Begin typing your search above and press return to search.

'అతిథి దేవోభవ' ట్రైలర్: అభయ్ భయపడతాడు.. భయపెడతాడు..!

By:  Tupaki Desk   |   6 Jan 2022 3:35 AM GMT
అతిథి దేవోభవ ట్రైలర్: అభయ్ భయపడతాడు.. భయపెడతాడు..!
X
యువ కథానాయకుడు ఆది సాయి కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ ''అతిథి దేవోభవ''. నాగేశ్వర్ పొలిమేర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నువేక్ష హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. 'ఆర్.ఆర్.ఆర్' సినిమా వాయిదా పడటంతో జనవరి 7న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

ఇప్పటికే 'అతిథి దేవోభవ' చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ - టీజర్ - 'బాగుంటుంది నువ్వు నవ్వితే' 'గాజుబొమ్మ తీరున' పాటలకు మంచి స్పందన లభించింది. రిలీజ్ కు మరికొన్ని గంటలు మాత్రమే ఉండటంతో.. బుధవారం హీరో నాని చేతుల మీదుగా సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను ఆవిష్కరించారు.

'బుద్ధుడికి ఏకాంతంలో ఉన్నప్పుడు జ్ఞానోదయం కలిగింది' అని హీరోయిన్ చెప్పగా.. 'ఒంటరిగా ఉంటే జ్ఞానం పుడుతుందా.. మరి నాకేంటి భయం పుడుతుంది' అని ఆది సాయి కుమార్ చెప్పే డైలాగ్‌ తో ఈ ట్రైలర్‌ ప్రారంభమవుతుంది. ఇందులో ఒంటరిగా ఉండాలంటే భయపడే అభయ్ రామ్ అనే పాత్రలో ఆది కనిపించారు.

తనలోని భయం కారణంగా అభయ్ ఎలాంటి పరిస్థితులను సవాళ్ళను ఎదుర్కోవాల్సి వచ్చింది? ఏమేమి వదులుకోవాల్సి వచ్చిందనేది 'అతిథి దేవోభవ' చిత్రంలో చూపించబోతున్నారు. ఓవైపు భయపడుతూ మరోవైపు భయపెడుతుండటం అనే కాన్సెప్ట్ ఆసక్తికరంగా ఉంది.

ఇది లవ్ - యాక్షన్ - ఎమోషన్ కలబోసిన థ్రిల్లర్ మూవీ అని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. 'ప్రాణం పోతుందేమోనన్న భయంలో.. ప్రాణాన్నే పోగొట్టుకున్నాను' అనే డైలాగ్ ఆలోచింపజేస్తోంది. ఇందులో రోహిణి - సప్తగిరి - సూర్య - ఆదర్శ్ - రవి ప్రకాష్ - రఘు కారుమంచు - మణిచందన - భెల్ ప్రసాద్ - గుండు సుదర్శన్ - ప్రియాంక - నవీనా రెడ్డి - సత్తిపండు - ఇమ్మాన్యుయేల్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

'అతిథి దేవోభవ' చిత్రానికి వేణు గోపాల్ రెడ్డి కథ అందించగా.. రజనీ రాజబాబు స్క్రీన్ ప్లే - డైలాగ్స్ రాశారు. శేఖర్ చంద్ర సంగీతం సమకూర్చారు. అమరనాధ్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ అందించగా.. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ వర్క్ చేశారు. రామ సత్యనారాయణ రెడ్డి సమర్పణలో శ్రీనివాస సినీ క్రియేషన్స్ బ్యానర్ పై రాజబాబు మిర్యాల - అశోక్ రెడ్డి మిర్యాల సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. ఎప్పటినుంచో సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న ఆది సాయికుమార్ కు ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.