Begin typing your search above and press return to search.

'#SSMB28' లో పవర్‌ ఫుల్‌ పాత్ర కోసం త్రివిక్రమ్ స్నేహితుడు..?

By:  Tupaki Desk   |   14 May 2021 5:30 PM GMT
#SSMB28 లో పవర్‌ ఫుల్‌ పాత్ర కోసం త్రివిక్రమ్ స్నేహితుడు..?
X
సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర రాధాకృష్ణ‌(చిన‌బాబు) ఈ భారీ చిత్రాన్ని నిర్మించనున్నారు. కృష్ణ పుట్టిన‌రోజైన మే 31న ఈ సినిమాని పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించనున్నారు. అలాగే ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ ని 2022 స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌ గా విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే తాజాగా '#SSMB28' లో హీరో కమ్ కమెడియన్ సునీల్ కీలక పాత్రలో నటించబోతున్నట్లుగా వార్తలు మొదలయ్యాయి.

సునీల్‌ - త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఇద్దరూ స్నేహితులనే విషయం అందరికి తెలిసిందే. ఇద్దరూ ఒకే రూమ్ లో ఉంటూ సినిమా ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో త్రివిక్రమ్ డైరెక్ట్ చేసే సినిమాలలో సునీల్ కు ఓ రోల్ ఇస్తూ వచ్చాడు. మహేష్ - త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన 'అతడు' 'ఖలేజా' సినిమాలలో కూడా సునీల్ నటించాడు. అయితే సునీల్ కామెడీ వేషాలు మానేసి హీరోగా నటించడం స్టార్ట్ చేసిన తర్వాత త్రివిక్రమ్ సినిమాల్లో ఆయన కనిపించలేదు. అయితే ఇప్పుడు సునీల్ హీరోగా మాత్రమే చేయాలి అనుకోకుండా విభిన్నమైన రోల్స్ చేయడానికి ముందుకొచ్చారు.

ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘అరవింద సమేత’ సినిమాలో సునీల్ కు ఛాన్స్ ఇచ్చాడు. ఇదే క్రమంలో ‘అల వైకుంఠపురములో’ సినిమాలో కూడా సునీల్ కు ఏమాత్రం ప్రాధాన్యత లేని ఓ పాత్ర ఇచ్చాడు. ఆ సినిమాలో సునీల్ ఉన్నట్టు కూడా చాలామందికి తెలియలేదు. ఈ క్రమంలో ఇప్పుడు మహేష్ సినిమాలో అవకాశం ఇస్తున్నట్లు టాక్ నడుస్తోంది. గత చిత్రాల మాదిరిగా కాకుండా ఇందులో సునీల్‌ క్యారక్టర్ చాలా పవర్‌ ఫుల్‌ గా ఉండేలా త్రివిక్రమ్ డిజైన్‌ చేస్తున్నారట. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.