిన వేరే సినిమాల గురించి కూడా త్రివిక్రమ్ వెల్లడించడం విశేషం. ఆయన చెప్పిన లిస్టు ఆసక్తికరంగానే ఉంది.

సుకుమార్ తీసిన ‘రంగస్థలం’తో పాటు గత ఏడాది సెన్సేషనల్ హిట్టయిన ‘అర్జున్ రెడ్డి’.. కొత్త వాళ్లు చేసిన ప్రయోగాత్మక చిత్రం ‘కేరాఫ్ కంచరపాలెం’.. ఈ ఏడాది ఊహించని విజయం సాధించిన ‘ఆర్ఎక్స్ 100’.. అడివి శేష్ నుంచి వచ్చిన ‘గూఢచారి’.. ఇలాంటి సినిమాలు చాలానే తనకు నచ్చినట్లు త్రివిక్రమ్ చెప్పాడు. ఇందులో ‘రంగస్థలం’ మినహాయిస్తే అన్నీ చిన్న సినిమాలే. త్రివిక్రమ్ స్థాయి దర్శకుడు ఈ సినిమాలన్నీ చూసి వాటి గురించి మంచి మాటలు చెప్పడం అంటే ఆ చిత్రాల బృందాలకు మంచి ఉత్సాహాన్నిచ్చేదే. ఇందులో ‘ఆర్ఎక్స్ 100’ ఎంత పెద్ద హిట్టయినప్పటికీ.. ఈ సినిమా నడత విషయంలో విమర్శలొచ్చాయి. ఐతే ఇంతకుముందు అక్కినేని నాగార్జున.. ఇప్పుడు త్రివిక్రమ్ దాని గురించి పాజిటివ్ గా మాట్లాడ్డం విశేషమే. తాను ప్రతి సినిమానూ థియేటర్లోనే చూస్తానని.. గొప్ప సినిమా చూసినపుడల్లా.. అసూయ.. మనపై మనకు కోపం వస్తుందని త్రివిక్రమ్ చెప్పడం గమనార్హం.