Begin typing your search above and press return to search.

కోలీవుడ్లో బిజీ బిజీగా కోలకళ్ల భామ

By:  Tupaki Desk   |   13 Dec 2020 3:43 AM GMT
కోలీవుడ్లో బిజీ బిజీగా కోలకళ్ల భామ
X
తెలుగు తెరపై అందాల అక్షయ పాత్రలా కనిపించే కథానాయికలలో 'రెజీనా' ఒకరు. వెండి వెన్నెల్లో జాబిలమ్మగా కనిపించే ఈ సుందరి, కుర్రాళ్ల గుండె గనుల్లోకి జారిపోయింది. మనసు సరస్సుల్లోకి చేరిపోయింది. కైపెక్కించే ఆమె కళ్లు మల్లెలవానాను కురిపిస్తాయి .. సమ్మోహితులను చేసే ఆమె మందహాసాలు నిరాశా నిస్పృహలను చెరిపేస్తాయి .. ఊహల పల్లకిలో ఉత్సాహంగా ఊరేగిస్తాయి. అందువల్లనే రెజీనా కుర్రాళ్ల కలల రాణిగా మారిపోయింది. హాట్ హాట్ పాత్రలలో సైతం అలరిస్తూ, తన ప్రత్యేకతను చాటుతోంది.

సాధారణంగా కథానాయికలు వెండితెరపై రాజ్యం చేసే కాలం చాలా తక్కువగా ఉంటుంది. అందువల్లనే ఈ లోగానే వివిధ భాషల్లో దూసుకుపోతూ వీలైనన్ని విజయాలను అందుకోవాలని ఆశిస్తుంటారు. రెజీనా కూడా అదే బాటలో .. అదే ఉద్దేశంతో అడుగులు వేసింది. తమిళ .. కన్నడ భాషా చిత్రాలతో తన కెరియర్ ను ప్రారంభించిన ఆమె, ఆ తరువాత తెలుగు ఇండస్ట్రీపై దృష్టిపెట్టింది. అందానికి అద్దం పట్టేలా .. అర్థం చెప్పేలా ఉన్న అమ్మాయిలకు తెలుగు తెర ఎప్పుడూ ఆహ్వానం పలుకుతూనే ఉంటుంది. అలాగే రెజీనాకు కూడా స్వాగతం లభించింది.

'శివ మనసులో శృతి' సినిమాతో రెజీనా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమానే కాదు. ఆ తరువాత చేసిన రెండు మూడు సినిమాలు కూడా అంతగా ఆడలేదు. కానీ రెజీనాకు గ్లామర్ పరంగా మంచి మార్కులు పడిపోయాయి. చెరుకు రసంతో చేసినట్టుగా ఉన్న ఈ అమ్మకి మంచి ఫ్యూచర్ ఉందని భావించారు. మళ్లీ మళ్లీ ఆమె తెరపై కనిపిస్తూనే ఉంటుందిలే అని మనసులకు సర్ది చెప్పుకున్నారు. వాళ్లు ఆశించినట్టుగానే 'పిల్లా నువ్వులేని జీవితం' భారీ విజయాన్ని సాధించింది. ఆ తరువాత వచ్చిన 'సుబ్రమణ్యం ఫర్ సేల్' .. 'జ్యో అచ్యుతానంద' సినిమాలు యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. దాంతో ఈ అమ్మడు స్టార్ హీరోయిన్స్ రేసులోకి ఎంట్రీ ఇస్తుందని అంతా అనుకున్నారు .. కానీ అలా జరగలేదు.

అందం .. అభినయం ఉన్నప్పటికీ అదృష్టం లేకపోతే విజయాలు కూడా విలనిజం చూపిస్తాయి. తెలుగులో సక్సెస్ గ్రాఫ్ పడిపోతూ ఉండటంతో, సహజంగానే రెజీనా తమిళ అవకాశాల పట్ల శ్రద్ధపెట్టింది. తమిళ సినిమాలు అందిస్తున్న ఫలితాలు ఆమెకి ఆశాజనకంగా అనిపించాయి. ఈ నేపథ్యంలోనే తెలుగులో ఆమె చేసిన 'ఎవరు?' సినిమా మంచి విజయాన్ని అందించింది. బలమైన స్క్రీన్ ప్లే తో ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేసింది. రెజీనాను మరింత గ్లామరస్ గా చూపించడమే కాకుండా, ఆమెలోని నటిని కొత్త కోణంలో ఆవిష్కరించింది. దాంతో ఈ సుందరి తిరిగి ఇక్కడ బిజీ అవుతుందనే టాక్ వినిపించింది.

కానీ రెజీనా ఇప్పుడు వెంటనే తెలుగు సినిమాలు చేసే పరిస్థితి లేదు. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను తమిళ సినిమాలు ఉన్నాయి. విశాల్ .. జై .. అరవిందస్వామి .. సందీప్ కిషన్ .. ఎస్. జె. సూర్య కాంబినేషన్లో ఈ సినిమాలు రూపొందుతున్నాయి. విభిన్నమైన జోనర్లలో నిర్మితమవుతున్న ఈ సినిమాల్లో, ఒకదానితో ఒకటి సంబంధం లేని వైవిధ్యభరితమైన పాత్రలను ఆమె పోషిస్తోంది. ఈ పాత్రలు తన కెరియర్ కి ఎంతో హెల్ప్ అవుతాయనే ఆశాభావంతో ఆమె ఉంది. రెజీనా ఆశిస్తున్నట్టుగా ఈ సినిమాలు అక్కడ ఆమెకి స్టార్ డమ్ తెచ్చిపెట్టాలని కోరుకుందాం! ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఆమెకి శుభాకాంక్షలు అందజేస్తూ, మరిన్ని సక్సెస్ లు అందుకోవాలని ఆశిద్దాం!!