Begin typing your search above and press return to search.

ట్రెండింగ్: యూట్యూబ్ మాఫియా కొత్త దోపిడీ

By:  Tupaki Desk   |   1 Nov 2019 5:30 PM GMT
ట్రెండింగ్: యూట్యూబ్ మాఫియా కొత్త దోపిడీ
X
కొత్తొక వింత‌.. పాతొక రోత‌! డిజిట‌ల్ లో కొన్ని తీవ్ర ప‌రిణామాల‌పై ప్ర‌స్తుతం ప‌రిశ్ర‌మ‌లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. సినిమాల ప్ర‌మోష‌న్స్ కొత్త పుంత‌లు తొక్కుతున్న వేళ యూట్యూబ్ లైక్స్ క్లిక్స్ కోసం వెంప‌ర్లాట ప్ర‌స్తుతం నిర్మాత‌ల్లో వేలం వెర్రిగా మారింద‌ని చెబుతున్నారు. ప‌లు మాఫియాల్ని న‌మ్మి.. ముందు మునిగిపోయాక ఆన‌క అస‌లు విష‌యం గ్ర‌హిస్తున్నార‌ట‌.

రిల‌య‌న్స్ జియో పుణ్య‌మా అని ఊరూ వాడా ఇంట‌ర్నెట్ సౌక‌ర్యం అందుబాటులోకి వ‌చ్చింది. తొంద‌ర్లోనే జియో ఫైబ‌ర్ నెట్ కూడా అందుబాటులోకి తెచ్చేందుకు స‌న్నాహ‌కాల్లో ఉన్న నేప‌థ్యంలో నెట్ విప్ల‌వంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇక ఇదే అద‌నుగా డిజిటల్ మాధ్య‌మాల్లో సినిమాల‌ ప్ర‌చారం అంతే ఇదిగా కొత్త పుంత‌లు తొక్క‌డంపై చ‌ర్చ సాగుతోంది. ముఖ్యంగా యూట్యూబ్ వీడియోల‌కు వ్యూవ‌ర్ షిప్ పెరుగుతుండ‌డంతో వ్యూస్ కోసం ప్ర‌త్యేకించి ఒక మాఫియా కూడా రెడీ అయ్యి సినిమాల‌కు ఆన్ లైన్ ప్ర‌చారం చేసేస్తాం అంటూ కాసులు దండుకుంటున్నార‌ట‌. యూట్యూబ్ క్లిక్ లు వ‌స్తే చాలు అంటూ నిర్మాత‌ల్ని ఈ కొత్త‌ర‌కం మాఫియా వాళ్లు మ‌భ్య పెడుతున్నార‌ట‌.

ఇటీవ‌ల ఇన్ స్టా.. టిక్ టాక్ ప్ర‌చారం భేష్‌! అంటూ బ‌య‌ల్దేరారు కొంద‌రు. వీళ్ల‌తో సినిమా కాన్సెప్ట్ మీద చిన్న చిన్న వీడియోలు చేయించి పోస్టులు పెట్టిస్తున్నారు. ఇలా చేస్తే వేల కొద్దీ వ్యూస్ వ‌చ్చేస్తాయ‌ని న‌మ్మి ఈ త‌ర‌హా మాఫియాని నిర్మాత‌లు పెంచి పోషిస్తున్నారు. అయితే ఈ ప్ర‌య‌త్నంలో కింది సెంట‌ర్స్ జ‌నాల‌కు ఆ వీడియోలు పూర్తిగా చేర‌క‌పోవ‌డంతో ఆశించిన ఫ‌లితం రావ‌డం లేదన్న‌ది గ్రౌండ్ రిపోర్ట్. జేబులు గుల్ల చేసుకున్నా థియేట‌ర్ల నుంచి ఆశించిన రెవెన్యూ రాక నిర్మాత‌లు ల‌బోదిబోమంటున్నార‌ట‌.

ఏమిటో ఈ మాయ‌.. ఈ రాంగ్ మానియా.. త‌ప్పుడు దారి అన్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. అస‌లు ఈ త‌ర‌హా ప్ర‌చారాన్ని న‌మ్మాలా? అంటే ఇదో ఫాల్స్ మానియా అని అన‌లిస్టులు విశ్లేషిస్తున్నారు. యూట్యూబ్ లో లైక్ లు క్లిక్ లు కొడితే సినిమాలు ఆడ‌తాయా? అది స‌రైన ప్ర‌చారానికి కొల‌మానమా? అంటూ కొంద‌రు దీనిని వ్య‌తిరేకిస్తున్నారు. ఈ త‌ప్పుడు ప్ర‌చారాన్ని న‌మ్మి నిర్మాత‌లు జేబులు గుల్ల చేసుకోవ‌డంపై ఆస‌క్తిగా ముచ్చ‌టించుకుంటున్నారు. ఆస‌క్తి రేకెత్తించే ఏ ట్రైల‌రో లేక టీజ‌ర్ నో చూసి జ‌నాలు సినిమాకి వ‌స్తారు అనుకోవ‌చ్చు కానీ..ఈ వేలం వెర్రి వేషాలేమిటి? అంటూ చీవాట్లు పెట్టేస్తున్నారు కొంద‌రైతే.