Begin typing your search above and press return to search.

ఓవ‌ర్సీస్ మార్కెట్ దుమ్ము రేగ్గొడుతోంది!

By:  Tupaki Desk   |   20 Sep 2015 1:30 PM GMT
ఓవ‌ర్సీస్ మార్కెట్ దుమ్ము రేగ్గొడుతోంది!
X
ఇన్నాళ్లూ తీసిన సినిమాల‌కి మార్కెట్ ఎలా చేసుకోవాలో అర్థం కాక త‌ల‌లు ప‌ట్టుకొనేవాళ్లు నిర్మాత‌లు. స్టార్ హీరోల సినిమాలు మిన‌హా మిగ‌తా చిన్న చిత‌కా చిత్రాల‌న్నీ స‌రైన రీతిలో మార్కెట్ కాక ఇబ్బందులు ఎదుర్కొనేవి. కానీ ఇప్పుడు ప‌రిస్థితి మారింది. కాస్త కంటెంట్ ఉంద‌ని తెలిస్తే చాలు... బ‌య్య‌ర్ లు షూటింగ్ దశ‌లోనే వాలిపోతున్నారు. ఇటీవ‌ల‌కాలంలో తెలుగు సినిమాలు మంచి ఆద‌ర‌ణ చూర‌గొంటుండ‌టం, స‌క్సెస్ రేటు పెర‌గ‌డమే అందుకు కార‌ణాలు చెప్పొచ్చు. ఆంధ్రా - నైజాం - సీడెడ్ మాటేమో కానీ... ఓవర్సీస్ మార్కెట్ మాత్రం దుమ్ము రేగ్గొడుతోంది.

మామూలుగా అయితే లోక‌ల్‌ గా మార్కెట్ అంతా పూర్త‌య్యాక ఓవ‌ర్సీస్ నుంచి ఎవ‌రైనా వ‌స్తారా అని ఎదురు చూసేవాళ్లు నిర్మాత‌లు. అక్క‌డున్న డిస్ట్రిబ్యూట‌ర్ ల‌ను కాంటాక్ట్ చేసి మా సినిమా బాగుంది కొనండి అని బ‌తిమాలే ప‌రిస్థితి క‌నిపించేది. కానీ ఇప్పుడు మాత్రం అన్ని ఏరియాల కంటే ముందుగానే ఓవ‌ర్సీస్ మార్కెట్ పూర్త‌వుతోంది. `బాహుబ‌లి` - `శ్రీమంతుడు`- `భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌`లాంటి సినిమాలు అక్క‌డ బ‌య్య‌ర్ ల‌కు భారీ లాభాలు తెచ్చిపెట్ట‌డ‌మే అందుకు కార‌ణం.

మార్కెట్ ప‌రిస్థితి ఆశాజ‌న‌కంగా ఉండ‌టంతో ఓవ‌ర్సీస్ డిస్ట్రిబ్యూట‌ర్ లు నేరుగా ఇండ‌స్ట్రీలోకి దిగిపోయి బేర‌సారాలు మొద‌లెట్టేస్తున్నారు. రానున్న పెద్ద సినిమాల‌తో పాటు చిన్న సినిమాలు కూడా దాదాపుగా ఓవ‌ర్సీస్ బిజినెస్ పూర్తి చేసుకొని సేఫ్ జోన్‌ లోకి వ‌చ్చేశాయ‌ని తెలుస్తోంది. ఓవ‌ర్సీస్ రైట్స్ కొనుక్కొని వెళుతున్న బ‌య్య‌ర్ల‌కు కూడా ఆయా దేశాల్లో మంచి ప్రాఫిట్సే వ‌స్తున్నాయ‌ట‌. శంక‌రాభ‌ర‌ణం - త్రిపుర‌ - సాహ‌సం శ్వాస‌గా సాగిపో... త‌దిత‌ర చిత్రాల‌న్నీ ఓవ‌ర్సీస్‌ లో మంచి బిజినెస్ చేసుకోవ‌డంతో పాటు, అక్క‌డ విడుద‌ల చేస్తున్న డిస్ట్రిబ్యూట‌ర్ ల‌కు కూడా ఇప్ప‌టికే లాభాలు తెచ్చిపెట్టాయ‌ట‌. ఆ మూడు చిత్రాల వెన‌క కోన వెంక‌ట్ ఉన్నారు. కోన‌ కీ - ఓవ‌ర్సీస్‌ లో డిస్ట్రిబ్యూట‌ర్ ల‌కీ మంచి స్నేహం ఉంది. అందుకే ఆయన బిజినెస్‌ ని అవ‌లీల‌గా పూర్తి చేశాడ‌ట‌. ముందుగానే ఒప్పందాలు కుదిరిపోవ‌డంతో ఓవ‌ర్సీస్ డిస్ట్రిబ్యూట‌ర్లు స్వేచ్ఛ‌గా విదేశాల్లో వ్యాపారం చేసుకొన్నార‌ట‌. ఇలా సినిమా విడుద‌ల‌కు ముందే ఇలా నిర్మాత‌ల‌కీ - బ‌య్య‌ర్ల‌కీ లాభాలు రావ‌డ‌మంటే గ్రేటే క‌దా మ‌రి!