Begin typing your search above and press return to search.

చాలా రోజుల తరువాత చీరకట్టుకున్న హీరోయిన్ ను చుశాను: త్రివిక్రమ్

By:  Tupaki Desk   |   28 Oct 2021 4:08 AM GMT
చాలా రోజుల తరువాత చీరకట్టుకున్న హీరోయిన్ ను చుశాను: త్రివిక్రమ్
X
నాగశౌర్య హీరోగా 'వరుడు కావలెను' సినిమా రూపొందింది. రీతూ వర్మ కథానాయికగా నటించిన ఈ సినిమా, ఈ నెల 29వ తేదీన థియేటర్లకు రానుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్ లో నిర్మితమైన ఈ సినిమాకి లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించారు. ఈ నేపథ్యంలో నిన్నరాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుంది. ఈ నిర్మాతలతో ఉన్న అనుబంధం కారణంగా త్రివిక్రమ్ ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ వేదికపై ఆయన తనదైన శైలిలో మాట్లాడారు.

'పుష్ప' నుంచి మరో సాంగ్ వస్తోంది .. నేను విన్నాను .. చాలా బాగుంది. బన్నీగారికి అడ్వాన్స్ గా కంగ్రాట్స్ చెబుతున్నాను. బన్నీ 'జులాయి' సినిమాతోనే 'హారిక అండ్ హాసిని క్రియేషన్స్' మొదలైంది. ఆయన హోమ్ బ్యానర్ వంటిది. అందువలన ఈ రోజున 'వరుడు కావలెను' టీమ్ కి విషెస్ చెప్పడానికి వచ్చారు .. థ్యాంక్యూ. నేను బయటవాడిలా మాట్లాడలేను .. ఇది నా హోమ్ బ్యానర్ వంటిది కనుక, వాళ్లందరి తరఫున కూడా నేను బన్నీగారికి థ్యాంక్స్ చెబుతున్నాను.

ఈ సినిమా నేను చూశాను .. సినిమా చూడగానే కంగ్రాట్స్ చెప్పాలనిపించిన వ్యక్తులలో ఫస్టు ఉన్నది వంశీ పచ్చి పులుసు .. కెమెరామెన్. ఆ తరువాత నాగశౌర్య .. రీతూ .. డైలాగ్ రైటర్ గణేశ్ .. నదియా గారు .. మురళీశర్మ గారు .. వీళ్లందరూ కూడా సినిమా థియేటర్లో నుంచి మీరు బయటికి వచ్చిన తరువాత మీతో పాటు మీ ఇంటికి వస్తారు. చాలా రోజుల పాటు మీకు గుర్తుండే పాత్రలివి. మన ఇళ్లలో మనకి తెలిసిన ఆడపిల్ల తాలూకు కథ ఇది. ఇలాంటి కథలు ఎప్పుడూ కూడా మన గుండెలకి దగ్గరగా అనిపిస్తాయి.

లక్ష్మీ సౌజన్యగారు కథను ఎంచుకోవడంలోనే సగం సక్సెస్ ను సాధించారు. నటీనటుల ఎంపిక .. ప్రొడక్షన్ అన్నీ బాగా కుదిరిపోయాయి కనుక మిగతా సగం సక్సెస్ కూడా వచ్చేసినట్టే. ఈ సినిమాలో 'దిగు దిగు దిగు నాగ' పాట అందరికీ నచ్చింది .. నాకు తెలుసు. కానీ ఫ్లాష్ బ్యాక్ లో ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ ను విశాల్ చాలా బాగా చేశాడు. ఇంటర్వెల్ దగ్గర .. క్లైమాక్స్ దగ్గర నాగశౌర్య చాలా బాగా చేశాడు. రీతూ విషయానికి వస్తే ఆ అమ్మాయి చేసిన టైటిల్స్ అన్నీ 'పెళ్లి చూపులు' .. 'కనులు కనులను దోచాయంటే' .. 'వరుడు కావలెను' నెక్స్ట్ 'కల్యాణ మంటపం' .. 'షామియానా సప్లయర్స్' .. 'కేటరింగ్' .. సినిమావాళ్లకి సెంటిమెంట్స్ ఎక్కువ గనుక అవన్నీ కచ్చితంగా కంటిన్యూ చేస్తారు.

చాలా రోజుల తరువాత సినిమా అంతా చీరకట్టుకున్న హీరోయిన్ ను చూశాను. నా సినిమాల్లో హీరోయిన్లకు చీర కట్టించమని చినబాబుగారు నన్ను హింసిస్తూ ఉంటారు. ఈ రకంగా ఆయన కోరిక తీరిందని అనుకుంటున్నాను. కరోనా కారణంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడంలో ఆలస్యమైంది. ఒక బిడ్డను తొమ్మిది నెలలు మోయవచ్చుగానీ .. రెండు సంవత్సరాలు మోయడమనేది అంత తేలికైన విషయం కాదు. అందుకు ఈ టీమ్ కి నేను శుభాకాంక్షలు చెబుతున్నాను" అన్నారు.