Begin typing your search above and press return to search.

సినిమా రివ్యూ: త్రిపుర

By:  Tupaki Desk   |   6 Nov 2015 10:38 AM GMT
సినిమా రివ్యూ: త్రిపుర
X
చిత్రం - ‘త్రిపుర’

నటీనటులు- స్వాతి - నవీన్ చంద్ర - రావు రమేష్ - మురళి - పూజ రామచంద్రన్ - సప్తగిరి - షకలక శంకర్ - ధన్ రాజ్ తదితరులు
సంగీతం- కామ్రాన్
ఛాయాగ్రహణం- రవికుమార్ సానా
స్క్రీన్ ప్లే- కోన వెంకట్ - వెలిగొండ శ్రీనివాస్
నిర్మాతలు- చినబాబు - రాజశేఖర్
కథ - దర్శకత్వం- రాజ్ కిరణ్

‘గీతాంజలి’ లాంటి సక్సెస్ ఫుల్ హార్రర్ కామెడీతో అరంగేట్రం చేసిన దర్శకుడు రాజ్ కిరణ్. ఇప్పుడు కాస్త రూటు మార్చి.. ‘త్రిపుర’ అనే హార్రర్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కోన వెంకట్ స్క్రీన్ ప్లే సహకారం అందించడం.. స్వాతి లాంటి టాలెంటెడ్ యాక్ట్రెస్ ప్రధాన పాత్ర పోషించడం.. ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉండటంతో సినిమా మీద మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మరి ‘త్రిపుర’ ఆ అంచనాల్ని అందుకుందో లేదో చూద్దాం పదండి.

కథ:

త్రిపుర (స్వాతి) ఓ పల్లెటూరి అమ్మాయి. ఎదుటి వాళ్ల గురించి ఆమె కనే కలలు నిజమైపోతుంటాయి. ఇలా ఆమె కలలో చనిపోతారని ఊహించిన ఇద్దరు నిజంగానే చనిపోతారు. ఇంతలో ఆమె కలలకు సంబంధించి ట్రీట్ మెంట్ ఇచ్చే డాక్టర్ నవీన్ (నవీన్ చంద్ర)తోనే తన పెళ్లవుతుంది. ఐతే తన భర్తకే తన వల్ల ముప్పు ఉందని త్రిపుర కల కంటుంది. మరోవైపు త్రిపుర - నవీన్ కొత్తగా మారిన ఇంట్లో కూడా ఓ సమస్య ఉంటుంది. ఆ ఇబ్బంది ఏంటి? భర్త గురించి త్రిపుర కన్న కల నిజమైందా? అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

కొత్తదనం పేరుతో మరీ నేలవిడిచి సాము చేయనక్కర్లేదు. మామూలు ఫార్ములా కథల్నే కొంచెం కొత్తగా ప్రెజెంట్ చేసి.. కాస్త ఎంటర్ టైన్ మెంట్ జోడిస్తే బాక్సాఫీస్ బండిని సులువుగా లాగేయొచ్చని ‘గీతాంజలి’ సినిమాతో రుజువు చేశాడు రాజ్ కిరణ్. కానీ ఈసారి ఏదో కొత్తగా ‘అమ్మాయి-కలలు’ అనే కొత్త కాన్సెప్ట్ ఏదో ట్రై చేయబోయి.. దాన్ని ఎటూ కాకుండా మధ్యలో వదిలేసి.. మళ్లీ తన ‘గీతాంజలి’ సినిమానే చూపించి.. నిరాశ పరిచాడతను.

ప్రేమకథా చిత్రం అయినా, గీతాంజలి అయినా.. మూల కథ ఒక్కటే. తనకు అన్యాయం చేసిన వాళ్లను ఓ అమ్మాయి దయ్యంగా మారి ప్రతీకారం తీర్చుకోవడమే వీటిలో పాయింట్. త్రిపుర కూడా ఆ టైపు కథే. కాకపోతే దానికి ఓ భిన్నమైన నేపథ్యాన్ని జోడించడానికి ప్రయత్నించాడు రాజ్ కిరణ్. కానీ అది అతక లేదు.

‘త్రిపుర’ ట్రైలర్ చూస్తే.. కలలు, దాని వెనుక సైన్స్ అంటూ ఏదో ఆసక్తికర పాయింట్ చుట్టూ కథను నడిపారని అర్థమవుతుంది. ఐతే ఆ కాన్సెప్ట్ అంతా నీలకంఠ ‘మాయ’ సినిమా స్ఫూర్తితో రాసుకున్నదే. దాన్ని అంత ఆసక్తికరంగా కూడా ప్రెజెంట్ చేయలేకపోయాడు రాజ్ కిరణ్. మొదట్లో ఈ కలల కాన్సెప్టుపైనే కథనాన్ని నడిపి.. ఓ దశ దాటాక దాన్ని పక్కనబెట్టేసి.. రొటీన్ హార్రర్ కామెడీల బాటలోనే నడిపించాడు.

త్రిపుర పరిచయ సన్నివేశాలన్నీ పల్లెటూల్లో నడిపించి.. ఆ తర్వాత సీన్ సిటీకి మార్చి.. అక్కడక్కా కొన్ని ఆసక్తికర సన్నివేశాలతో, మలుపులతో ప్రథమార్ధం వరకు ఓ మోస్తరుగానే బండి నడుస్తుంది కానీ.. ద్వితీయార్ధాన్ని మాత్రం పూర్తిగా తేల్చేశాడు. దీనికి ప్రధాన కారణం.. కథనం రొటీన్ బాటలో సాగడమే. దయ్యం ఓ కామెడీ గ్యాంగుని రఫ్ఫాడేయడం అనే అరిగిపోయిన కామెడీని మళ్లీ ఇందులోనూ చూపించారు. చివర్లో ప్రేక్షకుల్ని థ్రిల్ చేయడంలోనూ డైరెక్టర్ సక్సెస్ కాలేకపోయాడు. విలన్ ఎవరన్నది కాస్త ముందే అర్థమైపోతుంది. ఈ మాత్రం దానికా ఇంత సాగదీశారు అన్న ఫీలింగ్ కలుగుతుంది.

హార్రర్ థ్రిల్లర్ అని ట్యాగ్ వేశారు కానీ.. సినిమాలో హార్రర్ ఫ్యాక్టర్ పెద్దగా వర్కవుట్ కాలేదు. థ్రిల్ కూడా అంతంత మాత్రమే. నిడివి రెండున్నర గంటలుండటం సినిమాకు పెద్ద మైనస్. లెంగ్త్ ఓ 20 నిమిషాలు తగ్గించి ఉంటే.. ‘త్రిపుర’ కొంచెం బెటర్ ఫీలింగ్ ఇచ్చేదేమో.

నటీనటులు:

స్వాతి టాలెంటుకి తగ్గ పాత్ర ఇదని చెప్పలేం కానీ.. అవకాశం ఉన్నంత వరకు తన పెర్ఫామెన్స్ తో స్వాతి ఆకట్టుకుంది. ఆమె మునుపటి ఛార్మ్ కోల్పోయినప్పటికీ.. అమాయక పల్లెటూరి అమ్మాయిగా పాత్రకు తగ్గట్లుగా కనిపించింది. ఇంటర్వెల్ కు ముందు భర్తకు తన వల్లే ఆపద ఉందని తెలిసినపుడు.. క్లైమాక్స్ సీన్ లో స్వాతి తన యాక్టింగ్ టాలెంట్ చూపించింది. నవీన్ చంద్ర పాత్రకు తగ్గట్లు నటించాడు. విలన్ పాత్ర పోషించిన మురళి పర్వాలేదు. ఐతే రావు రమేషే నిరాశ పరిచాడు. అందులో ఆయన తప్పేం లేదు. కథలో కీలక పాత్ర అనుకుంటాం కానీ.. ఆయనకు ఇందులో అంత ప్రాధాన్యం ఏమీ లేదు. సస్తగరి - షకలక శంకర్ - జయప్రకాష్ రెడ్డి ఓ మోస్తరుగా నవ్వించారు.

సాంకేతిక వర్గం:

కొత్త సంగీత దర్శకుడు కామ్రాన్ పర్వాలేదనిపించాడు. రెండు పాటలు బావున్నాయి. ఐతే సినిమాలో పాటలకు అంతగా ప్రాధాన్యం లేదు. నేపథ్య సంగీతం కన్సిస్టెన్సీ లేదు. హార్రర్ తో ముడిపడిన సీన్స్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది కానీ మిగతా సన్నివేశాల్లో చాలా మొక్కుబడిగా ఉంది ఆర్.ఆర్. రవికుమార్ సానా ఛాయాగ్రహణం బాగుంది. హార్రర్ అనగానే అవసరం లేని, అర్థం లేని షేకింగులతో ఇబ్బంది పెట్టకుండా అవసరానికి తగ్గట్లే కెమెరాను ఉపయోగించాడు. వెలిగొండ శ్రీనివాస్ తో కలిసి స్క్రీన్ ప్లే అందించిన కోన వెంకట్ తన మ్యాజిక్ చూపించలేకపోయాడు. డైలాగ్స్ మామూలుగా అనిపిస్తాయి. గుర్తుంచుకోదగ్గవేమీ లేదు. రాజ్ కిరణ్ దర్శకుడిగా తొలి సినిమా తరహాలో తన ముద్ర చూపించలేకపోయాడు. కొత్త పాయింట్ అనుకున్నపుడు దానిమీదే కథను నడపాల్సింది. మళ్లీ తన పాయింటు మీద తనకే కాన్ఫిడెన్స్ లేక రొటీన్ బాటలోకి వెళ్లిపోయినట్లుగా అనిపిస్తుంది.

చివరగా: హార్రర్ లేదు.. థ్రిల్లూ లేదు.

రేటింగ్- 2/5

#Tripura, #TripuraMovie, #Tripuramoviereview, #Swathitripura, #TripuraRating, #TripuraTalk,



Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre